కార్పొరేషన్ సౌజన్యంతో ఆశ్రం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్
ఏలూరు, మే – 18…
మారుతోన్న జీవన శైలి, ఆహారపు అలవాట్లే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారకాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరులోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ సౌజన్యంతో ఆశ్రం ఆసుపత్రి ఆధ్వర్యంలో కార్పొరేషన్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులు, పారిశుద్ద్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ క్యాంపును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ప్రస్తుత తరుణంలో అత్యంత అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేందుకు అవసరమైన జీవన విధానాలను, ఆహారపు అలవాట్లను మెరుగుపర్చుకోవాలని హితవు పలికారు. ఇదే సమయంలో నిర్ధారణా పరీక్షలను కూడా క్రమం తప్పకుండా చేయించుకోవడం ద్వారా వ్యాధి తొలిదశలోనే గుర్తించగలిగితే నివారణకు ఆస్కారం పెరుగుతుందన్న ఆలోచనతోనే ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ కార్పొరేషన్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే క్యాన్సర్ నిర్ధారణా పరీక్షల క్యాంపును నిర్వహించినట్లు చెప్పారు. ఆశ్రం ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హేమా నలిని, డాక్టర్ డివి సాయి షణ్ముఖ గౌతమ్, డాక్టర్ సుప్రియ స్పందన, డాక్టర్ హరిత బృందం వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిసనర్ ఎ. భానుప్రతాప్, డిప్యూటి మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవానీ, కో – ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్ పెదబాబు, పలువురు కార్పొరేటర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు..