కౌలు రైతుల సమస్యలు పట్టని ప్రభుత్వాలు
NTODAY NEWS: ప్రత్యేక కథనం వ్యాసకర్త : ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ దిలీప్ రెడ్డి
Oct 31,2025
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కౌలురైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అత్యధిక శాతం మంది కౌలురైతులు భావిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కౌలురైతుల సమస్యలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవట్లేదని 92.1 శాతం మంది కౌలురైతులు తెలుపగా, పట్టించుకుంటున్నారని కేవలం 6.1, తెలియదని 1.9 శాతం మంది తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలురైతుల సమస్యలపై సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 20 వరకు ఒక నెల రోజులపాటు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం క్షేత్ర స్థాయిలో 26 జిల్లాల్లో సర్వే నిర్వహించి దాదాపు 3000 శాంపిళ్లు సేకరించింది. ఒక్కొక్క జిల్లా నుండి 100 నుండి 125 శాంపిళ్లు సేకరించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో నిర్వహించిన సర్వే ప్రకారం కౌలురైతుల్లో దాదాపు 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినవారే ఉన్నట్లు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం సభ్యులు సేకరించిన డేటాను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డేటా ఎంట్రీ చేసి, అనాలసిస్ చేసి నివేదికను రూపొందించింది.
కౌలురైతులకు గుర్తింపు కార్డు ఇచ్చిందా అని ప్రశ్నించినప్పుడు 87.7 శాతం మంది ఇవ్వలేదని కేవలం 12.3 శాతం మాత్రమే ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కౌలురైతులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో కౌలురైతులకు ఇస్తామన్న గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడమే. కౌలు రైతుల గుర్తింపునకు ప్రతిబంధకంగా తయారైన పంట సాగుదారు హక్కు చట్టం (సిసిఆర్సి) స్థానంలో కొత్తగా చట్టం తెస్తామని కూటమి హామీ ఇచ్చినా ఇది అమలుకాకపోవడం పట్ల కౌలురైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కూటమి ‘ప్రజాగళం’ పేరిట విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్ని సంక్షేమ పథకాలతో పాటు, పంటల బీమాను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి 17 నెలలు కావొస్తున్నా…ఇది కార్యరూపం దాల్చకపోవడంతో కౌలు రైతులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాది కాలంలోనే కౌలు రైతుల కోసం చట్టం తీసుకొస్తామని ప్రకటించినా ఈ చట్టాన్ని తీసుకురాకపోవడం పట్ల కౌలురైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కౌలురైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రశ్నిస్తే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని 27.4 శాతం, గుర్తింపు కార్డు ఇవ్వాలని 22.7 శాతం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని 12.9 శాతం, పెట్టుబడికి రుణాలు మంజూరు చేయాలని 10.9 శాతం, రుణమాఫీ చేయాలని 10.5 శాతం మంది కోరారు.
సామాజికంగా మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని ప్రశ్నించినప్పుడు, భూయజమానులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉచితంగా సర్వీస్ చేయవలసి వస్తుందని, బడుగు బలహీన వర్గాల వారి నుండి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ తమ సామాజిక వర్గానికి మాత్రం తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తున్నట్లు కౌలురైతులు తెలిపారు. కౌలు రేట్ల విషయంలో కూడా ఇటువంటి వ్యత్యాసాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఒక్కరికే ప్రతి సంవత్సరం కౌలుకు ఇస్తే భూమి మీద కౌలురైతులకు హక్కులు వస్తాయనే ఆందోళనలో భూయజమానులకు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. కౌలుకు ఇచ్చిన భూములపై భూయజమాని ముందుగానే పంటరుణాలు తీసుకుంటున్నారని, భూయజమానులు బ్యాంకుకు బకాయి ఉంటే వారి భూములు సాగు చేస్తున్న కౌలురైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదని సర్వేలో తేలింది. క్షేత్ర స్థాయిలో సర్వే సందర్భంగా కౌలురైతులతో మాట్లాడినప్పుడు నూతనంగా తీసుకొస్తామని చెప్పిన కౌలు చట్టంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందనే భావనలో అత్యధిక శాతం మంది కౌలురైతులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కౌలు చట్టాన్ని తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలు లేకపోయినా ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని తీసుకొని రావచ్చని పలుచోట్ల కౌలురైతులు తెలిపారు. కౌలుదారులకు కొత్త చట్టం తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5 సదస్సులు నిర్వహించి కౌలు రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సేవాసంస్థల నుండి అభిప్రాయాలు సేకరించారు. ఈ సేకరించిన సమాచారాన్ని చెత్త బుట్టలో వేశారా? లేక పరిగణలోనికి తీసుకుంటారా? అనే విషయంపై స్పష్టత లేదని పలు చోట్ల రైతులు తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా కౌలు రైతులకు భూయజమాని ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పినప్పటికీ, కూటమి ప్రభుత్వం వచ్చి 17 నెలలు కావొస్తున్నా కౌలు చట్టం అమలు కాలేదు, గుర్తింపు కార్డులు అందలేదు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో బ్యాంకులు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదు, దీంతో వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వస్తోంది, అప్పుల భారం పెరుగుతోంది. ఈ పంటలో నమోదు చేసుకోలేకపోవడంతో వరదలు, తుపానుల వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు అందడం లేదు. ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కౌలు రైతులు పంటలు అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. గుర్తింపు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది. వర్షాభావం, తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గుతోంది. కానీ కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదు. చాలా మంది కౌలు రైతులు నోటి మాటతో ఒప్పందాలు చేసుకుని భూమిని తీసుకుంటారు. దీనివల్ల భూయజమానులతో వివాదాలు వచ్చినప్పుడు వారికి చట్టపరమైన రక్షణ లభించడం లేదు. ఫలితంగా సాగు చేయడానికి భూమిని, భూమిలో పెట్టిన పంటను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు చేయడం గురించి కౌలు రైతులకు తగిన శిక్షణ లేదా సాంకేతిక సమాచారం అందడం లేదు. దీంతో దిగుబడి తగ్గుతోంది. కౌలు రైతులు పంటల బీమా పథకాల్లో చేరలేకపోతున్నారు. ఎందుకంటే వారి వద్ద భూమి యాజమాన్య పత్రాలు లేవు. దీనివల్ల పంట నష్టపోయినప్పుడు వారికి ఎలాంటి భరోసా లేదు. రైతు భరోసా పథకం కౌలు రైతులకు సహాయం చేయడానికి ప్రవేశపెట్టబడినప్పటికీ, అర్హత పత్రాలు లేకపోవడం, అవగాహనా లోపం వల్ల చాలా మందికి ఈ పథకం ప్రయోజనం అందడం లేదు. భూ యజమాని తీసుకునే రుణంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డు కలిగిన ప్రతీ కౌలు రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలను మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు. కౌలు రక్షణ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా కూటమి ప్రభుత్వం వెంటనే తీసుకొచ్చి కౌలు రైతులకు భరోసా ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించైనా ఈ చట్టాన్ని తీసుకొనిరావాలని అత్యధిక శాతం మంది కౌలురైతులు కోరుతున్నారు.
కౌలు దోపిడీ, వడ్డీ దోపిడీ, మార్కెట్ దోపిడీ, ఇన్ పుట్ ధరల దోపిడీ (విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరల నిరంతర పెరుగుదల)కి తోడు ప్రకృతి విపత్తులతో కౌలురైతులు అల్లాడిపోతున్నారు. చెమట చుక్క చిందించకుండానే భూ యజమాని అనేక ప్రయోజనాలు పొందుతున్నాడు. పంట వేసినప్పుడు దిగుబడి వస్తుందో రాదో, మద్దతు ధర దక్కుతుందో లేదో, కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అని తీవ్రమైన ఆందోళనతో కౌలురైతు మానసికంగా కుంగిపోతుంటారు. తద్వారా అనేక రోగాలకు, రుగ్మతలకు గురవుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక వేరే మార్గం లేక ప్రభుత్వాలు కనుకరించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బాధిత కుటుంబాలకు కౌలు గుర్తింపు కార్డు (భూ యజమాని కార్డు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో) లేకపోవడం చేత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా అందనటువంటి దయనీయమైన స్థితిలో కౌలు రైతులు ఉన్నారు. ఓట్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణ మాఫీ పథకం పెడితే బ్యాంకులో ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నారు. దీని వల్ల కౌలురైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ పథకాల ద్వారా భూ యజమానులే లబ్ధి పొందుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే యజమానిని బతికించడం కోసమే కౌలురైతులు బతుకుతున్నారా? అన్న ఆలోచన రాకతప్పడం లేదు. భూమిని కౌలుకు ఇచ్చిన భూ యజమానులకు (వ్యవసాయానికి సంబంధించిన) ఎటువంటి ఆందోళనలు, మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా, ఏ రోగాలు లేకుండా జీవితం గడుపుతున్నారు. పైగా కౌలురైతులపై వివిధ ఆరోపణలు చేస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25 శాతం మంది భూ యజమానులే సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. మరి కొంత మంది సొంత భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా సొంత భూమి లేని పేదలు కౌలుకు భూమి తీసుకుని సాగు చేసే వారు గణనీయంగా ఉన్నారు. ఇదీ! ప్రస్తుతం రాష్ట్రంలో కౌలు రైతుల ప్రాథమిక స్థితి!
Source ప్రజాశక్తి
వ్యాసకర్త : ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ దిలీప్ రెడ్డి

