2025లో మారుతోన్న బీహార్ రాజకీయ సమీకరణలు..
NTODAY NEWS: బీహార్
అనువాదం: ఎమ్ బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్టు
మే 29, 2025
Reading Time: 4 minutes
రాజకీయాలలో సంభవించే పెను తుఫానులు సాధారణ ప్రజాస్వామిక పోటీగా కనిపిస్తున్న తీరును గమనిస్తే, 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఒక పెద్ద పాఠమే కానున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కసరత్తు మరికొంత అనిశ్చితిని ముందుకు తెచ్చింది. బయటకు అంతా గందరగోళంగానే కనిపిస్తున్నప్పటికీ, బీహార్‌లో జరుగుతున్నది రాజకీయ మథనం. రాజకీయ సముద్ర మథనం. ఈ మథనంలో సాంప్రదాయక రాజకీయ కూటముల నిర్మాణాలు గింగిరాలు తిరుగుతున్నాయి. రాజకీయ స్వరూప స్వభావాలను సమూలంగా మార్చే సామర్థ్యం ఉన్న కులగణన ఫలితాలే ఈ రానున్న మార్పులకు పునాది.
ఏదో రోజువారీగా జరిగే రాజకీయ వైరంలా ఈ మథనం మనకు కనిపిస్తుంది. పైపైన జరుగుతోన్న వ్యవహారం బీహార్ సమాజంలో జరుగుతున్న మథనాన్ని ప్రతిఫలించటం లేదు. మహా ఘట్‌బంధన్‌లోని లుకలుకలు, ఎన్డీయే గుత్తాధిపత్యంలోని ఎన్నికల నిర్వహణా సామర్ధ్యం వంటి బాహ్యవ్యక్తీకరణలు ఓటర్ల మనోగతాన్ని అర్థం చేసుకోవడంలో వెనకపడుతున్నాయి.
తీవ్ర పరిణామాలకు దారి తీయనున్న కులగణన..
రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన కులగణన సర్వే ఫలితాలు రాష్ట్రంలో రాజకీయాలను సాధారణ ఓటు బ్యాంకు రాజకీయాల పరిధి నుంచి మరింత సంక్లిష్టమైన రాజకీయ పరిణామాలవైపుకు నెట్టాయి. కులగణన సర్వే ప్రకారం, రాష్ట్ర జనాభాలో 36% మంది అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన వారున్నారు. 112 ఉపకులాలలో దాదాపు కోటి 30 లక్షల మంది ఉన్నారు. ఈ ఫలితాలు వెలుగు చూసిన తర్వాత అప్పటి వరకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో గుర్తింపుకు నోచుకోని కులాలలో అనూహ్యంగా సామాజిక, రాజకీయ చైతన్యం పెల్లుబికింది. ఈ చైతన్యవంతమైన రాజకీయ అవగాహన రాష్ట్ర రాజకీయాలలో విలక్షణమైన సందర్భాన్ని ముందుకు తెస్తోంది. ఇటువంటి సందర్భాలలోనే ఓడలు బళ్ళవుతాయి బళ్ళు ఓడలవుతాయి.
అయితే, 2027 జనగణనతోపాటు కులగణన కూడా చేపట్టాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం ఆశ్చర్యమైన విషయమే. అన్ని కులాల అస్థిత్వాలను హిందూ అస్థిత్వంతో మమేకం చేసుకోవాలనుకుంటున్నా రాజకీయ పార్టీ, సమాజంలో కులగణనకు అంగీకరించడం ద్వారా కులాల అస్థిత్వాన్ని ఖాయం చేసే నిర్ణయానికి ఎందుకు సిద్ధమైంది?
లెక్కలు స్పష్టంగానే ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఫలితాలను పరిశీలిస్తే; రాష్ట్రంలో బలమైన నిర్మాణ సామర్థ్యం బీజేపీకి ఉన్నప్పటికీ, సమాజ్‌వాదీ పార్టీ- కాంగ్రెస్ సంకీర్ణం ఆ పార్టీ అధిపత్యానికి అడ్డుకట్ట వేసింది. కులగణన ప్రధానమైన రాజకీయ జెండాగా మారింది. కులగణన ఫలితాలను, పర్యవసానాలను, ఆచరణలకు తీసుకురాకుండా నిరంతరం అడ్డుకోవడం రాజకీయంగా అసాధ్యంగా మారింది.
రాజకీయ పందెంలో బీజేపీకున్న సంపూర్ణ ఆధిపత్యం ఫణంగా మారింది. మీడియాపై సంపూర్ణమైన నియంత్రణ, పటిష్టమైన నిర్మాణ కౌశలం, అందుబాటులో ఉన్న అంతులేని ధనరాశులు, దశాబ్దాలుగా పథకం ప్రకారం అమలు చేస్తున్న సంస్కృతీకరణ కార్యక్రమాలు- ఉన్నత కులాలు పాటించే విధివిధానాలు, సాంప్రదాయాలను దిగువ కులాలు పాటించడం ద్వారా సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనే నమ్మకాన్ని వ్యాపింపజేయడం; వంటివన్నీ ఇప్పుడు పందెంలో భాగమైయ్యాయి. నంబర్ల చుట్టూ నిర్మించే కథనం- స్క్రీన్‌ప్లే తమ చేతుల్లో ఉన్నంతవరకు ఏ నంబర్లు ఎటున్నా ఇబ్బంది లేదనే నమ్మకంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది.
కులగణనకు అంగీకరించడం ద్వారా ప్రతిపక్షంలో నిర్మితమవుతున్న ఐక్యతకు బీటలువారేలా చేయవచ్చని ఎన్డీఏ బలంగా నమ్మింది. అంతేకాకుండా ఐక్యతకు ఆటంకాలు కల్పించవచ్చని భావించింది. రాష్ట్రంలోని 112 ఉపకులాలలో ఎవరి ప్రయోజనాల కోసం వారు కట్టుబడి ఉంటే, అంతిమ ప్రయోజన ఫలితం ఎవరికి దక్కుతుంది? ఈ 11 కులాలతో సంప్రదింపులు చేసి సమాజంలోకి వెళ్ళగలిగే శక్తి, సామర్థ్యాలు, వనరులు అవకాశాలున్న పార్టీకే కదా.
ఈ విధంగా చూసినప్పుడు చీలికే పెద్ద వరంగా మారే అవకాశం లేకపోలేదు. ఇండియాటుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఈ విధంగానే అభిప్రాయపడింది. 2024 ఫిబ్రవరి నాటికి 59% మంది మాత్రమే కులగణనను సమర్థిస్తే, 2024 ఆగస్టునాటికి కులగణనను సమర్ధించేవారి సంఖ్య 79శాతానికి పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో, దేశంలో 79 శాతం మంది ఓటర్ల మనోభవాలతో చెలగాటమాడడానికి బీజేపీ సిద్ధంగా లేదు. దానికి బదులుగా ఓటర్ల మనోభావాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధపడింది. మొదట్లో వ్యూహాత్మక వెసులుబాటు ఇస్తున్నట్లు కనిపించినప్పటికీ, ప్రస్తుతం కులసమీకరణలు తెచ్చిపెట్టే సవాళ్లను అధిగమించటానికి కావలసిన నిర్మాణ వనరులున్న నేపథ్యంలో తాజా పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి పాలకపక్షం ప్రయత్నిస్తోంది.
బీహార్ అనుభవాల కోణంలో నుంచి చూస్తే ఈ అంచనాలు పొరపాటు అంచనాలవుతాయి.
ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీవంటివి; ఓటర్లలో ప్రత్యేకించి కులగణన తరువాత స్వతంత్ర అస్థిత్వాలను రూఢీపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్న ఉపకులాలలో పెద్ద ఎత్తున కదలికలను తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే చిన్నాచితకా పార్టీలు తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో సాంప్రదాయక రాజకీయ అనుబంధాలు, మమకారాలు మారిపోతున్నాయి. ఎన్నికలలో తమ పాత్ర ఏమిటో, తమ ప్రభావం ఏమిటో స్పష్టమైన అవగాహనకు ప్రతి ఉపకులము వస్తోంది. ఆమూర్త ప్రాతినిధ్య రాజకీయాల నుంచి నిర్ధిష్ట ప్రాతినిధ్య రాజకీయాల వైపు అడుగులు పడుతున్నాయి. దీని పర్యవసానాలు దేశవ్యాప్తంగా కూడా విస్తరించబడే అవకాశాలు ఉన్నాయి.
బీహార్ రాజకీయాలలో కులాధారిత సమీకరణలు ఏ మేరకు విజయవంతమవుతాయో, ఆ మేరకు ఇటువంటి డిమాండ్లు దేశవ్యాప్తంగా ముందుకు రానున్నాయి. దీంతో కులాధారిత రాజకీయ చైతన్యాన్ని మతాధారిత హిందూత్వ చైతన్యంతో అదుపు చేయవచ్చనే అంచనాతో; గత మూడు నాలుగు దశాబ్దాలుగా బీజేపీ సంఘ్ పరివార్ జాగ్రత్తగా నిర్మించుకుంటూ వచ్చిన సామాజిక సంకీర్ణాలకు పెను సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.
మహాగట్‌బంధన్ ముందు ఉన్న సవాళ్లు..
బీహార్‌లో మహాగట్‌బంధన్ సీట్ల పంపకాల ఆలస్యం కేవలం సమన్వయ లోపం కాదు, కూటమి అంతర్గత బలహీనతలను బయటపడుతోంది. వైశాలి, తరాపూర్, లాల్‌గంజ్‌లాంటి స్థానాల్లో “ఫ్రెండ్లీ ఫైట్లు” రావడం, కూటమిలోని ప్రజాస్వామ్య పద్ధతులు, స్థానిక నేతల ఆధిపత్య పోరాటం మధ్య ఉద్రిక్తతను స్పష్టంగా చూపిస్తోంది. కాంగ్రెస్ ఈ సారి కాస్త దూకుడు చూపిస్తోంది. ఇన్‌ఛార్జ్ కృష్ణ అల్లవారు నేతృత్వంలో పార్టీ ముందుకు రావడంతో, ఆర్‌జేడీకి ఉన్న సహజ నాయకత్వ స్థితి సవాలును ఎదుర్కొంటోంది.
కులగణన తరువాత వెనుకబడిన వర్గాల మద్దతు తిరిగి కట్టిపడేయాల్సిన సమయంలో; సీట్లు ఫైనల్ చేసే ముందు ఈబీసీ(అత్యంత వెనుకబడిన కులాలు) నివేదికను విడుదల చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్, మిత్రపక్షాలకు చికాకుగా మారింది. కానీ పార్టీ దృష్టిలో ఇది ఒక వ్యూహాత్మక అడుగు. కొత్తగా వెలుగులోకి వచ్చిన కులవర్గాలను ఒకే దారిలో కట్టి, “సామాజిక న్యాయం” అనే అంశాన్ని బలంగా ముందుకు తెచ్చే ప్రయత్నం.
అయితే బీహార్‌లో రాజకీయాలు భావోద్వేగాలపై నడుస్తాయి. ప్రజల్లో బలం లేదా బలహీనత పట్ల ఉన్న అభిప్రాయం ఫలితాలను నిర్ణయిస్తుంది. కనుక కూటమి లోపల కనబడే అసమగ్రత మానసికంగా కూడా దెబ్బతీస్తుంది. ముకేష్ సాహ్నీ నేతృత్వంలోని వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీలాంటి చిన్న పార్టీలు ఓట్లు తక్కువ ఉన్నా సీట్లు ఎక్కువగా డిమాండ్ చేయడం కూటమి రాజకీయాల కఠినతను బయటపెడుతోంది. ఇప్పుడు కులగణన డేటా తన చేతిలోకి రాగానే, తన వర్గ ప్రయోజనాల కోసం ప్రతి వర్గ నాయకుడు ఒత్తిడి పెంచుతున్నాడు. ఇది కూటమికి తలనొప్పే అయినా, రాజకీయంగా చూస్తే చైతన్యం పెరుగుతున్న సంకేతం. ఇంతకాలం అణగారిన వర్గాల ఆశలు, ఆకాంక్షలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ కలకలం నుంచి కొత్త నాయకులు, కొత్త రాజకీయ దిశలు కూడా పుట్టే అవకాశం ఉంది. కానీ అసలు ప్రశ్న ఈ విభిన్న ఆకాంక్షలను మహాగట్‌బంధన్ భరించగలదా? లేక వాటి బరువుతోనే విరిగిపోతుందా?
బీజేపీ ‘మహారాష్ట్ర మోడల్’ భయం..
బీజేపీ బలమైన పార్టీ అయినా, ఎన్డీఏలో అంతర్గత గందరగోళం మాత్రం తగ్గలేదు. ఇవే విభేదాలు ఎన్నికల తర్వాత కీలకంగా మారే అవకాశం ఉంది. ఈసారి బీజేపీ, జేడీయూకు సమానంగా ఒక్కొక్కటికి 101 సీట్లు ఇచ్చింది. ఇది నితీష్ కుమార్ ప్రభావం తగ్గుతోందనే సంకేతం. ఇప్పటివరకు “పెద్ద అన్నయ్య”గా ఉన్న జేడీయూ, ఇప్పుడు బీజేపీతో సమాన స్థాయిలోకి వచ్చేసింది. ఈ ఫార్ములా వెనుక వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది— ఎన్నికల తర్వాత బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే, “సీఎం పదవి మా పార్టీదే” అని చెప్పే అవకాశం ఉంటుంది. సీఎం అభ్యర్థి ప్రకటనను అమిత్ షా ఆలస్యం చేయడం కూడా అదే ప్లాన్‌లో భాగం. ఇది మహారాష్ట్ర మోడల్ లాంటిదే. అక్కడ బీజేపీ శివసేనను చీల్చి, ఏకనాథ్ షిండేను ముందుకు తెచ్చి, చివరికి ఫడ్నవీస్‌ను సీఎం చేసింది. బీహార్‌లో అదే ఆట పునరావృతమవుతుందా? అన్న భయం నితీష్ శిబిరంలో స్పష్టంగా కనిపిస్తోంది.Which side are Bihar Muslims on in the changing politics?
నితీష్‌కు ఈబీసీ వర్గాల్లో గట్టిపట్టు ఉంది. ఆయన సంక్షేమ పథకాలు, సామాజిక చైతన్యం వలన ఆ వర్గం ఇప్పటికీ ఆయన వైపు ఉంది. కానీ వయసు, ఆరోగ్య సమస్యలు, రాజకీయ అనిశ్చితి ఆయన ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రశాంత్ కిశోర్ మళ్లీ రంగంలోకి దిగారు. నితీష్‌కు ఒకప్పుడు సన్నిహితుడైన ఆయన, ఇప్పుడు స్వతంత్రంగా ఈబీసీ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ఆయన అంచనా ప్రకారం జేడీయూ ఈ సారి 25 సీట్లను కూడా దాటదట. ప్రశాంత్ గెలవకపోయినా, ఆయన 3– 5 శాతం ఓట్లు తీయగలిగితే, అది జేడీయూకి పెద్ద నష్టమవుతుంది, గతంలో చిరాగ్ పాశ్వాన్ చేసినట్లుగానే.
చిరాగ్ పాశ్వాన్ ఇప్పుడు 29 సీట్లు దక్కించుకున్నాడు. ఎమ్మెల్యేలు లేకపోయినా, 2024 లోక్‌సభలో 100% విజయంతో, 6% ఓటు షేర్ సాధించి, “కింగ్‌మేకర్” స్థాయికి ఎదిగాడు. ఇది నితీష్‌కి మరో తలనొప్పిగా మారింది.
ఈబీసీ ఫ్యాక్టర్..
ఈబీసీలు(అత్యంత వెనుకబడిన కులాలు) బీహార్ జనాభాలో సుమారు 36%. కానీ రాజకీయంగా ఇంకా విభజిత వర్గం. కులగణన తర్వాత వారు తగిన ప్రాతినిధ్యం ఆశిస్తున్నారు. కానీ మంత్రివర్గంలో వారికి 12% స్థానాలే రావడం ఆ అసంతృప్తిని మరింత పెంచుతోంది. 1970లలో కార్పూరి ఠాకూర్ ఈ వర్గాన్ని సృష్టించారు. ఆయన “నాయి” (బార్బర్) వర్గానికి చెందినవారు. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు “తక్కువ కులం వ్యక్తి సీఎం అవడాన్ని” వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు అదే బీజేపీ ఆయనను సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తోంది.
2024 ఎన్నికల ముందు కార్పూరి ఠాకూర్‌కు “భారతరత్న” ఇవ్వడం దానికి స్పష్టమైన ఉదాహరణ. బీజేపీ ఇప్పుడు వెనుకబడిన వర్గాల సాధికారతను చూపిస్తున్నట్లు నటిస్తున్నా, అసలు అధికార పునర్విభజన మాత్రం తప్పించుకుంటోంది. జూలై నుంచి మహిళలు, ఈబీసీల కోసం ప్రారంభించిన 20 సంక్షేమ పథకాలు కూడా అదే వ్యూహంలో భాగం. “ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన” (21 లక్షల మహిళలకు రూ 10,000 చొప్పున)లాంటి పథకాలు ఓటర్లను నేరుగా ఆకర్షించడానికి ఉద్దేశించినవే. ఆసక్తికరమేమిటంటే ఇలాంటి పథకాలను మోడీ స్వయంగా ఒకప్పుడు “రేవడి కల్చర్” అని విమర్శించారు.
ఈ ఎన్నికలు కేవలం బీహార్‌కే కాదు — దేశ భవిష్యత్తుకే పెద్ద పందెం..
ఈ ఎన్నికలు కేవలం బీహార్‌కే కాదు దేశ రాజకీయాలకూ కీలక మలుపు. కొత్త జనాభా వాస్తవాలు, యువతలో మారుతున్న అంచనాలు, పాత కూటముల బలహీనత ఇవన్నీ కలిసి కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తున్నాయి.
కులగణన తర్వాత కులాధారిత ఉద్యమాలు ఎంత ప్రభావం చూపుతాయో, దేశ రాజకీయ దిశ కూడా దానిపైనే ఆధారపడి ఉంటుంది. బీజేపీ ప్రస్తావించే “సమరసత” అంటే అన్ని హిందూ వర్గాల ఐక్యత సిద్ధాంతం ఈ సవాళ్లను ఎంతవరకు ఎదుర్కోగలదో చూడాలి.
బీహార్ కులగణన కేవలం గణాంకాల కథ కాదు. ఇది భారత రాజకీయాల్లో కొత్త మలుపు. ఏడు దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలు తమ అసలు సంఖ్య తెలియకే నడిచాయి. ఇప్పుడు వారికి స్పష్టత వచ్చింది. ఆ స్పష్టతను రాజకీయ శక్తిగా మార్చగలరా? అదే అసలు ప్రశ్న. ఈ కలకలం చివరికి కొత్త నాయకులు, కొత్త కూటములు, కొత్త దిశలను తెచ్చే అవకాశం ఉంది. కానీ అవి నిజమైన సామాజిక న్యాయాన్ని తీసుకురావాలా, లేక కొత్త పేర్లతో పాత అసమానతలనే కొనసాగించాలా ఈ ఎన్నికల ఫలితమే చెబుతుంది.
అనువాదం: ఎమ్ బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్టు
Source:- ది వైర్

