నవంబర్ 15వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి– యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.జయరాజు
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు ఎ. జయరాజు జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు,పోలీసు అధికారులు,బ్యాంకు మరియు వివిధ ఆర్థిక సంస్థల యజమానులు, మధ్యవర్తిత్వ న్యాయవాదులతో ఈనెల నవంబర్ 15వ తేదీన నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ లో అధిక కేసుల పరిష్కారానికై ప్రత్యేక సమావేశాన్ని శనివారం రోజున కోర్టు ఆవరణలో నిర్వహించారు.ఈ సమావేశములో జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ పడదగు క్రిమినల్ కేసుల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల న్యాయమూర్తులు లోక్ అదాలత్ లో ఎక్కువ మొత్తంలో పరిష్కారమయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, నాన్ బెయిలబుల్ వారంట్ల కేసులు,పెండింగులో ఉన్న కేసులను పరిష్కరిస్తే, తీవ్రమైన నేరములకు సంబంధించిన కేసులపై ఎక్కువ దృష్టి సారించవచ్చని మరియు చిన్న తగాదాలతో కేసులలో ఉన్న వారు రాజీతో పరిష్కరించుకొని మంచి జీవితాన్ని ఆరంభించేందుకు అవకాశం ఉంటుందని,చెక్ బౌన్స్ కేసులను పరిష్కరింపబడునని తెలిపి, కక్షిదారులుతేది:15.11.2025 రోజున జరిగే ఈ ప్రత్యేక లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపి, సమావేశంలో పాల్గొన్న పోలీసు వారికి తగిన సూచనలు ఇచ్చారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి ముక్తిదా మాట్లాడుతూ శిక్షణ పొందిన మధ్యవర్తిత్వ న్యాయవాదుల సహకారంతో కేసుల పరిష్కారానికి వెసులుబాటు ఉన్నందున బ్యాంకు,ఆర్థిక సంస్థలు వారి కేసులను రెఫర్ చేస్తే పరిష్కారము చేయవచ్చని తెలిపారు. భువనగిరి ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి మరియు ఇంచార్జి కార్యదర్శి యం.ఉషశ్రీ మాట్లాడుతూ క్రిమినల్ కేసులను మొత్తంగా 1147 కేసులను రాజీ పరిష్కారానికి గుర్తించబడ్డాయని, ఇందులో 71 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని వాటిని పరిష్కరించటానికి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్యాంసుందర్ మాట్లాడుతూ న్యాయవాదులు కేసుల పరిష్కారానికి ఎక్కువ చొరవ చూపాలని తెలిపారు. భువనగిరి న్యాయవాదుల సంఘం జనరల్ సెక్రటరి బొల్లేపల్లి కుమార్ మాట్లాడుతూ కేసులు రాజీ చేసుకొనే వెసులుబాటు,హక్కు కక్షిదారులకు ఉందని, పరిష్కారంలో మా న్యాయవాదుల సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు.యాదగిరిగుట్ట ఎసిపి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ రాజీ పడదగు కేసులలో ఇప్పటికే నోటీసులు అందచేయటం ఇరువర్గాలకు సలహా ఇవ్వటం, రాజీ పరిష్కారం వలన కలిగే ప్రయోజనాలు మొదలగు అంశాలపై వారికి తెలియచెప్పటం జరుగుతుందని తెలిపారు. మధ్యవర్తిత్వ న్యాయవాది యం.రాజిరెడ్డి మాట్లాడుతూ మధ్యవర్తిత్వానికి వచ్చిన కేసులను ప్రభావ వంతంగా కౌన్సిలింగ్ చేసి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమములో ప్రత్యేక లోక్ అదాలత్ ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమములో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కె.భూపాల్ రెడ్డి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ బి.వెంకటేష్, సహాయ న్యాయ సేవ న్యాయవాదులు ఎన్.రాజశేఖర్, నాగరాజు, సాయి శ్రీనివాస్, సరిత మరియు బ్యాంక్ అధికారులు, జిల్లా సమాచార శాఖ, పోలీసు యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు.

