ఏలూరులో త్రివిధ దళాలకు మద్దతుగా భారీగా తిరంగా ర్యాలీ
ఏలూరు, మే – 16…
బ్రహ్మోస్ అస్త్రంతో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాక్ వెన్నులో వణుకు పుట్టించిన త్రివిధ దళాల సైనికులకు యావత్ దేశమంతా మద్దతుగా నిలిచిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దేశ ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రతిదాడికి పూనుకున్న సైనిక శక్తికి, వ్యూహాత్మకంగా వ్యవహరించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత త్రివిధ దళాలకు మద్దతుగా ఏలూరులో శుక్రవారం భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యేతో పాటూ ఆర్టీసి విజయవాడ జోన్ – 2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఈడా ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్ధసారధి, బీజేపి జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, మాజీ ఎమ్మెల్యే, బీజేపి నాయకులు అంబికా కృష్ణ, జనసేన రాష్ట్ర నాయకురాలు ఘంటసాల వెంకట లక్ష్మి పాల్గొన్నారు. జాతీయ జెండాలు పట్టుకుని చిన్నా, పెద్దా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడికి ప్రతిదాడిగా మన దేశ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత త్రివిధ దళాలకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం ఏలూరులో భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక రామకోటి ప్రాంగణం నుండి ప్రారంభమైన ర్యాలీ వివిధ ప్రాంతాల మీదుగా కొనసాగి పాతబస్టాండ్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ మానవహారం నిర్వహించి, జాతీయ సమైక్యత, సమగ్రత చాటేలా నినాదాలు చేశారు. పలువురు చిన్నారులు ప్రత్యేక దుస్తుల్లో ఈ ర్యాలీకి అగ్రభాగంలో నిలిచి అందర్నీ ఆకట్టుకున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో పాటూ ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, యువత, విద్యార్ధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో జాతీయ జెండాలను చేతబూని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అనునిత్యం శాంతిని కోరే భారత్,,, పాక్ ఉగ్రస్థావరాల మీద జరిపిన సైనిక దాడిని యావత్ దేశం వేనోళ్ళ కొనియాడిందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్‌తో బ్రహ్మోస్ అస్త్రాలతో 9 పాక్ ఉగ్రస్థావరాలను మట్టుబెట్టడంతో భారత పౌరులంతా ఎంతో సంతోషించారన్నారు. ఈ విజయానికి గుర్తుగా దేశ ప్రజల పక్షాన పోరాడిన సైనికులకు, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపేందుకు తిరంగా యాత్ర చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపిఎస్ ఆర్టీసి విజయవాడ జోన్ – 2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఉగ్రదాడిని యావత్ దేశం సమర్ధిస్తోందన్నారు. బీజేపి జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్‌తో పాక్ ముష్కరమూకల స్థావరాలను ధ్వంసం చేసిన సైన్యాన్ని ప్రజలంతా ముక్తకంఠంతో కొనియాడుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపి నాయకులు అంబికా కృష్ణ మాట్లాడుతూ భారతదేశ ఆయుధ సంపత్తి బలాన్ని ఆపరేషన్ సింధూర్‌తో నిరూపించిన సైన్యానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు…