గూగుల్‌ డేటా సెంటర్‌-ప్రచార హోరు-వాస్తవాలు

Spread the love

గూగుల్‌ డేటా సెంటర్‌-ప్రచార హోరు-వాస్తవాలు

NTODAY NEWS: ప్రత్యేక కథనం

-డా|| బి. గంగారావు
94900 98792

విశాఖలో రూ.87,520 కోట్ల పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల సామర్ధ్యంగల ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు గూగుల్‌తో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ డేటా సెంటర్‌లో అదానీ, ఎయిర్‌టెల్‌ కూడా భాగస్వాములుగా ఉంటారని గూగుల్‌ ప్రకటించింది. గూగుల్‌ రాకతో అంతర్జాతీయ ప్రైవేట్‌ పెట్టుబడుల చిత్రపటంలో విశాఖపట్నం చోటు సంపాదించిందని, దీంతో విదేశీ ఐటీ దిగ్గజాలు తరలి వచ్చి బలమైన ఐటీ ఎకో సిస్టమ్‌ విశాఖలో ఏర్పడి అతి తక్కువ కాలంలో ఐటీతో పాటు కృత్రిమ మేధస్సు హబ్‌గా ఆంధ్ర రాష్ట్రం మారుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో వస్తాయని చెబుతున్నది. ఇది తీవ్ర నిరాశలో ఉన్న నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తిస్తున్నది.

విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌ను రప్పించటం కూటమి ప్రభుత్వ ఘనకార్యంగా కూటమి పార్టీలు చెప్పుకుంటున్నాయి. కాదు మా పాలనలోనే డేటా సెంటర్‌కి పునాది పడిందని వైసిపి వాదిస్తున్నది. ఈ వాదప్రతివాదాల మధ్య గూగుల్‌ వచ్చిన నేపథ్యాన్ని ఈ పార్టీలు మరుగు పరుస్తున్నాయి. గత కొంత కాలంగా అమెరికాలో డేటా సెంటర్లకు వ్యతిరేకంగా అక్కడి నివాసితులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యంలో 50 శాతానికి పైగా అమెరికాలోనే ఉన్నాయి. ఈ డేటా సెంటర్ల వల్ల ఆ ప్రాంత నివాసితులకు మంచినీరు, విద్యుత్‌ కొరత ఏర్పడటం, వీటి చార్జీలు పెరగడం, ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరగడంతో పాటు ఇతర పర్యావరణ సమస్యలు ఉత్పన్నం కావటంతో అక్కడి ప్రజలు ఆందోళనబాట పట్టారు. ఈ నిరసనల వల్ల సుమారు 64 బిలియన్‌ డాలర్లు విలువగల డేటా సెంటర్ల పెట్టుబడులు నిలిచిపోయాయి.

కొన్ని చోట్ల రద్దయ్యాయి. గూగుల్‌ కొత్తగా పెట్టబోయే డేటా సెంటర్లు కూడా కొన్ని ఆగిపోగా, కొన్నింటిని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకు గత సెప్టెంబర్‌లో ఇండియానాపోలిస్‌ కౌంటీలో గూగుల్‌ ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్‌ పెట్టాలని అక్కడి మెట్రోపాలిటన్‌ అభివృద్ధి రీజియన్‌ నుండి అనుమతులు పొందింది. 468 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. ఫలితంగా సెప్టెంబర్‌ 22వ తేదీన ఇండియానాపోలిస్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ను రద్దు చేసింది. దీంతో ఆఘమేఘాల మీద అదేరోజున ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి గూగుల్‌ సంస్థ డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ లెటర్‌ రాసింది. ఆ తరువాత అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలోనే భారత దేశంలో ఏఇ డేటా సెంటర్లు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విశాఖలో ఏర్పాటు కాబోయే గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌తో మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఐటీ రంగానికి, ఏఐ కి గేట్‌వే గా మారుతుందనే కూటమి ప్రభుత్వ ప్రచారంలో వాస్తవికత కనిపించడంలేదు.

గూగుల్‌ ఉద్యోగాల సృష్టిపై పెద్ద చర్చ నడుస్తున్నది. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.టి.పి.ఐ) ప్రకారం 2025 మార్చి నాటికి దేశంలో 67 ప్రధాన నగరాల్లో మాత్రమే ఐటీ, ఐటీ సంబంధిత కార్యకలాపాలు జరుగుతున్నాయి. మొత్తం ఈ నగరాల్లో ఐటీ సేవల ద్వారా 2024-25లో 283 బిలియన్‌ డాలర్లు ఆదాయం రాగా ఇందులో 224 బిలియన్‌ డాలర్లు (82 శాతం) ఎగుమతుల ద్వారా సమకూరింది.

94 శాతం సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు లేదా ఐటీ రంగ మొత్తం కార్యకలాపాలకు కేవలం ముంబయి, పూనే, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా వంటి 7 మెట్రోపాలిటన్‌ నగరాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. డేటా సెంటర్లు లేకపోయినా ఈ నగరాలు ఐటీ కి కేంద్ర నగరాలుగా మారాయి. దేశంలో ఐటీ సేవల్లో ప్రస్తుతం పనిచేస్తున్న 56 లక్షల ఉద్యోగుల్లో కూడా 95 శాతానికి పైగా ఈ నగరాల్లోన్నే ఉన్నారు. మిగిలిన టైర్‌ 2 టైర్‌ 3 నగరాల్లో కేవలం 2.90 లక్షలు మాత్రమే ఉన్నారు.

నేడు ప్రపంచంలో ముఖ్యంగా పెట్టుబడిదారీ దేశాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే భవిష్యత్తులో కూడా టైర్‌ 2,3 నగరాలకు ఐటీ కార్యకలాపాలు పెద్దఎత్తున విస్తరణ అయ్యేందుకు అవకాశాలు లేవు. ఎందుకంటే మన ఐటీ ఎగుమతుల్లో 65 శాతం అమెరికాకు వెళుతుండగా ఆ తరువాత బ్రిటన్‌ (17 శాతం), యూరోప్‌ (11 శాతం), ఆసియా పసిఫిక్‌ (8 శాతం) ప్రాంతానికి ఎగుమతి అవుతున్నాయి. అమెరికాలో నిరుద్యోగం పెరగడం, ఆర్థిక సంక్షోభం నుండి బయటపడలేక పోవడంతో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం నేడు తీవ్ర రక్షణవాద చర్యలకు పాల్పడుతున్నది. ముఖ్యంగా అమెరికా ఆదేశంలోని ఐటీ, ఇతర వాణిజ్య సంస్థలు అమెరికా వెలుపల దేశాల్లో ఔట్‌ సోర్సింగ్‌ చేసిన ఉద్యోగులపై 25 శాతం పన్ను విధించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నది.

అందుకు హాల్టింగ్‌ ఇంటర్నేషనల్‌ రీలక్సేషన్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ (హైర్‌ యాక్ట్‌) బిల్లును తీసుకు రావటానికి రిపబ్లికన్లు అమెరికా సెనేట్‌లో ప్రయత్నం కూడా చేశారు. ఈ చట్టం వస్తే అమెరికా కంపెనీలు భారీగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఖర్చు తగ్గించుకోవలసి ఉంటుంది. ఈ చర్యలు భారత ఐటీ రంగాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి. ఈ రంగంలో మన దేశంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తొలగింపులకు గురౌతారు. కొత్తగా ఐటీ అవుట్‌సోర్సింగ్‌ ఒప్పందాలు కూడా తగ్గిపోతాయి.

విశాఖలో వచ్చే ఏఐ డేటా సెంటర్‌ వల్ల 5 వేలకు మించి ఉద్యోగాలు రావని స్పష్టమౌతున్నది. ఇదే ప్రపంచ అనుభవం కూడా. విశాఖలో వస్తున్నది ఏఐ హబ్‌తో కూడిన డేటా సెంటర్‌ కనుక లక్షల్లో ఉద్యోగాలు సృష్టించబడతాయని ప్రభుత్వ వాదన. అలాగే గూగుల్‌ అంతర్జాతీయ అతి పెద్ద టెక్‌ కంపెనీ కనుక శక్తివంతమైన ఐటీ, ఏఐ ఎకో సిస్టమ్‌ ఏర్పడుతుందని ప్రచారం. ప్రభుత్వమే కాదు కొంతమంది మధ్యతరగతి వర్గంలో కూడా ఈ భావన ఉంది. ఆ విధంగా వస్తే మంచిదే. రాష్ట్రానికి ఎంతో ఉపయోగం కూడా జరుగుతుంది.
నేడు కృత్రిమ మేధస్సు టెక్నాలజీ ప్రవేశంతో ఐటీ రంగం అతలాకుతలం అవుతున్నది.

ఐటీ దిగ్గజాలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఐటీ రంగంలోనే కాదు భవిష్యత్తులో ఇతర సేవా రంగాలు, పారిశ్రామిక రంగలో కూడా వచ్చే ఉద్యోగాలు కన్నా తొలగించే ఉద్యోగాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏఐ నైజమే ఇది. పెట్టుబడిదారులు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని ఉత్పత్తి వ్యయంలో కార్మికుల వేతనాలపై పెట్టే వ్యయ నిష్పత్తిని బాగా తగ్గించుకొని లాభాలు పెంచుకుంటున్నారు.

దీనివల్ల ఉత్పత్తి కార్యకలాపాలు పెరిగినా అంతిమంగా ఆర్థిక వ్యవస్థలో వినిమయం తగ్గి పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరుగుతుంది. కనుక ప్రభుత్వం ప్రకటిస్తున్నట్లు 5 లక్షల ఐటీ ఉద్యోగాలు ఈ ఐదేళ్లలో వస్తాయనేది ఆచరణలో సాధ్యమయ్యేది కాదు. మైక్రోసాఫ్ట్‌, కాగ్నిజెంట్‌ వంటి టెక్‌ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి అని పాలకులు చెబుతున్నారు. భూములు కూడా ఎకరా 99 పైసలు చొప్పున కేటాయించారు. ఇప్పటికీ ఆ సంస్థల నుండి చర్యలు కనిపించడం లేదు.

ఇక గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు కీలకంగా అవసరమయ్యే విద్యుత్‌, మంచి నీటి సమస్య ముందుకొచ్చింది. ఈ సమస్య చాలా పెద్దది. 1000 మెగావాట్ల విద్యుత్‌ను అంతరాయం లేకుండా సరఫరా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. హైడ్రో, సౌర వంటి పునరుత్పాదక విద్యుత్‌ శక్తిని సరఫరా చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు. 1000 మెగావాట్లు అంటే నెలకి సగటున 200 యూనిట్లు వినియోగించే 5 లక్షల ఇళ్ల విద్యుత్‌ వినియోగానికి సమానం. అంటే సుమారుగా విశాఖ నగరంలో నివాస గృహాలకు సరఫరా చేస్తున్న విద్యుత్‌కు సమానం. ఈ విద్యుత్‌ ఎక్కడ నుండి సరఫరా చేస్తారో బయటికి చెప్పటంలేదు.

ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ కాబట్టి రోజుకి సుమారు 50 మిలియన్‌ గ్యాలన్ల (ఎం.జి.డి) నీరు డేటా సెంటర్‌కి అవసరం అంటున్నారు. ఇది విశాఖ నగరంలోని 25 లక్షల మది ప్రజలు వాడుతున్న నీటికి సమానం. ప్రస్తుతం రెండే మార్గాలు ఉన్నాయి. గూగుల్‌ నిర్మాణం పూర్తి చేసేలోపు అనగా ఈ మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఎడమ కాలువ ద్వారా విశాఖకు మంచినీరు సరఫరా అయితే ఇబ్బంది ఉండదు. ఆది పూర్తి కాకపోతే రైతుల సాగునీటి రిజర్వాయర్లైన తాటిపూడి, రైవాడ వంటి అనేక వాటి నుండి రైతులకు అన్యాయం చేసి గూగుల్‌కి నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా గూగుల్‌కి రూ 22 వేల కోట్లు రాయితీలు ఇస్తున్నది. ఇందులో 480 ఎకరాల భూ సబ్సిడీ లేదు. మార్కెట్‌ రేటు ప్రకారం అదో 3 వేల కోట్లు ఉంటుంది. అంతేకాక విద్యుత్‌ సరఫరాకు ప్రత్యేక హై టెన్షన్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు ఏర్పాటు, నీటి సరఫరా లైన్లు, మంచినీటి నిరాటక సరఫరాకు అవసరమైన భారీ రిజర్వాయర్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.10 వేల కోట్లు పైనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మొత్తంగా చూస్తే పైకి రూ.22 వేల కోట్లు రాయితీలుగా కనిపిస్తున్నా మొత్తం రూ.35 వేల కోట్లు పైగానే ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ఇదంతా ప్రజలు చెల్లించే పన్నుల నుండే గూగుల్‌కి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. డేటా సెంటర్‌ను ఏకంగా విశాఖ జనావాసాల మధ్య పెట్టటానికి నిర్ణయించారు. దీనివల్ల ఆ చుట్టూ వేడి వాయువులు విస్తరించడం, ఇతర పర్యావరణ సమస్యలు కూడా తలెత్తతానికి అవకాశం ఉంది.

గూగుల్‌ నుండి గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఆదాయం పెరిగే చర్యలు కూడా ఒప్పందంలో పేర్కొనలేదు. పైపెచ్చు నీటి సరఫరాలో 25 శాతం రాయితీ ప్రకటించారు. అంటే కేవలం కిలో లీటర్‌ 15 రూపాయలకే సరఫరా చేస్తుంది. ఇప్పుడు పరిశ్రమలకు జి.వి.ఎం.సి 70 రూపాయలకు, అపార్ట్‌మెంట్‌ వాసులకు 30 కిలోలీటర్లు దాటితే కిలో లీటర్‌ 30 రూపాయలకు సరఫరా చేస్తున్నది. ఇంత భారీ తగ్గింపు వల్ల జి.వి.ఎం.సి ఏడాదికి రూ.350 కోట్ల పైనే నష్టపోతుంది. విశాఖ నగర వాసులకు ఉచిత డేటా, ఉచిత హాట్‌ స్పాట్‌లు వంటి సదుపాయాలు కూడా గూగుల్‌ నుండి ప్రభుత్వం రాబట్టే ప్రయత్నం చేయలేదు.

స్థూలంగా గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఐటీతో ఏఐ హబ్‌గా మారుతుందో లేదోగానీ గూగుల్‌కు మాత్రం తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి విశాఖ నగరం అంతర్జాతీయ సబ్‌ సీ గేట్‌వే గా ఉపయోగపడుతుంది. అంతేగాక భారత దేశ తూర్పు తీరం చుట్టూ బహుళ సముద్ర గర్భ కేబుల్‌ ల్యాండింగ్‌లతో అనుసంధానం చేసి దేశంలో కూడా తన మార్కెట్‌ను పెంచుకొని లాభపడుతుంది.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »