స్వచ్ఛత విషయంలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి
ఏలూరును స్వచ్ఛ నగరంగా తయారుచేయడానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. స్వచ్ఛత విషయంలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు 42వ డివిజన్ కొత్తపేటలో బీట్ ద హీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛతపై నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈ శనివారం బీట్ ద హీట్ పేరుతో వేసవిలో ఉష్ణోగ్రతల పెరుగుదల, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మొక్కలు నాటి, స్వచ్ఛతపై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా బీట్ ద హీట్ కార్యక్రమం, స్వచ్ఛతపై కమిషనర్ ఎ.భానుప్రతాప్ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. గతంలో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి శానిటేషన్ నిర్వహణలో ఇతరులకు ఆదర్శప్రాయంగా విధులు నిర్వర్తించిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులకు ఐదు వేల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ… పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితేనే ఏలూరు నగరాభివృద్ది సాధ్యమవుతుందన్నారు. ప్రతినెలా మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతపై పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందని,, ఈ నేపథ్యంలో ఈ శనివారం బీట్ ద హీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు నగరంలోని పలుచోట్ల దాతల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. అలాగే నగర ప్రజలు స్వచ్ఛతపై బాధ్యతగా వ్యవహరించాలని,, నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర పాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్, డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డివిజన్ ఇంచార్జ్ త్రిపర్ణ శ్రీదేవి, క్లస్టర్ ఇంచార్జ్ మల్లెపు రాము, కో క్లస్టర్ త్రిపర్ణ రాజేష్,అర్నేపల్లి మధు,కార్పొరేటర్ అర్జి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.