రాష్ట్రంలో పరిశ్రమలు-అభివృద్ధి స్వభావం
:-వ్యాసకర్త – డా|| బి. గంగారావు
సెల్ : 9490098792
NTODAY NEWS:- ప్రత్యేక కథనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్ వివిధ దేశాల్లో వున్న బడా పారిశ్రామిక సంస్థల అధినేతలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీలలో విశాఖపట్నంలో జరగబోతున్న పెట్టుబడుల భాగస్వామ్య సమిట్‌కు ఆహ్వానిస్తున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతోటే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ పేర 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, అందుకు ఏడాదికి 15 శాతం వృద్ధిరేటును సాధించాలని, రాబోయే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాలను పెట్టుకొని విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఈ లక్ష్యాన్ని సాధించాలనే పేర రాష్ట్రంలో విచ్చలవిడిగా బలవంతపు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోంది. విశాఖ-చెన్నై కారిడార్‌లో ఫార్మా, కెమికల్ పార్కులు, 9 భారీ పారిశ్రామిక కేంద్రాలు, 25 పారిశ్రామిక క్లస్టర్లు, 500 పారిశ్రామిక ఎస్టేట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రైవేట్ పెట్టుబడులను రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు, ఐ.టి, విద్యుత్, ఎలక్ట్రానిక్స్, టూరిజం వంటి అనేక రంగాలకు ప్రత్యేక విధాన పత్రాలను విడుదల చేసింది. జీఎస్టీ, పెట్టుబడుల సబ్సిడీ, విద్యుత్ రాయితీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చార్జీల రద్దు ఇలా వేల కోట్ల విలువ చేసే రాయితీలు ప్రకటించింది. అంతేగాక అతి తక్కువ రేటుకు భూములు కేటాయిస్తున్నది. రోడ్లు, విద్యుత్, రైల్వే లైన్లు, మంచి నీరు వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వ ఖర్చుతోనే కల్పిస్తున్నది. వీటన్నిటితో పాటు కార్మికుల పనిగంటలు 8 నుండి 10 గంటలకు పెంచింది. రాత్రి వేళల్లో మహిళా కార్మికులతో పని చేయించుకునేందుకు అనుమతిస్తూ చట్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్ పరిశ్రమల అభివృద్ధి స్వభావాన్ని, వాటిలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు, వారి జీవనం, పరిశ్రమ చుట్టూ ఉన్న ప్రాంతాల అభివృద్ధి, వాటి భౌగోళిక విస్తరణ, ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు, ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయం ఆ ప్రాంతంలో విస్తరించిన సేవారంగం స్థితి వంటి వాటిని పరిశ్రమలవారీగా పరిశీలిస్తే వాటి అభివృద్ధి నైజం, విచ్చలవిడి దోపిడీ, పాలకుల వర్గ నీతి సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ఈ పరిశీలన కోసం విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ పోర్టుతో పాటు రాష్ట్రంలో గంగవరం, కృష్ణపట్నం దగ్గర ఉన్న అదానీ పోర్టులను తీసుకున్నాం. ఈ పోర్టులకు సంబంధించి అందుబాటులో ఉన్న కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని విశ్లేషించాం. విశాఖపట్నం పోర్టు స్వాతంత్య్రం ప్రారంభ కాలంలో ప్రభుత్వ రంగంలో ఏర్పడి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వ పోర్టు. అదానీ పోర్టులు ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ రంగంలో 17 ఏళ్ల క్రితం ఏర్పడినవి. ఒక పరిశ్రమ, అది సృష్టించిన అభివృద్ధిని సమగ్రంగా అంచనా వేయటానికి దశాబ్దంన్నర కాలం చాలా ఎక్కువే.
మొదటగా విశాఖపట్నం పోర్టును పరిశీలిద్దాం. ఇది ప్రభుత్వ పెట్టుబడులతో ఏర్పడిన పోర్టు. ప్రస్తుతం 4 వేల మంది పర్మినెంటు, 10 వేల మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు వివిధ ప్రైవేటు సంస్థల కింద పోర్టు కార్యకలాపాల్లో పనిచేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సర ఆదాయ వ్యయాలను చూద్దాం. 82.62 మిలియన్ టన్నుల కార్గోను ఈ ఏడాది పోర్టు హ్యాండిల్ చేసింది. మొత్తం రూ.2074 కోట్లు ఆదాయంతో పాటు రూ.724 కోట్లు నికర లాభాలు గత ఏడాది ఆర్జించింది. వచ్చిన ఆదాయంలో కార్మికుల వేతనాలకు రూ.385 కోట్లు (18.56 శాతం) చెల్లించింది. కేంద్ర భద్రతా బలగాలైన సి.ఎస్.ఐ.ఎఫ్ జవానులు 501 మంది పని చేస్తున్నారు. వీరి వేతనాలకు రూ.48.45 కోట్లు చెల్లించింది. అలాగే పనిచేస్తున్న కార్మికులకు, రిటైర్ అయినవారి వైద్య సేవలకు 40 పడకల ఆసుపత్రి నిర్వహణకు, ఇతర రిఫరల్ హాస్పిటళ్లకు సుమారు రూ.74 కోట్లు ఖర్చు చేసింది. మరో రూ.328 కోట్లు పోర్టులో పనిచేసి రిటైరయిన సుమారు 16 వేల మందికి పెన్షన్ కోసం చెల్లించింది. ఈ సొమ్మును పోర్టు సొంత పెన్షన్ నిధి నుండి చెల్లించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ, కస్టమ్స్, కార్పొరేట్ పన్నుల రూపంలో రూ.356 కోట్లు (వచ్చిన మొత్తం ఆదాయంలో 17.16 శాతం) బదిలీ చేసింది. మహా విశాఖ నగర పాలక సంస్థకు ఆస్తి పన్ను రూ. 93.59 కోట్లు చెల్లించింది. ఇదిగాక నగరంలో వివిధ రోడ్ల నిర్మాణాల కోసం మరో రూ.15 వేల కోట్ల పైనే ప్రతి ఏడాది ఖర్చు చేస్తున్నది. సామాజిక బాధ్యత కింద అనేక వితరణ కార్యక్రమాలు కూడా చేపడుతున్నది.
ఈ పోర్టు విశాఖ నగర అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించింది. పోర్టు అభివృద్ధితో పాటు నగర అభివృద్ధి పెనవేసుకొని కొనసాగింది. పోర్టు ఆధారంగా ఎన్నో ప్రైవేట్ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పడ్డాయి. వందల మంది పెట్టుబడిదారులు కొత్తగా అభివృద్ధి చెందారు. 1990 నాటికి 20 వేల మంది పర్మినెంట్ కార్మికులతో పాటు మరో 10 వేలమంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండేవారు. విద్యా, వైద్య, గృహ, ఇతర అనేక సేవా రంగాలపై బలమైన ప్రభావాన్ని కలిగించింది. నగరంలో వ్యాపార వాణిజ్య అభివృద్ధికి జీవం పోసింది. నగర విస్తరణకు తోడ్పడింది. అందులో పనిచేసే వారికి శక్తివంతమైన ఆర్థిక జీవన శక్తిని కల్పించింది.
విశాఖపట్నంలో ఉన్న అదానీ గంగవరం పోర్టు అభివృద్ధిని పరిశీలిద్దాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పిపిపి పేర ప్రైవేట్ రంగంలో 2004లో ఏర్పడిన పోర్టు. గత 17 ఏళ్ల నుండి కార్యకలాపాలు సాగిస్తున్నది. నాలుగేళ్ల క్రితం అదానీ యాజమాన్యం కేంద్ర బిజెపి సర్కార్ అండతో బలవంతంగా ఈ పోర్టును డివిఎస్ రాజు (ప్రాంతీయ పెట్టుబడిదారుడు) నుండి తమ వశం చేసుకుంది. రాష్ట్ర వాటాను కూడా కొనేసింది. ఈ పోర్టుకి రాష్ట్ర ప్రభుత్వమే 2 వేల ఎకరాల భూమిని కేటాయించింది.
2023-24లో 56 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేసి రూ.1637 కోట్ల ఆదాయాన్ని గడించింది. రూ.719 కోట్లు లాభం పొందింది. అంటే మొత్తం ఆదాయంలో 44 శాతం లాభం. కార్మికుల వేతనాలకు కేవలం 62 కోట్లు (మొత్తం ఆదాయంలో కేవలం 3.69 శాతం) మాత్రమే. మొత్తం 3 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వేతనం తప్ప ఇతర సదుపాయాలు ఏవీ కార్మికులకు ఉండవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల కింద రూ.115 కోట్లు (వచ్చిన మొత్తం ఆదాయంలో 6.84 శాతం) చెల్లించింది.
ఇక విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆస్తి పన్ను కేవలం ఏడాదికి 72 లక్షలు చెల్లిస్తున్నది. అదీ మానవతా దృక్పథంతో చెల్లిస్తున్నామని అదానీ యాజమాన్యం చెబుతున్నది. ఎందుకంటే గంగవరం పోర్టు స్థానిక మున్సిపల్ సంస్థకి ఎటువంటి పన్నులు చెల్లించకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫైడ్ ఏరియాగా పోర్ట్‌ను జివిఎంసి నుండి విడదీసి ప్రకటించింది. మంచినీటి సరఫరాకి జివిఎంసి విశాఖపట్నం పోర్టుకి కిలో లీటర్ (1000 లీటర్లు) రూ.70 వసూలు చేస్తుంటే అదే అదానీ గంగవరం పోర్టుకు కేవలం రూ.20కే సరఫరా చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అంతకు మించి ధర పెంచనీయడం లేదు.
కృష్ణపట్నం పోర్టు అదానీకి చెందిన మరొక పోర్టు. ఇది కూడా గంగవరం పోర్టు లాగే బిఓటీ (నిర్మాణం, నిర్వహణ, బదిలీ) ప్రాతిపదికిన ఏర్పడిన పోర్టు. ఈ పోర్టుకు అవసరమైన 4898 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పోర్టు కూడా 2009 నుండి కార్గో హ్యాండ్లింగ్ కార్యకలాపాలను ప్రారంభించింది. దీనిని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రోద్బలంతో నవయుగ విశ్వేశ్వరయ్య (ప్రాంతీయ పెట్టుబడిదారుడు) నుంచి అదానీ బలవంతాన నాలుగేళ్ల క్రితం లాగేసుకున్నాడు. ఇటీవల ఈ పోర్టులో కీలకంగా ఉన్న కంటైనర్ టెర్మినల్‌ను మూసేసి తమిళనాడులోని ఎన్నూరు పోర్టుకు కంటైనర్ కార్యకలాపాలను తరలించింది. ప్రస్తుతం 4 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
2024-25 సంవత్సరంలో ఈ పోర్టు కార్గో హ్యాండ్లింగ్ ద్వారా రూ.2974 కోట్లు ఆదాయం పొందింది. రూ.750 కోట్లు నికర లాభం గడించింది. రూ.113 కోట్లు కార్మికుల వేతనాలపై ఖర్చు చేసింది. అంటే మొత్తం ఆదాయంలో వేతనాల వాటా కేవలం 3.79 శాతం మాత్రమే. ఈ వేతనాల్లో కూడా కేవలం అదానీ పోర్టు యాజమాన్యం అధీనంలో ప్రత్యక్షంగా పనిచేసే పర్మినెంట్ కార్మికులకు రూ.44.87 కోట్లు చెల్లించింది. మిగిలింది పోర్టులో వివిధ ఏజెన్సీల కింద పలు పేర్లతో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల కోసం ఆయా ఏజెన్సీలకు చెల్లించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రూ.252 కోట్లు (మొత్తం ఆదాయంలో 8.47 శాతం) చెల్లించింది.
అదానీ రెండు పోర్టులు ఆధునిక కార్మిక దోపిడీ జైళ్లుగా మారాయి. ఈ పోర్టులకు వస్తున్న ఆదాయంలో వేతనాలకు ఎంత ఖర్చు చేస్తున్నారో పైన తెలిపిన వివరాల్లో చూశాం. ఐటిఐ, పాలిటెక్నిక్ చదివి టెక్నీషియన్‌గా ఏడేళ్ళ నుండి పనిచేస్తున్న వారికి రూ.16 వేల లోపే జీతం ఉంటుంది. ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన వారికి ప్రారంభంలో రూ.15 వేలు, ఐదేళ్లయినా రూ.20 వేలు దాటదు.
గంగవరం పోర్టులో నిర్వాసితుల కోటా కింద 600 మంది మత్స్యకారులకు ఉద్యోగం ఇచ్చారు. వీళ్ళ ఉద్యోగ సర్వీసు 14 నుండి 16 ఏళ్లు వుంటుంది. అందరికీ రూ.17 వేలు లోపే వేతనాలు. వీరు చేరిన దగ్గర నుండి తొలగించటానికి చేయని కుట్రంటూ లేదు. అదానీ రావటంతోటే అందరినీ తొలిగించేశారు. పోర్టు నిర్మాణం సందర్భంగా మత్స్యకారుల జీవనాధారానికి జట్టీ కట్టిస్తామని ఒప్పందం చేశారు. నీటికి కట్టలేదు. ఒప్పందంలో పేర్కొన్న నష్ట పరిహారాలను ఇంకా కొన్ని అమలు చేయకుండా మోసం చేశారు. కృష్ణపట్నం పోర్టు దగ్గర ఉన్న మత్స్యకారులకు కూడా ఇలాంటి ద్రోహమే జరిగింది. అక్కడా జట్టీ కట్టలేదు.
కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు లోనూ స్థానికులకు ఉపాధి ఇవ్వడం లేదు. ఒరిస్సా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుండి వలస కార్మికులను రప్పిస్తున్నారు. ఈ రెండు పోర్టుల వల్ల ఆ ప్రాంతం విస్తరణ లేదు సరికదా అవి వెదజల్లే విష కాలుష్యానికి రోగాల పాలవుతున్నారు. ముత్తుకూరు కృష్ణపట్నం పక్కనే ఉన్న మండల కేంద్రం. ఇప్పటికే ఆ గ్రామంలో వ్యాపార, వాణిజ్య, సేవా రంగాలు బాగా విస్తరించి పెద్ద మున్సిపాలిటీగా పరివర్తన జరిగి వుండాల్సింది. కానీ అక్కడి ప్రజలు నెల్లూరు నగర బాట పట్టాల్సి వస్తున్నది. గంగవరం గ్రామ ప్రజలు కూడా తమ గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని కోరుకుంటున్నారు.
స్థూలంగా చూస్తే రాష్ట్రంలో ప్రైవేట్ పరిశ్రమలు విధ్వంసకర అభివృద్ధిని సృష్టిస్తున్నాయి. అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ దోపిడీ చేస్తున్నాయి. వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నా కార్మికులు మాత్రం కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక పోతున్నారు. పరిశ్రమ చుట్టూ జనావాసాలు, వ్యాపారం, వాణిజ్యం విస్తరించాల్సింది పోయి నీరుగారిపోతున్నాయి. సేవా రంగంలో పెరగాల్సిన కార్యకలాపాలు, కార్మికుల వేతనాలు నామమాత్రం కావడంతో అడుగు ముందుకు వేయలేకపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుదలకు నోచుకోవడం లేదు. నేడు ఈ విధ్వంసకర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. కనుక ఈ ‘అభివృద్ధి’ నమూనాను అడ్డుకుంటేనే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు.
వ్యాసకర్త – డా|| బి. గంగారావు
సెల్ : 9490098792
#ntodaynews #apgovt #andhrapradesh #articles #industrialnews

