ఐక్యతా మూలస్తంభం.. సర్దార్ వల్లభాయ్ పటేల్..
NTODAY NEWS: నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం
భారత చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు అనగానే మనకు గుర్తొచ్చేది ధృడమైన సంకల్పం, అచంచల నాయకత్వం, దేశ ఐక్యతకు ప్రాణం అర్పించిన వ్యక్తిత్వం. 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నాడియార్ గ్రామంలో జన్మించిన ఆయన, న్యాయవృత్తిని చేపట్టినా, దేశ స్వాతంత్ర్య పోరాటమే తన జీవిత ధ్యేయంగా మలచుకున్నారు.
మహాత్మా గాంధీ ప్రభావంతో ఆయన స్వాతంత్య్ర ఉద్యమంలో ముందుండి పాల్గొని, అనేక ప్రజా సంఘటనలకు పునాదులు వేశారు.
అంబేద్కర్‌కు అపర మద్దతు..
భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లభాయ్ పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. అంబేద్కర్‌ని డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించడంలో ముఖ్య పాత్ర పోషించాడు.భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా పనిచేశాడు.పటేల్ స్వాతంత్య్రం అనంతరం భారతదేశ ఏకీకరణకు అత్యంత కీలకమైన పాత్ర పోషించారు.భారతదేశ తొలి హోంమంత్రిగా,ఉప ప్రధానమంత్రిగా, పటేల్ పాకిస్తాన్ నుండి పంజాబ్, ఢిల్లీకి పారిపోతున్న విభజన శరణార్థులకు సహాయ చర్యలను నిర్వహించి , శాంతిని పునరుద్ధరించడానికి కృషి చేశారు.ప్రత్యక్ష బ్రిటిష్ పాలనలో ఉన్న ఆ ప్రావిన్సులతో పాటు,దాదాపు 560కు పైగా స్వయంపాలిత సంయుక్త రాజ్యాలను ఒప్పించి భారత సమాఖ్యలో కలిపిన ఘనత ఆయనదే. హైదరాబాద్,జునాగఢ్ లాంటి సంస్థానాలను భారత దేశంలో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది.
హైదరాబాద్ విలీనంలో కీలకపాత్ర
1947లో స్వాతంత్య్రం అనంతరం భారతీయ సమాఖ్య నిర్మాణంలో, హైదరాబాద్ రాజ్యాన్ని (తెలంగాణ ప్రాంతాన్ని) విలీనం చేయడంలో పటేల్ కీలకంగా వ్యవహరించారు. హైదరాబాద్ రాష్ట్రంలో సామాజిక సంక్షోభం, మిలిటరీ సంబంధిత అంశాలు తలెత్తినప్పుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘యూనియన్’ ప్రక్రియను వేగవంతం చేశారు. ‘ఆపరేషన్ పోలో’ ద్వారా ఆర్మీని పంపించి, హైదరాబాద్ చివరికి భారతదేశంలో భాగ మయ్యేలా చేశారు. రాజ్యాల విలీనంలో ఆయన చూపిన దౌత్య చతురత, ధైర్యం, దేశంపై ఉన్న నిస్వార్థ ప్రేమ కారణంగా ఆయనను ‘భారత ఐక్యతా శిల్పి’ అనీ, ‘ఉక్కు మనిషి (లోహ్ పురుష్)’ అని స్మరిస్తారు.
ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల రూపశిల్పి..
ఆయన కఠినమైన, న్యాయమైన నిర్ణయ శక్తి వల్లే మన దేశం ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రభుత్వం కింద ఒకటిగా నిలిచింది. తన దృష్టిలో భారతదేశం కేవలం రాజకీయ సమాఖ్య కాదు- ఇది మనసుల సమైక్యం. ఐఏఎస్, ఐపీఎస్ వంటి పరిపాలనా వ్యవస్థలను రూపుదిద్దడంలో పటేల్ కృషి ఇప్పటికీ భారత పరిపాలనా వ్యవస్థకు మద్దతు స్తంభంగా ఉంటుంది. ఆయన మాటలు, కర్ణాటక నుంచి కశ్మీర్ వరకు మనందరిలో దేశభక్తిని రగిలిస్తాయి. నేడు గుజరాత్‌లోని నర్మదా నదీ తీరాన సాధుబెట్ అనే చిన్న దీవిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (182 మీటర్లు) ఏకత్వ చిహ్నం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఆయన విశాల హృదయానికి, భారత ఐక్యతా సంకల్పానికి సజీవ నిదర్శనం.
జాతీయ ఐక్యతా దివస్
ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దివస్‌గా జరుపుకోవాలని 2014 అక్టోబర్ 24న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈరోజు విద్యా సంస్థల్లో విద్యార్థులచే జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ కూడా చేయించడంతో విద్యార్థుల్లో జాతి సమైక్యత, సమగ్రత భావాలను వికసింపజేయడం జరుగుతుంది. వల్లభాయ్ పటేల్ జయంతి మనకు స్ఫూర్తిదాయక క్షణం. మనం ఆయన చూపిన ఐక్యత, కర్తవ్య బోధ, ధైర్య సాహస మార్గంలో నడవడం ద్వారానే నిజమైన దేశభక్తిని ప్రతిఫలింపజేయగలం.
(నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి)

