జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1800 233 1077
ఏలూరు, మే, 18 : రానున్న మూడు రోజులపాటు కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లాలోని అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ఏలూరు కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1800 233 1077 తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా రెవిన్యూ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. . ప్రతి మండలం ప్రధాన కేంద్రంలో, డివిజన్ ప్రధాన కేంద్రాలలో రెవెన్యూ సిబ్బంది 24×7 అందుబాటులో ఉండాలని తెలిపారు, పకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండి ముందస్తుగానే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు.