భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం!

Spread the love

భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం!

N TODAY NEWS: ప్రత్యేక కథనం

దేశంలోనే తొలిసారిగా సహజ మరణం పొందిన వ్యక్తి నుంచి అవయవాల సేకరణ

ఢిల్లీ మణిపాల్ ఆసుపత్రి వైద్యులు సాధించిన ఘనత

‘నార్మోథెర్మిక్‌ రీజనల్‌
పర్ఫ్యూజన్‌’ అనే ప్రత్యేక ప్రక్రియ వినియోగం

గుండె ఆగిపోయిన 5 నిమిషాల తర్వాత కాలేయం, కిడ్నీల సేకరణ

మోటార్ న్యూరాన్ వ్యాధిగ్రస్థురాలు గీతాచావ్లా అవయవదానంతో ఆదర్శం

బ్రెయిన్‌డెడ్ కేసుల్లోనే సాధ్యమనుకున్న అవయవదానంలో కొత్త శకం ఆవిష్కృతమైంది
భారత వైద్య రంగంలో ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా, సహజంగా మరణించిన వ్యక్తి నుంచి వైద్యులు విజయవంతంగా అవయవాలను సేకరించారు. ఢిల్లీలోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు ఈ అరుదైన ఘనత సాధించారు. ఈ సంఘటనతో అవయవదానంపై ఉన్న పరిమితులు తొలగిపోయి, కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణంగా మన దేశంలో బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. అంటే, మెదడు పనిచేయడం ఆగిపోయినా గుండె కొట్టుకుంటున్న వారి నుంచే అవయవదానానికి చట్టపరమైన అనుమతి ఉంది. కానీ, ఢిల్లీ వైద్యులు ‘నార్మోథెర్మిక్‌ రీజనల్‌ పర్ఫ్యూజన్‌’ అనే ప్రత్యేక ప్రక్రియ ద్వారా సహజ మరణం తర్వాత కూడా అవయవాలను సేకరించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతున్న 55 ఏళ్ల గీతాచావ్లా ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆమె ముందుగానే తన అవయవాలను దానం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నవంబర్ 6వ తేదీ రాత్రి 8.43 గంటలకు ఆమె గుండె ఆగిపోవడంతో సహజంగా మరణించారు. చట్టపరమైన నిబంధనల దృష్ట్యా, ఆమె మరణించిన ఐదు నిమిషాల తర్వాత వైద్యులు ఈ ప్రత్యేక ప్రక్రియను ప్రారంభించారు. ఈ విధానంలో పంప్ ద్వారా ఆమె పొత్తికడుపు భాగానికి రక్త ప్రసరణను కృత్రిమంగా పునరుద్ధరించారు. దీనివల్ల కాలేయం, మూత్రపిండాలు పాడవకుండా సజీవంగా ఉన్నాయి. అనంతరం వాటిని విజయవంతంగా సేకరించి, అవసరమైన వారికి అమర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రక్రియ గత రెండు దశాబ్దాలుగా వాడుకలో ఉన్నప్పటికీ, మన దేశంలో దీనిని చేపట్టడం ఇదే ప్రథమం. ఈ విజయంతో దేశంలో అవయవాల కొరతను అధిగమించేందుకు ఒక కొత్త మార్గం తెరుచుకున్నట్లయింది. గీతాచావ్లా కుటుంబం తీసుకున్న గొప్ప నిర్ణయం, వైద్యుల నైపుణ్యం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »