జగన్ పాలనలో రాష్ట్ర ఖాతాలో అవినీతి జమ.. అభివృద్ధి మమా. : మాజీమంత్రి ప్రత్తిపాటి
NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా
• డెవలప్ మెంట్ అంటే 16 నెలల జైల్ ట్రీట్మెంట్, పదితరాలకు సరిపడా సెటిల్మెంట్ కాదు జగన్ : ప్రత్తిపాటి
• రాష్ట్రానికి అంతా తానే చేస్తే ప్రజలు 11తో ఎందుకు సత్కరించారో, ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయికి ఎందుకు దిగజార్చారో జగనే చెప్పాలి : ప్రత్తిపాటి.
• ప్రజల, ప్రభుత్వ ఆస్తులు దోచేసే చీకటి జీవోలు.. చట్టాలు జగన్ క్రెడిట్లో భాగాలే. : ప్రత్తిపాటి.
• వేలకోట్ల ఇసుకదోపిడీ.. జే బ్రాండ్ మద్యం.. జే ట్యాక్స్ దెబ్బకు పరిశ్రమల పలాయనం జగన్ ఘనతలే : ప్రత్తిపాటి.
బడాచోర్ జగన్ క్రెడిట్ చోరీ అంటుంటే వైసీపీ శ్రేణులే నివ్వేర పోతున్నాయి
“జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఖాతాలో అంతులేని అవినీతి, అప్రతిష్ట జమ అయితే.. అభివృద్ధి మమా అన్న విధంగా జరిగింది. ఆయనకు, వైసీపీనేతలకు తమ ఖాతాల్లో అంతులేని అవినీతి సంపద జమైతే, రాష్ట్రానికి, ప్రజలకు మాత్రం ఎప్పటికీ పూడ్చలేని భారీనష్టం జరిగింది. ప్రజాసంక్షేమం నేతిబీరలో నెయ్యి చందంగా అమలైంది. ఐదేళ్లలో నూరేళ్లకు సరిపడా నష్టాన్ని, విధ్వంసాన్ని రాష్ట్రానికి ప్రజలకు కానుకగా ఇచ్చిన క్రెడిట్ జగన్ కే సాధ్యమైంది. క్రెడిట్ చోరీ గురించి జగన్ మాట్లాడుతుంటే ప్రజలతో పాటు వైసీపీశ్రేణులే నివ్వెరపోతున్నాయి. తండ్రి పాలనలో లక్షలకోట్లు కొల్లగొట్టిన బడా చోర్.. క్రెడిట్ చోరీ అంటుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు. అంగుళం భూమి.. అరపైసా నిధులు ఇవ్వకుండా విమానాశ్రయాలు, పోర్టులు నిర్మించడం కలల సామ్రాజ్యంలోనే సాధ్యమవుతుందని, డెవలప్ మెంట్ అంటే 16 నెలల జైల్ ట్రీట్మెంట్, పదితరాలకు సరిపడా ప్రజాధనం సెటిల్మెంట్ కాదనే వాస్తవాన్ని జగన్ గ్రహిస్తే మంచిది..
నూరేళ్లకు సరిపడా నష్టమే జగన్ చేసిన అభివృద్ధి
ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి నూరేళ్లకు సరిపోయే నష్టమే జగన్ చేసిన అభివృద్ధి. ప్రజల, ప్రభుత్వ ఆస్తులు దోచేసే చీకటి జీవోలు.. చట్టాలు జగన్ క్రెడిట్లో భాగాలే. వేలకోట్ల ఇసుకదోపిడీ.. జే బ్రాండ్ మద్యం.. జే ట్యాక్స్ ధాటికి పరిశ్రమల పలాయనం జగన్ ఖ్యాతే. స్వప్రయోజానాలు పణంగా పెట్టి పొరుగు రాష్ట్ర నాయకులతో ములాఖత్ లు..ఏపీ సాగునీటి ప్రాజెక్టుల తాకట్లు జగన్ చలవే.
నా.. నా అంటూ నమ్మిన ఎస్సీ,ఎస్టీల నోట్లో మట్టి కొట్టి. బీసీలు, మైనారిటీల బతుకుల్లో నిప్పులు పోయడం జగన్ గొప్పతనమే రాష్ట్రానికి అంతా తానే చేస్తే ప్రజలు 11తో ఎందుకు సత్కరించారో, ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయికి ఎందుకు దిగజార్చారో జగనే చెప్పాలి. ఎన్నికల ఫలితాల తర్వాత నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు అన్యాయం చేశారని, బటన్ నొక్కుడుతో అందించిన డీబీటీ సాయం ఏమైందంటూ గుండెలు బాదుకుంది జగన్ కాదా?
చంద్రబాబుకు, ప్రభుత్వానికి మంచిపేరు రాకూడదన్న దుగ్దతో జగన్ మాట్లాడుతున్నాడు
గూగుల్ డేటా సెంటర్ తో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని తన అవినీతి మీడియాలో, పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేయించింది జగన్ కాదా? డేటాకు మైండ్ అప్లై చేస్తే ఏఐ అవుతుందన్నప్పుడే జగన్ కు దూరంగా ఉండాలని వైసీపీనేతలు, ప్రజలు గ్రహించారు. మొక్కుబడిగా చేపట్టిన ‘అన్నదాతలకు అండగా’ షో అట్టర్ ప్లాప్ అయినా, పెయిడ్ ఆర్టిస్టుల ప్రదర్శన నీరుగారినా జగన్ మతిభ్రమణానికి బ్రేకులు పడలేదని, చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదన్న దుగ్ధతో జగన్ సోయి లేకుండా మాట్లాడుతున్నాడని సొంతపార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. అనుకూల మీడియాతో, పార్టీ కార్యక్రమాల్లో గొప్పలు చెప్పుకోవడం తప్ప, అసెంబ్లీకి వచ్చి నోరు తెరిచే ధైర్యం జగన్ కు లేదని ప్రజలకు అర్థమైంది.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో ఎద్దేవాచేశారు.

