పుట్టిన గడ్డపై ఒక సామాన్య వ్యక్తి సృష్టించిన సామ్రాజ్యం
NTODAY NEWS: ప్రత్యేక కథనం
ఒక మనిషికి 18,000 కోట్ల రూపాయల ఆస్తులుంటే.. తన తదుపరి కల (లక్ష్యం) ఏముంటుంది?
ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిలా ఓ మారుమూల గ్రామానికి వెళ్లి అక్కడ పేద పిల్లలతో కలిసి జీవిస్తూ వారికి పాఠాలు నేర్పించాలనే లక్ష్యమైతే ఎవరికీ ఉండకపోవచ్చు.
పిల్లలకు రెండు పూటలా కడుపు నిండా భోజనం పెడుతూ, వారితో కలిసి క్రికెట్ ఆడుతూ, టీ తాగుతూ కాలక్షేపం చేస్తున్న ఈ వ్యక్తి పేరు టెంకాసి శ్రీధర్ వెంబు (53).
అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ద సిలికాన్ వ్యాలీలో ఓ పెద్ద కంపెనీకి యజమాని ఆయన. అయినా, అవన్నీ వదిలేసి తాను పుట్టి పెరిగిన మట్టి వాసనలు వెతుక్కుంటూ స్వదేశం వచ్చేశారు.
తమిళనాడులోని మారుమూల గ్రామం మాథాలంపరైలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
తాను పుట్టిన గడ్డపై ఉన్న మమకారమే శ్రీధర్‌ను ఇక్కడికి రప్పించింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆయన ఎంతో విలువనిస్తారు. కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినా.. సాదాసీదా షర్టు, తెల్లని లుంగీ ధరించి గ్రామానికి చెందిన పిల్లలలో ఆయన కలిసిపోయిన తీరు చూస్తే.. ఆయన ఎంతటి నిరాడంబరుడో ఇట్టే అర్థమవుతుంది.
తమిళనాడుకు చెందిన అతి సాధారణ కుటుంబంలో జన్మించిన శ్రీధర్ వెంబు.. ఐఐటీ, మద్రాస్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ సిలికాన్ వ్యాలీలో Zoho Corporation పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించారు. దానికి సీఈవోగా వ్యవహరిస్తున్న ఆయన.. ఇప్పుడు అవన్నీ వదిలేసి స్వగ్రామానికి వచ్చేశారు. మాథాలంపరై గ్రామ వీధుల్లో పిల్లలతో కలిసి సైకిల్‌పై తిరుగుతున్నారు.
పేద పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలనేది శ్రీధర్ లక్ష్యం. లాక్‌డౌన్‌లో ప్రయోగాత్మకంగా ఆయన ముగ్గురు చిన్నారులను చేరదీసి పాఠాలు చెప్పడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 25 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లకు చేరింది. ఆ విద్యార్థులందరికీ ఉచితంగా ఆహారం అందిస్తూ తరగతులు చెప్పిస్తున్నారు.
ఇప్పుడు అది ఇక ఎంతమాత్రం ప్రయోగం కాదని శ్రీధర్ వెంబు చెబుతున్నారు. త్వరలో ఆయన సరికొత్త ఎడ్యుకేషన్ స్టార్టప్‌ను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. శ్రీధర్ అంచనా ప్రకారం.. రాబోయే కొన్నేళ్లలో తన స్టార్టప్ ద్వారా రూరల్ ఇండియాలో 8,000 టెక్నాలజీ ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. అంతేకాదు, ఇకపై గ్రామాలు పట్టణాలకే ప్రపంచ స్థాయి సేవలు అందించే విధంగా ఎదుగుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించమే కాకుండా అత్యాధునిక వసతులో హాస్పిటళ్లు నిర్మించడం, సాగునీటిని అందించడం, మార్కెట్లు, నైపుణ్య కేంద్రాల ఏర్పాటు స్థాపించాలని శ్రీధర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆవిధంగా ఆయన తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని భావిస్తున్నారు.
సేకరణ:-
ప్రేమ లక్ష్మీనారాయణ్ అనే వైద్యురాలు ట్విటర్ ద్వారా ఈ వివరాలన్నీ తెలిపారు.
#SridharVembu #Zoho #zohocorporation #inspiredperson #backtoindia #ntodaynews

