సొసైటీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి– గొర్రెలు మేకలు పెంపకం దారుల(GMPS) జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు
NTODAY NEWS:బొమ్మల రామారం
రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని గొర్రెల మేకల పెంపకందార్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం రోజున బొమ్మలరామారం మండల కేంద్రంలో ఉన్న మదిరాజ్ భవనంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం మండల సదస్సు బుడుమ శ్రీశైలం అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మద్దెపురం రాజు మాట్లాడుతూ సొసైటీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించక పోవటం వల్ల గొల్ల కురుమలు నిరాధరణకు గురవతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో 421గ్రామాలు 344 సొసైటీలలో 24,890 సభ్యులు ఉండగా వీటిలో ప్రభుత్వానికి 71 సంఘాలు ఎన్నికలు జరపాలని ధరఖాస్తు చేసుకోగా 37 సంఘాలకు మాత్రమే అధికారికంగా ఎన్నికలు జరిపారని తెలిపారు.జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు సహకార సంఘం అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ప్రభుత్వ ఖర్చులతో ఓటర్ల జాబితా తయారుచేసి జిల్లాలోని అన్ని సొసైటీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.100 రోజుల్లో గొల్ల కురుమల ఖాతాలో రెండు లక్షల రూపాయలు నగదు జమ చేసి రెండవ విడత గొర్రెల పంపిణీ చేపడతామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టి 18 నెలలు దాటినా అమలు చేయలేదని విమర్శించారు.పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలని,ఉచిత వైద్యం,గొర్రెల భీమా,గొర్రెల కాపరులకు ఎక్స్ గ్రేషియా,ఫింఛన్లు మొదలైన సమస్యల పరిష్కారానికై రాబోయే రోజుల్లో జిఎంపిఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ సమావేశంలో మండల పిఎసిఎస్ చైర్మన్ గూదె బాలనర్సింహ్మ, జిఎంపిఎస్ మండల కార్యదర్శి జెట్ట చిరంజీవి,బైరబోయిన రాజు,మోటె రమేష్,రాసాల మల్లేష్,గుజ్జ క్రిష్ణ, మోటె బీరప్ప,మచ్చాని రమేష్, చీర బాలరాజు,చీర గణేష్,బుడుమ వెంకటేష్,దండెబోయిన కొండల్, దేవతల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

