ఏలూరు మార్కెట్ యార్డులో జరిగిన ఏఎంసీ ఛైర్మన్, ఇతర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం
ఆసియాలోనే అతి పెద్దదైన ఏలూరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసి, మిగిలిన మార్కెట్ యార్డ్ లకు దిక్సూచిలా నిలపాలని ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. యార్డులో అన్ని మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మూడు పార్టీల కలయికతో బలమైన మార్కెట్ యార్డు కమిటీని నియమించడం జరిగిందని, ఈ కమిటీ ఆధ్వర్యంలో యార్డ్ కూడా అంతే బలోపేతం కావాలని వారు సూచించారు. ఏలూరు మార్కెట్ యార్డులో జరిగిన ఏఎంసీ ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, ఇతర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో వారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఏలూరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత పవర్ పేటలోని తన స్వగృహం నుండి ఏఎంసీ ఛైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి మార్కెట్ యార్డుకు భారీ ఊరేగింపుగా చేరుకున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆయన వెన్నంటే ఉన్నారు. అనంతరం యార్డులోని వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఏఎంసీ ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, వైస్ ఛైర్మన్ నడపన వాణి సూర్యకుమారితో పాటు ఇతర డైరెక్టర్లతో ఎమ్మెల్యే బడేటి చంటి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన సభలో ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ… ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సారధ్యంలో ఏలూరు మార్కెట్ యార్డు జిల్లాలోని అన్ని ఏఎంసీల కంటే ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ… రైతు బిడ్డగా రైతుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగిఉన్న మామిళ్ళపల్లి పార్థసారధి ఏఎంసీ ఛైర్మన్ గా నియమితులు కావడం శుభపరిణామమని, ఆ పదవికి ఆయన వన్నె తెస్తారన్న విశ్వాసం తనకు పూర్తిగా ఉందన్నారు. మూడు పార్టీల కలయికతో బలంగా ఉన్న కమిటీని ఏర్పాటుచేయడం జరిగిందని, భవిష్యత్ లో వీరంతా కలసి, యార్డును అంతే బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. యార్డులో నెలకొన్న అన్ని సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తానని, హమాలీలకు అత్యవసరంగా మారిన మరుగుదొడ్ల నిర్మాణాలను ఈ సంవత్సరాంతానికి, జింబో షెడ్ నిర్మాణాన్ని 2026 నాటికి పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. ఒకరికొకరు సహకరించుకుంటే అభివృద్ధి సాధ్యపడుతుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించాలన్నదే మూడు పార్టీల ఏకైక నిర్ణయమని స్పష్టం చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్-2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ… సమర్ధులైన మామిళ్ళపల్లి పార్థసారధిని ఏఎంసీ ఛైర్మన్ గా నియమించడం హర్షణీయమని, ఆయన హయాంలో యార్డు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో సమర్ధులకు పదవులు ఇస్తున్నారని, దీనివల్ల అన్నిరంగాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఎంసీ ఛైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి మాట్లాడుతూ… తనపై పూర్తి విశ్వాసం ఉంచి ఆసియాలోనే అతి పెద్దదైన ఏలూరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డుకు ఛైర్మన్ గా నియమించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతులకు అసలు సమస్యలే లేకుండా చేసేందుకు యార్డు తరుపున పాటుపడతానన్నారు. నిమ్మకాయల వర్తకులు, హమాలీ కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా యార్డు పేరు ప్రఖ్యాతలకు మరింత వన్నె తెచ్చేవిధంగా శక్తివంచనలేకుండా శ్రమిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈడా ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్లు వందనాల దుర్గాభవాని, పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, జనసేన నాయకులు నారా శేషు, పలువురు కార్పొరేటర్లు, పార్టీల నాయకులు, యార్డు సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.