భూమి గుంజుకోవడమే…ఉపాధి ఏదీ?

Spread the love

భూమి గుంజుకోవడమే…ఉపాధి ఏదీ?

__వ్యాసకర్త : వి. వెంకటేశ్వర్లు, ఎ.పి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెల్‌:9490098980

NTODAY NEWS: ప్రత్యేక కథనం

దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా వివిధ సంస్థల నుంచి భారీ పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఆనందదాయకమైన విషయం. ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా అభివృద్ధి చెందబోతున్నదని ప్రచార మాధ్యమాలలో కూడా మారుమోగుతోంది.
గడిచిన పదేళ్లలో గత తెలుగుదేశం, వైసిపి, నేటి కూటమి ప్రభుత్వాలు 11 సార్లు విదేశీ, స్వదేశీ పెట్టుబడుదారుల సమావేశాలు, సమ్మిట్లు, విదేశీ పర్యటనలు జరిపి 20 నుండి 30 లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు వస్తాయని, పరోక్షంగా మరో 20 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పాయి. మరి ఈ దశాబ్ద కాలంలో ఎంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తే అభివృద్ధి బండారం బయట పడుతుంది. కానీ గడిచిన పదేళ్లలో నిరుద్యోగం, పేదరికం రైతు కూలీల ఆత్మహత్యలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి.
వివిధ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చి సర్వం త్యాగం చేసిన రైతులకు నేటికీ పరిహారం అందక, మరోపక్క భూములు కోల్పోయి వీధిన పడ్డారు. లక్షలాది రైతు కూలీలు, కౌలుదారులు ఉపాధి కోల్పోయి వలసలు పోతున్నారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో సోలార్‌, పోర్టులు, రిజర్వాయర్లు, ప్రైవేటు పరిశ్రమలు, హైవేలు, పారిశ్రామిక కారిడార్లు, జిందాల్‌ స్టీల్‌ ప్లాంట్లు, ఫార్మాసూటికల్స్‌, కియా, ఎస్ఇజడ్‌, బిపిసిఎల్‌, విమానాశ్రయాలు, గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు, రైల్వే లైన్లు, పెట్రో యూనివర్సిటీలు, బల్క్‌ డ్రగ్స్‌, మైనింగ్‌, రాజధాని 15 రకాల ప్రాజెక్టుల పేరు చెప్పి 21 జిల్లాల్లో సుమారు 102 మండలాల్లో 200 పైగా గ్రామాలలో 3,08,970 ఎకరాల పంట భూములు ప్రభుత్వాలు రైతుల నుండి బలవంతంగా లాక్కున్నాయి.
ప్రభుత్వం రైతుల నుండి తీసుకున్న భూములను మార్కెట్‌ రేటు ప్రకారం సగటున ఎకరాకు 30 లక్షల రుపాయల చొప్పున లెక్కించిన 3,08,970 ఎకరాలకు సుమారు 9 లక్షల 26 వేల కోట్ల రుపాయలు ఉంటుంది. ఇన్ని లక్షల కోట్ల విలువైన భూములను తీసుకొని…చదువుకున్న యువతీ యువకులకు కల్పించిన ఉద్యోగాలు నామమాత్రమే. వీరికి వస్తున్న వేతనం కూడా రూ.20 వేల నుండి రూ.50 వేలకు మించి లేదు. అసంఘటిత రంగంలో ఉపాధి కల్పించింది కేవలం 98,950 వేల మందికి మాత్రమే. రోజుకు వీరికిచ్చే వేతనం రూ.400 నుండి రూ.600 మించి లేదు. అది కూడా ఆఫీస్‌ బారులుగాను, బాత్‌రూమ్‌ క్లీనర్లు, సెక్యూరిటీ గార్డులు, తోటమాలీలు, హమాలీ వర్కర్లుగా పనులు చూపించి లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.
పై భూములే కాకుండా గత మూడు నాలుగేళ్లుగా వైసిపి, నేటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు అభివృద్ధి అనే ముద్దు పేరుతో 62 మండలాల్లో 170 గ్రామాలలో సుమారు 2,22,500 ఎకరాల భూములు సేకరించడానికి పూనుకున్నారు. వీటిలో కరేడు, కుప్పం, నక్కపల్లి, అన్నేమడుగు, జీలుగుమిల్లి, పెనుగొండ ప్రాంతాలలో సారవంతమైన రెండు, మూడు పంటలు పండే భూములు బలవంతంగా తీసుకొనడానికి నోటీసులు ఇచ్చారు. ప్రశ్నించిన రైతులను బయటికి రాకుండా 30 సెక్షన్‌ పెట్టి ఉల్లంఘించిన వారిపై కేసులు, వీరికి అండగా ఉంటున్న వామపక్ష పార్టీ ప్రజాసంఘాల నాయకులను ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారాయి గాని విధానాల్లో ఎటువంటి మార్పులు లేదు.
ఉదాహరణకు రాయలసీమ ప్రాంతంలో ఆసియాలోని అతి పెద్ద సోలార్‌గా చెప్పుకునే ఓర్వకల్లు, ఎన్‌పి కుంట మండలాలలో సుమారు 15 వేల ఎకరాలు తీసుకున్నారు. ఇందులో కనీసం 500 మందికి కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట ప్రాంతంలో సుమారు 3500 ఎకరాలు జిందాల్‌ స్టీల్‌ప్లాంట్‌ మరియు పరిశ్రమల కోసం 3500 ఎకరాలు తీసుకున్నారు. దశాబ్ద కాలం దాటినా నేటికీ పనులు ప్రారంభించలేదు. పోగా ఇందులో వెయ్యి ఎకరాలను బ్యాంకులో తాకట్టు పెట్టి వందల కోట్లు కొల్లగొట్టారని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఈ భూములన్ని బీళ్లుగా మారాయి. రైతులకు ఆ భూములు తిరిగి ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో గడిచిన కాలంలో 25 వేల 134 ఎకరాలు తీసుకున్నారు ఉపాధి చూపింది కేవలం 1000 మందికి మించి లేదు. నిర్మాణ పనులకు అసంఘటిత రంగంలో 65 వేల మందికి పని చూపించామని చెప్తే వీరిలో స్థానికులకు ఇచ్చింది కేవలం 15 వేలకు మించి లేదు. మిగిలిన 50 వేల మంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. ప్రకాశం జిల్లాలో నిమ్స్‌, వివిధ పరిశ్రమలు, దొనకొండ కారిడార్‌ పేరుతో 16,938 ఎకరాలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఆరు రకాల ప్రాజెక్టుల పేరుతో సుమారు 50 వేల ఎకరాలు పైగా తీసుకున్నారు. ఇందులో నేటికీ 22,830 ఎకరాలలో ఎటువంటి ప్రాజెక్టులు ప్రారంభించలేదు. సత్యసాయి జిల్లాలో 35 వేల ఎకరాలు తీసుకున్నారు. ఉద్యోగాలు ఇచ్చింది 4 వేలకు మించి లేదు. నేటికీ 15 వేల ఎకరాల భూమి ఖాళీగా ఉంది. 8 వేల ఎకరాలను బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ. వేల కోట్లు దండుకున్నారు. ఇప్పటివరకు చేపట్టిన కృష్ణపట్నం లాంటి పోర్టులలో కూడా స్థానికులకు కల్పించిన ఉద్యోగాలు అతి తక్కువ. గత పదేళ్ళలో అభివృద్ధి పేరుతో తీసుకున్న భూములు 3,08,970 ఎకరాలు. తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది 2,22,500 ఎకరాలు. మొత్తం 5,31,470 ఎకరాలు. మార్కెట్‌ రేటు ప్రకారం సుమారు 16 లక్షల కోట్ల విలువైన భూములను ఈ పాలకులు అభివృద్ధి అనే ముద్దు పేరుతో కార్పొరేట్‌ అనే పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలలో ఎన్ని భూములు తీసుకున్నారు? ఎన్ని పరిశ్రమలు పెట్టారు? ఎంతమంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించారో పాలకులే సెలవివ్వాలి.

__వ్యాసకర్త : వి. వెంకటేశ్వర్లు, ఎ.పి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెల్‌:9490098980

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »