భూ భారతిలో కూడా పేదలకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు — సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం
NTODAY NEWS: బొమ్మలరామారం
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంలో కూడా నిరుపేదలకు, దళితులకు, గిరిజనులకు సాగు చేసుకుంటున్న భూములకు నూతన పాస్ పుస్తకాలు పట్టాలు అందడం లేదని, మండలంలోని భూ సమస్యలు కూడా పరిష్కారం కావడంలేదని బొమ్మలరామారం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం అన్నారు. శనివారం రోజున బొమ్మలరామారం మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీశైలం మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో పేదలు సాగు చేసుకుంటున్న భూములను వివిధ ప్రభుత్వ అవసరాల పేరుతో గుంజుకున్నారని,అనేక సమస్యలను సృష్టించి పాసుబుక్కులను రద్దుచేసి నిరుపేద కుటుంబాలను తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు గత ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు కొత్త పాసుబుక్కులు కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టార విమర్శించారు. కాంగ్రెసు పార్టీ ఎన్నికల్లో మమ్ములను అధికారంలోకి తీసుకొస్తే ధరణి చట్టాన్ని రద్దుచేసి కొత్త చట్టం తెచ్చి భూ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తామని చెప్పారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నూతన చట్టాన్ని తెచ్చిన పేదలకు మాత్రము ఒరిగింది ఏమీ లేదని అన్నారు పెద్ద ఎత్తున బొమ్మలరామారం మండలంలో రెవెన్యూ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకొని సమస్యలు పరిష్కరిస్తామన్న ప్రభుత్వం ఎందుకు పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పాలకుల హామీలు ఎన్నికల్లో తమ గెలుపు కోసం,తమ పదవుల కోసం తప్ప పేదల సంక్షేమం కోసం కాదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల ఆర్థిక పరిస్థితిలో మార్పు రావాలన్న,ఆత్మగౌరవంతో జీవించాలన్న భూమి చాలా కీలకమని అన్నారు మండలంలో పేదలు సాగు చేసుకుంటున్నా భూములకు పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల పాస్ పుస్తకాల గురించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన సర్వేలు, సదస్సులు నిర్వహించి తాహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సాయి,పున్నమ్మ, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

