ప్రమాదపుటంచున- ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీ
NTODAY NEWS: ప్రత్యేక కథనం
భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సెక్టర్లు ప్రజల పొదుపులను సురక్షితంగా నిర్వహిస్తూ, దేశాభివృద్ధికి సహకరిస్తున్నాయి. అయితే, ఇటీవలి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఈ సంస్థల స్వభావాన్ని మార్చేసే దిశగా సాగుతున్నాయి. అక్టోబర్ 2025లో, కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో మేనేజింగ్ డైరెక్టర్ (ఎమ్‌డీ) పదవులను ప్రైవేట్ సెక్టర్ నిపుణులకు ఓపెన్ చేశారు.
ఇది మొదట్లో కొత్తగా అనిపించినా, ఇది ప్రభుత్వ రంగాలను బలహీన పరచడానికి, చివరికి పూర్తి ప్రైవేటీకరణకు దారి తీసే ప్రమాదకరమైన అడుగు. ఈ నిర్ణయం ద్వారా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలలో అత్యున్నత స్థానాలకు బయటి వ్యక్తులను నియమించడం సాధ్యమవుతుంది. సాధారణంగా, ఈ పదవులకు అర్హత సంపాదించడానికి ఉద్యోగులు 30 ఏళ్లకు పైగా సర్వీసు చేసి, అంచెలంచెలుగా ఎదగాలి. ఉదాహరణకు, ఎల్‌ఐసీలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ప్రారంభించి, దశాబ్దాల అనుభవంతో ఎమ్‌డీ స్థాయికి చేరుకుంటారు. కానీ ఇప్పుడు, ప్రైవేట్ సెక్టార్ నుండి 21 ఏళ్ల అనుభవం ఉన్నవారు దీనికి అర్హులవుతారు.ఇది చట్టపరమైన మార్పులు లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా జరగడం వివాదాస్పదం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1955, ఎల్‌ఐసీ యాక్ట్ 1956 వంటి చట్టాలలో మార్పులు తీసుకురాకుండా ఇలాంటి మార్గదర్శకాలు జారీ చేయడం లోపభూయిష్టమని విమర్శకులు అంటున్నారు.
ఈ మార్పుల వెనుక ఉద్దేశం ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతుల్లోకి తరలించడమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ నియామకాలు దీనికి ఉదాహరణ. రఘురాం రాజన్, ఉర్జీత్ పటేల్ వంటి ఆర్థిక/బ్యాంకింగ్ నిపుణులు ప్రభుత్వ విధానాలతో విభేదించి రాజీనామా చేసిన తర్వాత, ఐఏఎస్ అధికారిని నియమించి ప్రభుత్వానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇలాంటివి ప్రభుత్వ రంగాల స్వాతంత్ర్యాన్ని కోల్పోయేలా చేస్తాయి. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలలో ప్రైవేట్ ఎమ్‌డీలు వచ్చాక, అంతర్గత ఉద్యోగుల నిర్ణయాలకు ప్రాధాన్యత తగ్గుతుంది. ప్రభుత్వ పక్షపాతం పెరిగి, సంస్థల స్వయంప్రతిపత్తి ప్రశ్నార్థకమవుతుంది.
ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలు బహుముఖాలు. ముందుగా, సామాజిక లక్ష్యాలు నిర్లక్ష్యమవుతాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాధాన్య రంగాలకు రుణాలు ఇవ్వడం, పేదలకు సబ్సిడీలు అందించడం వంటివి చేస్తాయి. ప్రైవేట్ బ్యాంకులు లాభాలు పై దృష్టి పెట్టి, ఈ సేవలను తగ్గిస్తాయి. ఉదాహరణకు, ప్రైవేటీకరణ తర్వాత మధ్యతరగతి, పేదలు బ్యాంకింగ్ సేవలకు దూరమవుతారు, ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు పట్టణ,నగర ప్రాంతాలకు, ఆర్థికంగా ఉన్నత వర్గాల కస్టమర్ల కే ప్రాధాన్యత ఇస్తాయి.గణాంకాల ప్రకారం, భారతదేశంలో ప్రభుత్వ బ్యాంకులు 70 శాతానికి పైగా గ్రామీణ బ్రాంచ్‌లను నిర్వహిస్తున్నాయి. కానీ, ప్రైవేటీకరణతో ఇవి మూసివేసే అవకాశం ఉంది.
ఇన్సూరెన్స్ సెక్టార్ లో కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. ఎల్‌ఐసీ భారతదేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ ప్రొవైడర్, 66 శాతం కు పైగా మార్కెట్ షేర్ తో ఉంది.దాని ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో 2025లో సుమారు 15 లక్షల కోట్ల రూపాయలు, ఇందులో 75 శాతానికి కు పైగా ప్రభుత్వ సెక్యూరిటీలు, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు కలిగి ఉంది. ఎల్‌ఐసీ యాక్ట్ 1956 ప్రకారం, ప్రీమియం నిధులను సురక్షితంగా, జాతీయ అభివృద్ధికి వినియోగించాలి. ప్రైవేట్ మేనేజ్‌మెంట్ వచ్చాక, లాభాపేక్షతో రిస్కీ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్లకు మారడం సాధ్యం అవుతుంది. ఇది పాలసీహోల్డర్ల డబ్బుకు, అవసరాలకు , రక్షణను ప్రమాదంలో పడేస్తుంది. క్లెయిమ్‌ల చెల్లింపు ఆలస్యమవుతుంది, ఏజెంట్ల నియంత్రణ తగ్గుతుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు లాభాల కోసం నాణ్యతా వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేస్తాయి. దీంతో పేదలకు ఇన్సూరెన్స్ దూరమవుతుంది.
టెలికాం సెక్టర్ ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. 2014లో 13 ప్రైవేట్ ఆపరేటర్లు ఉండగా, రిలయన్స్ జియో వచ్చాక పోటీ పెరిగి, ధరలు తగ్గాయి. కానీ ఇప్పుడు మూడు ప్రైవేట్ ప్లేయర్లు మాత్రమే మిగిలాయి, జియో మార్కెట్‌ను ఆధిపత్యం చేస్తోంది. పోటీ పేరుతో ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ, చివరికి గుత్తాధిపత్యానికి (మోనోపొలీకి ) దారి తీసింది. సేవలు చౌకగా ఉన్నాయి కానీ, లాభాల కోసం ఆపరేటింగ్ ఖర్చులు పెంచకుండా ఉంచడం సాధ్యం కాదు. అందువల్ల ప్రజలకు నష్టం జరుగుతోంది.
అదేవిధంగా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌లో ప్రైవేట్ డైరెక్టర్లు వచ్చాక, పనితీరు లోపాలు ప్రకటించి పూర్తి ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తారు.ఉద్యోగాల కోల్పోవడం మరో పెద్ద నష్టం. ప్రభుత్వ రంగాలు ఓవర్‌స్టాఫ్డ్‌గా ఉన్నాయని, ప్రైవేటీకరణతో ఉద్యోగాలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆర్థిక అసమానతలు పెరుగుతాయి, ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు ధనికులకు మాత్రమే సేవలు అందిస్తాయి.వ్యవస్థాపరంగా రిస్కులు కూడా పెరుగుతాయి; ప్రభుత్వ బ్యాంకులు ఆర్థిక సంక్షోభాల్లో స్థిరత్వాన్ని ఇస్తాయి, కానీ ప్రైవేట్ మేనేజ్‌మెంట్ రిస్కీ నిర్ణయాలు తీసుకోవచ్చు.
చివరగా, ఈ మార్పులు దేశ పొదుపులను ప్రమాదంలో పడేస్తాయి. ఎల్‌ఐసీ వంటి సంస్థలు లక్షల కోట్ల నిధులను జాతీయ మౌలిక వసతులకు వినియోగిస్తున్నాయి. ప్రైవేటీకరణతో ఇవి లాభాపేక్షలకు మారి, ప్రజలకు నష్టం జరుగుతుంది. బ్యాంక్ యూనియన్లు ఈ నిర్ణయాన్ని ‘ప్రమాదకరమైన ముందడుగు’గా అభివర్ణిస్తున్నాయి.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలను పునరాలోచించాలి. లేకపోతే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం, సామాజిక న్యాయం కూడా ప్రశ్నార్థకమవుతాయి.
*డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్. 9849328496.

