రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Spread the love

రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా, మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు (FDC) జారీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వన్ స్టేట్ – వన్ కార్డు ఆలోచనతో చేపట్టిన ఈ బహుళ ప్రయోజన కార్డుల జారీ ప్రక్రియను ప్రజలంతా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనకు సంబంధించిన సర్వే పత్రాలను సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సిఖ్ విలేజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగారు లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రాధాన్యతను ముఖ్యమంత్రి వివరించారు.రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, రైతు బీమా, రైతు భరోసా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు 30 శాఖలు 30 రకాలుగా సమాచారం సేకరించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి.
అలా కాకుండా అర్హులైన వారందరూ ఒకే కార్డు ద్వారా ఈ సేవలు పొందడానికి వీలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు అందజేస్తారు.ఇందుకోసం 3 నుంచి 7 వ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. ప్రతిపక్షాలు దీనిపై ఎవైనా సూచనలు, సలహాలు ఉంటే ఇవ్వాలి.కుటుంబంలో సభ్యులు పెరిగినందున ప్రజలంతా కుటుంబ డిజిటల్ కార్డు కోసం వివరాలను నమోదు చేయించుకోవాలి. ఇందులో అవసరమైన మార్పుచేర్పులు ఎప్పుడైనా చేసుకోవచ్చు.ఒక్క క్లిక్ తో కుటుంబ సమగ్ర సమాచారం ఉండాలన్న ఆలోచనతో ఈ విధానం తీసుకొచ్చాం.ఒకసారి కార్డు పొందిన తర్వాత రేషన్ తో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను ఎక్కడి నుంచైనా పొందడానికి వీలుంటుంది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ,సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్, ఎమ్మెల్యే శ్రీగణేశ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి , ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »