అక్టోబర్‌ విప్లవం.. ప్రపంచానికి ప్రత్యామ్నాయం..

Spread the love

అక్టోబర్‌ విప్లవం.. ప్రపంచానికి ప్రత్యామ్నాయం..

NTODAY NEWS:- ప్రత్యేక కథనం

ఎస్‌. వెంకట్రావు
9490099333

ప్రపంచ చరిత్రలో అనేక విప్లవాలు జరిగాయి. సామాజిక, సాంకేతిక, సాంస్కృతిక విప్లవాలెన్నిటినో మానవజాతి చూసింది. వీటన్నిటిలో అతి విశిష్టమైనది, చరిత్ర గతిని మార్చివేసినది 1917లో సంభవించిన మహత్తర రష్యన్‌ విప్లవం. ఈ విప్లవం ఒక కొత్త సామాజిక వ్యవస్థకు.. ఒక మనిషిని మరో మనిషి, ఒక జాతిని మరో జాతి దోచుకోని, దోపిడీలేని సోషలిస్టు వ్యవస్థకు జన్మనిచ్చింది. పాత సామాజిక విప్లవాలు మానవాళిని ఒక దోపిడీ వ్యవస్థ నుండి మరో దోపిడీ వ్యవస్థకు నడిపిస్తే.. మహత్తర అక్టోబర్‌ సోషలిస్టు విప్లవం దోపిడీని పూర్తిగా నిర్మూలించే కార్మికవర్గ రాజ్యానికి అంకురార్పణ చేసింది. ప్రపంచ చరిత్ర గతిని ఇంతగా మార్చేసిన ఆ అక్టోబర్‌ సోషలిస్టు విప్లవం గురించి ప్రత్యేక కథనం.

అక్టోబర్‌ విప్లవం నాటి రష్యన్‌ క్యాలండర్‌ ప్రకారం అక్టోబర్‌ 25వ తేదీన సంభవించింది. నేటి క్యాలెండర్‌ ప్రకారం అది నవంబర్‌ 7వ తేదీన వస్తుంది. అయినప్పటికీ చరిత్రలో ఇది ”అక్టోబర్‌ విప్లవం”గానే ప్రసిద్ధి చెందింది. ఆ రోజున రష్యాలో కార్మికవర్గం సాయుధ తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంది. దీనికి లెనిన్‌ సారథ్యంలో కమ్యూనిస్టు పార్టీ (బోల్షివిక్‌ పార్టీ) నాయకత్వం వహించింది. అక్టోబర్‌ విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ రష్యాలో కార్మికవర్గ రాజ్యాన్ని స్థాపించింది. అంతకుముందు జారు చక్రవర్తుల పదఘట్టనల కింద నలిగిపోయిన అనేక చిన్న చిన్న రాజ్యాలు స్వచ్ఛందంగా కలవడంతో రష్యా కాస్తా యునైటెడ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ (యుఎస్ఎస్ఆర్‌) గా ఏర్పడింది. ఈ రాజ్యం అనతి కాలంలోనే కార్మికులు, రైతులు, మహిళలు, ఇతర పేదవర్గాల అభ్యున్నతి కోసం అనేక చట్టాలు చేసింది. అప్పటివరకు పెట్టుబడిదారీ ప్రపంచంలో లేని అనేక హక్కులను శ్రామిక ప్రజలకు దఖలు పరిచింది. దాంతో అక్టోబర్‌ విప్లవ స్ఫూర్తిని అందుకుని ప్రపంచ వ్యాపితంగా కార్మికులు, రైతాంగం ఇతర శ్రామిక జనం దోపిడీ, పీడనల నుండి విముక్తి కోసం రకరకాల రూపాల్లో పోరాటాలను ఉధృతం చేశారు.

విముక్తి పోరాటాలకు నాంది..

విదేశీ పాలన కింద నలిగిపోతున్న భారతదేశం లాంటి వలస దేశాల్లో అక్టోబర్‌ విప్లవ స్ఫూర్తితో స్వాతంత్య్రోద్యమాలు ఊపందుకున్నాయి. పశ్చిమ దేశాల్లో కార్మికవర్గ పోరాటాలు, తిరుగుబాట్లు పెల్లుబికాయి. వలస దేశాలన్నిటా కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడి, స్వాతంత్య్ర పోరాటాలను ప్రజా విమోచన పోరాటాలుగా మలచడానికి ప్రయత్నించాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్‌ ప్రజలు, ఎర్ర సైన్యం (రెడ్‌ ఆర్మీ) ఎన్నో త్యాగాలతో, వీరోచితంగా సాగించిన పోరాటం హిట్లర్‌ నాయకత్వంలోని ఫాసిజాన్ని ఓడించి, ప్రపంచాన్ని రాక్షస రాజ్యం నుండి కాపాడింది. సోవియట్‌ విజయంతో రెండో ప్రపంచయుద్ధం తర్వాత కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాన ప్రజా విమోచనా పోరాటాలు జయప్రదమై, అనేక తూర్పు యూరప్‌ దేశాల్లోనూ, చైనా, కొరియా, వియత్నాం వంటి అనేక దేశాల్లో సోషలిజం నిర్మాణం జరిగింది. ప్రపంచ సోషలిస్టు వ్యవస్థ ఏర్పడింది. అది అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద శిబిరాన్ని సవాలు చేసే మొనగాడుగా ఎదిగింది. అయితే సోషలిజం నిర్మాణంలో జరిగిన కొన్ని తప్పిదాల వల్ల తూర్పు యూరప్‌, సోవియట్‌ యూనియన్‌లో సోషలిజం కూలిపోయినప్పటికీ, చైనా, వియత్నాం వంటి మిగిలిన సోషలిస్టు దేశాలు ఆ తప్పుల నుండి బయటపడి, సోషలిజం నిర్మాణంలో గొప్ప ముందడుగు వేస్తున్నాయి. చైనా ఈ రోజున అమెరికా సామ్రాజ్యవాద విధానాలను ఎదిరించడమే కాకుండా ప్రపంచ శ్రామిక ప్రజలకు, వర్ధమాన దేశాలకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తోంది.

విప్లవానికి ముందు రష్యాలో పరిస్థితులు

యూరప్‌లో 18,19 శతాబ్దాల్లో సంభవించిన పారిశ్రామిక విప్లవంతో అనేక యూరప్‌ దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పటికీ రష్యా ఫ్యూడల్‌ పాలనలో బాగా వెనుకబడిన దేశంగా మిగిలిపోయింది. రష్యాలో చక్రవర్తిని ‘జార్‌’ అంటారు. జారు చక్రవర్తుల ఫూడల్‌ వ్యవస్థ పదఘట్టనల కింద ప్రజలు తీవ్రంగా నలిగిపోతున్న సమయంలో 1855లో రష్యాకు చక్రవర్తిగా పగ్గాలు చేపట్టిన అలెగ్జాండర్‌-2 అనేక రాజకీయ, సామాజిక సంస్కరణలు తెచ్చాడు. బానిసత్వాన్ని నిషేధించాడు. అయితే నరోద్నయా వోల్యా అనే సంస్థ జారు చక్రవర్తి అలెగ్జాండర్‌-2ను 1881లో హత్య చేసింది. అతని వారసునిగా వచ్చిన అలెగ్జాండర్‌ -3 ప్రజలపై తీవ్రమైన నిర్భంధం ప్రయోగించాడు. ఈ కాలంలో రష్యాలో పరిశ్రమలు బాగా పెరిగాయి. కార్మిక పోరాటాలూ పెరిగాయి. కార్మికోద్యమం వెల్లువలా అభివృద్ధి చెందింది. అయితే కార్మిక, కర్షక పోరాటాలు వేటికవిగానే విడివిడిగా జరిగేవి. ఆ కాలంలో కార్మికవర్గంపై మార్క్సిస్టు గ్రూపులతో పాటు ‘నరోద్నిక్కులు’ (ప్రజామిత్రులు) అనబడేవారి ప్రభావం ఎక్కువగా ఉండేది. వీరితోపాటు అనార్కిస్టులు, ఆధునీకరణను వ్యతిరేకించే స్లావోఫిల్స్‌ కూడా కార్మికవర్గంపై ప్రభావం కలిగించేవారు. 1894లో అలెగ్జాండర్‌-3 మరణం తరువాత నికొలాస్‌-2 రష్యన్‌ జారు (చక్రవర్తి) అయినాడు. రష్యన్‌ సామ్రాజ్య విస్తరణకోసం జారు ప్రభుత్వం నిరంతర యుద్ధాల్లో మునిగి ఉండేది. ఒకవైపు రష్యన్‌ గ్రామీణ ప్రాంతంలో భూస్వాముల పీడన, మరోవైపు పట్టణాల్లో పెట్టుబడిదారీ దోపిడీ వీటికి తోడు నిరంతర యుద్ధాలతో రష్యన్‌ ప్రజానీకం దుర్భర పరిస్థితులను ఎదుర్కొనేది.

 

లెనిన్‌ రంగ ప్రవేశం..

మార్క్సిజం రష్యాలో వేళ్లూనుకుంటున్న దశలో లెనిన్‌ రంగ ప్రవేశం చేశాడు. లెనిన్‌ అసలు పేరు వ్లదిమీర్‌ వొలోద్యా ఇల్యిచ్‌ ఉల్యనోవ్‌. ఉల్యనోవ్‌ అనేది ఇంటిపేరు. లెనిన్‌కు 30 ఏళ్లు వచ్చేవరకూ ఆయన పేరు ఉల్యనోవ్‌ మాత్రమే. 1901 రెండో భాగంలో ఆయన ‘లెనిన్‌’ అనే మారుపేరుతో వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. సైబీరియాలోని మహానది అయిన లెనా పేరుతో లెనిన్‌ అన్న రహస్య నామం ఏర్పాటు చేసుకున్నాడని చెబుతారు. అయితే తర్వాత ఉల్యనోవ్‌ కన్నా లెనిన్‌ పేరే ఆయనకు శాశ్వత నామమైంది.
లెనిన్‌ రష్యాలో విప్లవోద్యమాన్ని సరైన మార్గంలో పెట్టాడు.

మొదటిది: ఆయన మార్కిజం ఆధారంగా ఇతర తప్పుడు సిద్ధాంతాలను ఓడించి, రష్యా విప్లవోద్యమాన్ని మార్క్సిస్టు మార్గం పట్టించాడు.

రెండు: చెల్లా చెదురుగా ఉన్న విప్లవ స్రవంతులను ఏకం చేసి, మార్క్సిజం ఛత్రం కింద ఒకే పార్టీగా మలిచాడు.

మూడు: పార్టీ నిర్మాణ సూత్రాలను రూపొందించి, పటిష్టమైన విప్లవ పార్టీని రూపొందించాడు. దీనికోసం ఆయన పార్టీ లోపలా, బయటా సుదీర్ఘమైన, పెద్ద సైద్దాంతిక పోరాటం నిర్వహించాడు. ఖచ్చితమైన విప్లవ మార్గం కోసం పార్టీలో అంతర్గతంగా జరిగిన పోరాటంలో ఏర్పడిన బోల్షివిక్‌ పార్టీని నిర్ధిష్ట పరిస్థితులకు నిర్ధిష్ట ఎత్తుగడలు వేస్తూ విప్లవం వైపుగా నడిపించాడు.

1905 విప్లవం: గుణపాఠాలు

1905 నాటికి రష్యాలో లెనిన్‌ నాయకత్వంలో బోల్షివిక్కు పార్టీ పటిష్టమైన నిర్మాణ రూపాన్ని సంతరించుకుంది. ఇంతలో రష్యాలో 1905 విప్లవం ప్రారంభమైంది.19వ శతాబ్దం చివరిలో జారిస్టు రష్యా అనేక దురాక్రమణ యుద్ధాలు చేసింది. అదే సమయంలో దేశంలో కార్మికోద్యమం ఉధృతమైంది. దీన్ని అదుపులో పెట్టాలంటే యుద్ధమే శరణ్యమని జారు భావించాడు. దానికోసం అతను జపాన్‌పై దాడి చేశాడు. ఈ యుద్ధంలో గెలిస్తే ప్రజల్లో తన స్థానం మరింత పటిష్టమవుతుందని భావించాడు. కానీ జారు సైన్యాలకు సరైన శిక్షణ, ఆయుధాలు లేకపోవడంతో రష్యా బాగా దెబ్బతిన్నది. ఓటమి మీద ఓటమి చవిచూసింది. లక్షల మంది సైన్యం చనిపోయారు. మరిన్ని లక్షల మంది గాయపడ్డారు. జారు యుద్ధం ద్వారా రష్యాలో పెరుగుతున్న విప్లవోద్యమాన్ని దెబ్బతీయవచ్చు అనుకున్నాడు. కానీ యుద్ధమే విప్లవాన్ని ముందుకు తెచ్చింది. 1904 చివరిలో ప్రారంభమై 1905 జనవరి నాటికి రష్యాలో కార్మిక సమ్మెలు ఉధృతమైనాయి. జనవరి 3న సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో పెద్ద సమ్మె జరిగింది. సమ్మెలో పాల్గొన్న కార్మికుల ముందు గేసన్‌ అనే మతాధిపతి ఒక కార్యక్రమం ప్రతిపాదించాడు. దాన్ని అనుసరించి, పీటర్స్‌బర్గ్‌లోని వివిధ ఫ్యాక్టరీలకు చెందిన లక్షా 40 వేల మంది కార్మికులు జనవరి తొమ్మిది ఆదివారం నాడు కుటుంబాలతో సహా జారు చక్రవర్తి నివసించే వింటర్‌ ప్యాలెస్‌కు చక్రవర్తి చిత్రపటాలు పట్టుకుని, వినతి పత్రాలతో హాజరైనారు. ఆ విధంగా చేస్తే జారు వారి విన్నపాలను మన్నిస్తాడని గేసన్‌ వారిలో భ్రమలు కల్పించాడు. వినతుల ద్వారా విముక్తి రాదని బోల్షివిక్కులు కార్మికులకు చెబుతూనే ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శన వింటర్‌ ప్యాలెస్‌కు చేరుకున్నంతనే వారిపై జారు కాల్పులు జరిపించాడు. వెయ్యిమంది కార్మికులు చనిపోగా అనేక వేల మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో బోల్షివిక్కులు కూడా ఉన్నారు. ఆ రోజున పీటర్స్‌బర్గ్‌ వీధుల్లో కార్మిక రక్తం ప్రవహించింది. అందుకే ఆ రోజును ”బ్లాక్‌ సండే” అన్నారు.
ఈ దారుణ హత్యాకాండతో రష్యాలో కార్మిక సమ్మెలు దేశమంతటా వ్యాపించాయి. ఇప్పుడు కార్మికులు ”జారు చక్రవర్తి నశించాలి!” అన్న రాజకీయ నినాదాన్ని ఎత్తుకున్నారు. దేశవ్యాపితంగా జనవరి నెలలోనే 4 లక్షల 40 వేల మంది సమ్మెలో పాల్గొన్నారు. కార్మికోద్యమం ఆర్థిక డిమాండ్ల నుండి రాజకీయ డిమాండ్లకు మారింది. పోరాటం విప్లవ స్థాయిని అందుకుంది. రాజకీయ సమ్మెలు అక్కడక్కడా జారు సైన్యంతో సాయుధ ఘర్షణలకు దారితీయడం, క్రమంగా విస్తరించడం ప్రారంభించాయి. పట్టణాల నుండి ఉద్యమం పల్లెలకు వ్యాపించింది. రైతులు పోరాటంలోకి దిగారు. భూస్వాముల ఎస్టేట్లు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. భూస్వాములు పట్టణాలకు పారిపోయారు. ఈ లోగా 1905 జూన్‌లో జారు సైన్యంలోని పొటమ్కిన్‌ యుద్ధ నౌకలో నావికులు తిరుగుబాటు చేసి విప్లవకారుల పక్షం చేరారు. ఇది జారు పక్షం స్థయిర్యాన్ని బాగా దెబ్బతీసింది.
1905 అక్టోబర్‌ నాటికి రష్యాలో జనరల్‌ రాజకీయ సమ్మె ఉధృతమైంది. జనజీవనం స్థంభించి పోయింది. దాంతో అప్పటివరకు విదేశాల్లో రహస్య జీవనం సాగిస్తూ రష్యన్‌ విప్లవాన్ని నడిపించిన లెనిన్‌ విదేశాలనుండి సెంట్‌ పీటర్స్‌ బర్గ్‌ (నాటి రష్యా రాజధాని నగరం) చేరుకుని విప్లవానికి నేరుగా నాయకత్వం వహించాడు. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య దేశంలోని పెద్ద పట్టణాల్లో కార్మిక సోవియట్లు, సైనిక సోవియట్లు, రైతాంగ సోవియట్లు ఏర్పడి అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నాయి. రష్యాలో సోవియట్లు అంటే ఒక రకంగా స్వయం పాలక సంస్థలు అని అర్ధం. అంటే మన దేశంలో పంచాయితీలు వంటివి.

గుణపాఠాలు..

డిసెంబర్‌లో మాస్కో కార్మికులు తొమ్మిది రోజుల పాటు సాయుధ తిరుగుబాటు చేయడంతో విప్లవం తారా స్థాయికి చేరుకుంది. మాస్కోలో జరిగిన తిరుగుబాటు ఇతర నగరాలకు కూడా వ్యాపించింది. అయితే విడివిడిగా జరిగిన ఈ తిరుగుబాట్లను జారు ప్రభుత్వం ఎక్కడికక్కడ అణచివేసింది. వేలాది మందిని ఊచకోత కోసి చంపింది. 1907 నాటికి విప్లవ వెల్లువ పూర్తిగా అణచివేయబడింది. అయితే 1905 విప్లవం ఓడిపోలేదనీ, రానున్న విప్లవానికి రిహార్సల్‌గా ఉపయోగపడిందనీ లెనిన్‌ గుణపాఠాలు తీశాడు. తిరుగుబాటులోని విప్లవ లక్షణాన్ని ప్రశంసిస్తూనే నిర్మాణ లోపాలను ఆయన నిర్మొహమాటంగా వెల్లడించాడు. సాయుధ పోరాటాన్ని మరింత కృతనిశ్చయంతో చేయాల్సి ఉండిందనీ, దెబ్బ కాచుకోవడం కాకుండా ఎదురుదాడి చేసి ఉండాల్సిందనీ, సైన్యాన్ని తమవైపు తిప్పుకోవాల్సిందనీ, ఈ పోరాటంలో రైతాంగం పాల్గొనేట్లు ముందుగానే చర్యలు తీసుకోవాల్సిందనీ ఆయన చెప్పాడు. ఈ గుణపాఠాలతో కొత్త పోరాటానికి సిద్ధం కావాలని ఆయన కార్మికవర్గానికి పిలుపునిచ్చాడు.
ఆ పోరాట సమయం రానే వచ్చింది. ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ సంక్షోభం యుద్ధానికి దారితీసింది. 1914లో మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమైంది. సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని పున:పంపిణీ చేసుకోవడానికి పోటీపడి, ప్రారంభించిన ఈ యుద్ధం భూగోళంపై తీవ్రమైన వినాశనాన్ని సృష్టించింది. కోటి మంది ప్రజలు మరణించారు. అనేక కోట్ల మంది క్షతగాత్రులైనారు. విపరీతమైన విధ్వంసం జరిగింది. ఈ యుద్ధంలో జారిస్టు రష్యా మిత్రపక్షాల తరఫున యుద్ధంలో నిండా పాల్గొన్నది.

ఆయా దేశాల కార్మికవర్గం ఇతర దేశాల్లోని తమ తోటి కార్మికులపైకి ఎత్తుపెట్టిన తుపాకులను తమ దేశాల్లోని అభివృద్ధి నిరోధక పాలకవర్గాలపై ఎక్కుపెట్టినప్పుడే యుద్ధం అంతమవుతుందని లెనిన్‌ చెప్పాడు. కానీ రెండవ ఇంటర్నేషనల్‌లోని కమ్యూనిస్టు పార్టీలు దీనికి విరుద్ధంగా విద్రోహవైఖరి తీసుకున్నాయి. అయితే లెనిన్‌ పిలుపును రష్యాలో బోల్షివిక్కులు ఆచరణలో పెట్టారు.
”సామ్రాజ్యవాద యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చండి” అన్న లెనిన్‌ నినాదాన్ని బోల్షివిక్‌ పార్టీ అమలుచేసింది.
ఇదే సమయంలో సైనిక రంగంలో రష్యన్‌ కార్మికుల స్థితి మరింత హీనంగా మారింది. వారికి సరైన తిండిలేదు. దుస్తులు లేవు. బూట్లు లేవు. తుపాకులు లేవు. దానికి తోడు రష్యాలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఆహార కొరత వచ్చింది. ఇలాంటి స్థితిలో బోల్షివిక్కులు లెనిన్‌ ఇచ్చిన పిలుపును అమలు చేశారు. రష్యన్‌ పార్లమెంటు (డ్యూమా) లో బోల్షివిక్‌ ప్రతినిధులు యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఓటు చేశారు. ప్రజల్లో యుద్ధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సైన్యంలో కూడా ప్రవేశించి, వారిలో యుద్ధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ సైన్యంలో పార్టీ శాఖలు నిర్మించారు.

 

ఫిబ్రవరి విప్లవం: పెట్టుబడిదారులకు అధికారం

ఈ పరిస్థితుల్లో రష్యన్‌ బూర్జువా (పెట్టుబడిదారీ) వర్గంలో కూడా అసంతృప్తి బయలుదేరింది. వారూ ప్రభుత్వానికి వ్యతిరేక పక్షంలో చేరారు. అయితే అధికారాన్ని తమ హస్తగతం చేసుకుని, నడపాలన్న కోర్కెతో వారు వ్యవహరించేవారు. 1917 జనవరి 9న రష్యాలోని అనేక నగరాల్లో సమ్మెలు ప్రారంభమై, రోజురోజుకూ ఉధృతమైనాయి. ఫిబ్రవరి 23వ తేదీ (రష్యా పాత క్యాలండరు ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ నేటి క్యాలెండరు ప్రకారం మార్చి 8వ తేదీ) అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ రోజున రష్యాలో కార్మికవర్గ నాయకత్వంలో బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ప్రారంభమైంది.
ఆరోజు పెట్రోగ్రాడ్‌ (సెంట్‌ పీటర్స్‌బర్గ్‌) లోని ఫ్యాక్టరీలలో పనిచేసే 10 వేల మంది కార్మిక మహిళలు (వీరిలో అనేకమంది సైనికుల భార్యలు) ”యుద్ధం వద్దు, తిండి కావాలి!” అనే నినాదంతో సమ్మె చేసి ప్రదర్శన జరిపారు. ఒక లక్షా 30 వేల మంది కార్మికులు వీరితో చేరిపోయి, సమ్మెలో పాల్గొన్నారు. మరునాటికి సమ్మె చేసే కార్మికుల సంఖ్య రెండు లక్షలకు చేరింది. పెట్రోగ్రాడ్‌లోని కార్మికుల్లో దాదాపు సగం మంది సమ్మెలోకి వచ్చేశారు. వీరు ”జారు గద్దెదిగాలి!” అన్న రాజకీయ నినాదాన్ని అందుకున్నారు.

పెట్రోగ్రాడ్‌ పార్టీ కార్యాలయం 26న ప్రజా తిరుగుబాటుకు పిలుపునిచ్చింది. 27వ తేదీ నాటికి సైనికులు కూడా ప్రజల తిరుగుబాటులో చేరారు. ఆ రోజు ఉదయం 10 వేల మంది సైనికులు ప్రజలతో చేరిపోగా సాయంత్రానికి వారి సంఖ్య 60 వేలు దాటిపోయింది. వెనువెంటనే విప్లవకారులు జారు మంత్రుల్నీ, సైనికాధికారుల్నీ అరెస్టు చేశారు. జైళ్లలోని విప్లవకారుల్ని విడుదల చేశారు. ఇతర నగరాల్లో కూడా తిరుగుబాటుదార్లు జారిస్టు అధికారులను తొలగించి, అధికారం చేపట్టారు. ఈ విధంగా ఫిబ్రవరి విప్లవం జయప్రదమైంది. ఈ విప్లవానికి కార్మికవర్గం నాయకత్వం వహించినప్పటికీ స్టేట్‌ డ్యూమాలోని బూర్జువావర్గం నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో మెన్షివిక్కులు, సోషలిస్టులు చేరారు. మరోవైపు దేశంలోని కార్మికుల సోవియట్లు, సైనికుల సోవియట్లతో కూడిన మరో అధికార సంస్థ ఏర్పడింది. అంటే విప్లవానంతరం దేశంలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. ఒకటి బూర్జువా అధికార కేంద్రం, రెండోది కార్మిక, సైనిక (సైనికులంటే యూనిఫారమ్‌లో ఉన్న రైతులే) అధికార కేంద్రం.

లెనిన్‌ నాయకత్వంలో..

బలాబలాల్లో వచ్చిన ఈ మార్పును ప్రవాసంలో ఉన్న లెనిన్‌ గ్రహించాడు. పరిస్థితి కీలక దశకు వచ్చిందని తెలుసుకుని 1917 ఏప్రిల్‌ 3వ తేదీన ఆయన రష్యా తిరిగి వచ్చేసి విప్లవానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించాడు. బూర్జువా విప్లవం సోషలిస్టు విప్లవంగా పరివర్తన చెందాలన్నాడు. దానికి అనుగుణంగా పార్టీ కార్యక్రమం సవరించబడింది. పార్టీ ప్రజల్లో ఈ కొత్త కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టింది. శాంతి, భూమి, భుక్తి, సోవియట్లకే సర్వాధికారాలు అన్న నినాదాలతో బోల్షివిక్కులు ప్రజలను ఉత్తేజ పరిచారు.
ఒకవైపు పారిశ్రామిక ప్రాంతాల్లో సమ్మె పోరాటాలు ఉధృతం కాగా, మరోవైపు వ్యవసాయ రంగంలో అశాంతి పెరిగింది. కౌలు రైతులు భూస్వాములకిచ్చే కౌలు తామే నిర్ణయించడం ప్రారంభించారు. ఈలోగా జూన్‌ నెలలో పార్టీ నిర్వహించిన అఖిల రష్యన్‌ బోల్షివిక్‌ సైనిక సంస్థల సమావేశం సైన్యంలో బోల్షివిక్‌ పార్టీ కృషిని పటిష్టం చేసే కార్యక్రమాన్ని తీసుకుంది. అప్పటికి రష్యన్‌ సైన్యంలో 26 వేల మంది పార్టీ కార్యకర్తలున్నారు.

 

అధికారంలోని బూర్జువా వర్గం బోల్షివిక్‌లను బలహీనపరచడానికి అనేక కుయుక్తులకు పాల్పడినా, ఫలించలేదు. యుద్ధంలో ఎదురుదాడి చేసి గెలవడం ద్వారా ప్రజల మన్ననలు పొందాలనుకున్న బూర్జువా ప్రభుత్వ పన్నాగం కూడా పారలేదు. యుద్ధంలో రష్యా సైన్యాలు ఓడిపోయాయి. దాంతో జులై నెలలో దేశంలో సంక్షోభం మరింత ముదిరింది. యుద్ధరంగం నుండి ప్రభుత్వం సైన్యాలను పెట్రోగ్రాడ్‌కు రప్పించి, నిర్భంధానికి దిగింది. ప్రభుత్వ సైన్యం కార్మిక వాడల్లోకి ప్రవేశించి బోల్షివిక్‌లను నిరాయుధులను చేసింది. బోల్షివిక్‌ పార్టీని నిషేధించింది. వారి ప్రచురణాలయాన్ని ధ్వంసం చేసింది. లెనిన్‌ని కనిపిస్తే కాల్చేయాలని ఆదేశించింది.

జులై ఘటనలు దేశ రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమైన మార్పు తెచ్చాయి. దేశంలో రెండు అధికార కేంద్రాలు పోయి ఒకే బూర్జువా కేంద్రం ఏర్పడింది. వెంటనే లెనిన్‌ పరిస్థితిలో మార్పు గమనించాడు. సర్వాధికారాలు విప్లవ ప్రతీఘాత శక్తుల చేతుల్లోకి వెళ్లాయి కనుక కార్మిక వర్గం సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే అధికారం హస్తగతం చేసుకోవాల్సి ఉంటుందని పిలునిచ్చాడు. ”కార్మిక-కర్షక మైత్రి”తోనే విప్లవం విజయం సాధిస్తుందని పిలుపునివ్వడం జరిగింది.
ఈ లోగా అమెరికా, బ్రిటన్‌, ఫ్రెంచి ప్రభుత్వాల మద్దతుతో రష్యా సర్వసైన్యాధికారి కార్నిలోవ్‌ అనేవాడు అధికారం చేపట్టడానికి సైన్యాన్ని పంపాడు. కార్నిలోవ్‌ తిరుగుబాటును బోల్షివిక్‌ పార్టీ నాయకత్వంలోని కార్మిక-కర్షక జనం అణచివేశారు.

1917 అక్టోబర్‌ విప్లవం..

కార్నిలోవ్‌ తిరుగుబాటును అణచివేయడంతో రష్యా పరిస్థితుల్లో పెద్ద మార్పు వచ్చింది. మొదటిది: కార్మిక, సైనిక సోవియట్లను త్వరితగతిన బోల్షివిక్కులు వశం చేసుకున్నారు. సోవియట్లకే సర్వాధికారాలు అన్న నినాదం మళ్లీ మారుమోగింది. ఈసారి బూర్జువా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం కోసం ఈ నినాదం ఇవ్వబడింది. రెండవది: రైతాంగ పోరాటంలో కూడా మార్పు వచ్చింది. వారు భూస్వాములను తరిమేసి, భూములను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. మూడవది: సైన్యంలో కూడా మార్పు వచ్చింది. తిరుగుబాటుకు అనుకూలమైన సైన్యం, అభివృద్ధి నిరోధక అధికారులను తొలగించి, ఆ స్థానాలను బోల్షివిక్కు అనుకూల అధికారులతో నింపడం ప్రారంభించారు.
ఈలోగా రష్యన్‌ విప్లవ ప్రతీఘాతకులు బ్రిటిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌ సామ్రాజ్యవాదులతో చేతులు కలిపి విప్లవాన్ని అణచివేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. రహస్య జీవితం గడుపుతున్న లెనిన్‌ ఈ పరిస్థితి గమనించాడు. విప్లవం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసి బోల్షివిక్కులు అధికారం చేపట్టడమొక్కటే మార్గమని గ్రహించాడు. సోషలిస్టు విప్లవానికి రష్యా సిద్ధంగా ఉందని చెప్పాడు.

1917 సెప్టెబంర్‌ 12-14 తేదీల్లో సాయుధ విప్లవానికి సన్నాహాలు జరిగాయి. తిరుగుబాటు దళాల కేంద్ర కార్యాలయం ఏర్పాటైంది. కీలక స్థావరాలను తిరుగుబాటుదారులు ఆక్రమించుకోవడం ప్రారంభించారు. మరోవైపు విప్లవాన్ని అణచివేయడానికీ, పక్కదోవ పట్టించడానికీ ప్రతీఘాతకులు అన్ని రకాలుగా ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇలాంటి స్థితిలో లెనిన్‌ విప్లవానికి నేరుగా నాయకత్వం వహించడానికి అక్టోబరు 7న పెట్రోగ్రాడ్‌ చేరుకున్నాడు. 10న కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొన్నాడు. విప్లవానికి పరిస్థితి పరిపక్వమైందనీ, అధికారం స్వాధీనానికి తిరుగుబాటు చేయడమొక్కటే మిగిలి ఉందని చెప్పాడు. తిరుగుబాటును నేరుగా ఆయనే పర్యవేక్షించాడు.

 

అక్టోబర్‌ 25వ తేదీన జరిగే ద్వితీయ సోవియట్ల మహాసభ నుండి తిరుగుబాటు ప్రారంభించాలనుకున్నారు. కానీ కేంద్ర కమిటీలో లెనిన్‌ పథకాన్ని వ్యతిరేకించిన కామికోవ్‌, జెనోవీవ్‌ గ్రూపు ఈ సమాచారాన్ని శత్రువులకు చేరవేయడంతో 24 రాత్రికే తిరుగుబాటు పూర్తికావాలని లెనిన్‌ నొక్కి చెప్పాడు. తిరుగుబాటు ఒక్కరోజు ఆలస్యమైనా సర్వస్వం కోల్పేయే ప్రమాదముందని హెచ్చరించాడు. లెనిన్‌ ప్రణాళిక ప్రకారమే 24 రాత్రి తిరుగుబాటు ప్రారంభమైంది. తిరుగుబాటు కేంద్రమైన స్మోల్నీ ఇన్‌స్టిట్యూట్‌ భవనానికి లెనిన్‌ 24 సాయంకాలం చేరుకుని, తిరుగుబాటును నడిపాడు. ఆరోజు రాత్రికి రాత్రి రెడ్‌గార్డులు కీలకమైన ప్రభుత్వ స్థావరాలన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వ మంత్రులు సమావేశమై ఉన్న శీతాకాల రాజభవనాన్ని వెంటనే పట్టుకోడానికి లెనిన్‌ అక్టోబర్‌ 25 రాత్రి ఉత్తర్వులిచ్చాడు. ”అరోరా” యుద్ధ నౌక నుండి తిరుగుబాటు సైన్యపు కాల్పుల సంకేతం విని విప్లవ దళాలు రాజ భవనాన్ని ముట్టడించి, స్వాధీనం చేసుకున్నాయి. దాంతో బూర్జువా ప్రభుత్వపు చివరి కోట పతనమైంది.
ఆ విధంగా 1917 అక్టోబర్‌ 25వ తేదీ (నేటి క్యాలెండర్‌ ప్రకారం నవంబర్‌ 7) చరిత్రలో తొలి సోషలిస్టు విప్లవం జయప్రదమైన రోజుగా చిరస్ధాయిగా నిలిచిపోతుంది.

విప్లవాత్మక చట్టాలు

విప్లవం విజయవంతమైన మరునాడు అక్టోబర్‌ 26న సోవియట్ల మహాసభ రెండు చట్టాలు చేసింది. మొదటిది తక్షణం యుద్ధాన్ని నిలిపివేస్తూ జారీ చేసిన శాంతి చట్టం. రెండవది భూస్వాముల భూమిపై రైతులకు హక్కులు కల్పిస్తూ జారీ చేసిన చట్టం. ఈ చట్టంతో 36 కోట్ల ఎకరాల భూమి రైతుల పరమైంది. తదుపరి చట్టాల్లో జాతుల బందిఖానాగా ఉన్న రష్యన్‌ సామ్రాజ్యంలో జాతులకు విడిపోయే స్వేచ్ఛతో సహా అన్నిరకాల స్వేచ్ఛ ఇవ్వబడింది. అయితే రష్యా కార్మికవర్గ రాజ్యంగా మారిన తరువాత అంతకు ముందు రష్యన్‌ సామ్రాజ్యం కింద ఉన్న అనేక జాతులు పూర్తి స్వయం పాలనాధికారాలతో ఒకే దేశంగా కలిసి ఉండడానికి అంగీకరించాయి. దాంతో రష్యా పేరు యునైటెడ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ (యుఎస్ఎస్ఆర్‌) గా మారింది. లెనిన్‌ దాని తొలి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు.

లెనిన్‌ నాయకత్వంలో విప్లవ రష్యా జారీ చేసిన తదుపరి చట్టాల్లో ముఖ్యమైనది కార్మికుల పనిదినాన్ని 8 గంటలకు తగ్గిస్తూ చేసినది. ఏనాటి నుండో ప్రపంచ కార్మికవర్గం చేస్తున్న ఈ డిమాండు సోషలిస్టు రష్యాలో మొట్టమొదటిసారి సాకారమైంది. రష్యాలోని పిల్లలందరికీ ఉచిత, లౌకిక విద్య నందించే ఒక చట్టం, ప్రభుత్వం ఆధ్వర్యంలో అనాధ శరణాలయాలు నెలకొల్పే మరో చట్టం చేశారు. వయోజనుల్లో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకుగాను దేశవ్యాపితంగా అక్షరాస్యతా క్యాంపెయిన్‌ ప్రారంభించారు. 1920 నుండి 26 వరకు సాగిన ఈ అక్షరాస్యతా కార్యక్రమంలో 50 లక్షల మందికి చదువు నేర్పారు.

తొలిసారి స్త్రీలకు ఓటు హక్కు..

మహిళలకు సమానత్వాన్ని ప్రసాదించే అనేక చట్టాలను సోవియట్‌ రష్యా చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ మహిళలకు ఓటు హక్కు కల్పించింది. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే అనేక చర్యలు చేపట్టింది. మహిళలు కోరుకుంటే విడాకులు తీసుకోడానికి ఉన్న అడ్డంకులను తొలగించింది. గర్భం దాల్చిన తొలి మూడు మాసాల కాలంలో మహిళ కోరుకున్నట్లయితే గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతిస్తూ చట్టం చేసింది. అప్పటికి ప్రపంచంలో ఇటువంటి చట్టం చేసిన తొలి దేశం సోవియట్‌ యూనియన్‌. రష్యాను లౌకిక రాజ్యంగా ప్రకటిస్తూ ప్రభుత్వం మరో చట్టం చేసింది. రాజ్యానికీ, చర్చికీ సంబంధం లేకుండా చేసింది. పాఠశాలల్లో మతబోధనలను నిషేధించింది. కార్మిక రాజ్యంగా మారిన అనతి కాలంలోనే సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక, సైనిక రంగాల్లో శీఘ్ర అభివృద్ధి సాధించి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు ధీటుగా నిలిచింది. ప్రజల జీవన ప్రమాణాలను ఎంతగానో మెరుగుపరిచింది.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »