ఐటీ ఆఫీసర్ పేరుతో బెదిరింపులు నిందితుడి అరెస్ట్
NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా..
అర్బన్ సీఐ రమేష్
చిలకలూరిపేట పట్టణంలోని వివిధ వ్యాపారవేత్తల వివరాలను ఆన్‌లైన్‌లో సేకరించి, తాను ఇన్‌కమ్ టాక్స్ (ఆదాయపు పన్ను) అధికారిని అంటూ ఫోన్లలో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర నిందితుడిని చిలకలూరిపేట అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయిపై ఇప్పటికే ఎనిమిది పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని అర్బన్ సీఐ రమేష్ తెలిపారు.
చిలకలూరిపేట అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
* నిందితుడి పేరు: చదలవాడ తిరుమల రెడ్డి (తండ్రి: శ్రీనివాస రెడ్డి), ఆర్.టి.సి కాలనీ, గుంటూరు పట్టణం.
* అరెస్ట్: చిలకలూరిపేట పట్టణం, ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద, ది 08.11.2025 ఉదయం 11:00 గంటల సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
* కేసు పూర్వాపరాలు: నిందితుడు తిరుమల రెడ్డి గూగుల్ ద్వారా వ్యాపారస్తుల సెల్ఫోన్ నెంబర్లు, వివరాలు సేకరించేవాడు. అనంతరం వారికి ఫోన్ చేసి, “నేను ఐటీ ఆఫీసర్‌ని, మీపై రైడ్ జరగబోతోంది” అని బెదిరించేవాడు. “మీ ఫైలింగ్ సరిగా లేకపోతే మీ ఆస్తులు సీజ్ చేస్తాము. సెటిల్‌మెంట్ చేసుకోవాలంటే మేము అడిగినంత డబ్బు ఇవ్వాలి” అంటూ భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేసేవాడు.
* పోలీసు చర్య: బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ముద్దాయిని ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

