పేదరికాన్ని అంతం చేసిన కేరళ రాష్ట్రం
NTODAY NEWS: ప్రత్యేక కథనం
ప్రజా శక్తి సంపాదకీయం
ప్రగతి అంటే కేవలం భవనాలు, రహదారులే కాదు…ప్రతి పౌరుడూ గౌరవంగా బతగల హక్కు వున్న సమాజమే నిజమైన అభివృద్ధి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడమే కాదు, పాలనలో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం కూడా. ఈ సూత్రాన్ని ఆచరణాత్మకంగా మార్చే ప్రయత్నమే నవ కేరళ ప్రయాణం. ప్రభుత్వం చేపట్టిన ‘నవ కేరళ సద్భావన యాత్ర’.. ఒక పరిపక్వ ప్రజాస్వామ్యానికి ప్రతీక. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు. ప్రజల కలల్ని, ఆశల్ని, సమస్యల్ని నేరుగా విని, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించే ఒక సామూహిక యజ్ఞం. ఈ యాత్రలో ప్రజల నుంచి వచ్చిన సూచనల ఆధారంగానే ‘నవ కేరళ సృష్టి పథకం’ రూపొందింది. ‘పాలన అనేది ప్రజల కోసం మాత్రమే కాదు, ప్రజలతో కలిసి సాగాల్సిన ప్రయాణం’ అంటారు అంబేద్కర్. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఐటీ, పారిశ్రామిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం వంటి అనేక అంశాలకు కేరళ ఇచ్చిన ప్రాధాన్యత నవశకానికి, నవోదయానికి నాంది పలికింది. ‘పేదరికం, ఆకలి నుంచి విముక్తి జరగాలన్న ఐరాస లక్ష్యాన్ని సాధించిన తొలి రాష్ట్రం కేరళ’. దేశంలోనే తొలి తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా ఖ్యాతి పొంది, చారిత్రాత్మక ప్రయాణంలో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ఘనత కేరళను ప్రపంచపటంలో ఒక మార్గదర్శిగా నిలబెట్టింది.
కేరళ రాష్ట్రం ఏర్పడి 69 ఏళ్లు పూర్తయింది. విస్తీర్ణం పరంగా అతి చిన్న రాష్ట్రాలలో ఒకటి. అయినా ప్రపంచవ్యాప్తంగా గుర్తించే అనేక విజయాలను సాధించింది. తాజాగా కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్ 1న ‘తీవ్ర పేదరికంలేని తొలి రాష్ట్రం’గా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. ‘ఇది నవ కేరళ పుట్టుక’ అని ఆయన అన్నారు. 2021లో ప్రమాణస్వీకారం తర్వాత మొదటి క్యాబినెట్‌లో ‘తీవ్ర పేదరికాన్ని నిర్మూలించాలన్నది’ ప్రధాన నిర్ణయం. అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ ఘనతను సాధించారు. వామపక్ష ప్రభుత్వ ప్రజా ప్రణాళికా విధానం ఇందుకు దిక్సూచి. ఇఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వాన 1957లో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం వేసిన పునాది మార్గదర్శకం. ‘దేశమంటే మట్టి కాదోరు, దేశమంటే మనుషులోరు’ అంటారు గురజాడ. కేరళ ప్రజల సంక్షేమాన్ని కేంద్రంగా పెట్టిన అభివృద్ధికి ఇదొక రూట్‌మ్యాప్. దేశంలో తొలి తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ అవతరించే ప్రక్రియపై ‘ఇది కేవలం పరిపాలనా కార్యక్రమం మాత్రమే కాదు, వేలాదిమంది ప్రజల జీవితాలతో కూడిన ప్రయాణం’ అంటారు స్థానిక స్వపరిపాలనా శాఖ ప్రత్యేక కార్యదర్శి టీవీ అనుపమ. ఎపీ విజన్ మాత్రం… కార్పొరేట్లతో చెట్టపట్టాలేసుకొని పయనిస్తోంది.
ఆర్థిక అసమానత-పెట్టుబడిదారీ విధానం యొక్క తోబుట్టువు. ఇది ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదలను మరింత పేదలుగా మార్చే వ్యవస్థ. ఈ వ్యవస్థలోని భారతదేశంలో ఒక రాష్ట్రంలో అధికారంలో వున్న సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వం- తీవ్ర పేదరిక నిర్మూలనను సాధించింది. ‘మనిషి అసలైన స్వేచ్ఛను పొందేది, అతడు సమాజంలో ఇతరులతో ఏకతను అనుభవించినప్పుడు మాత్రమే’ అంటారు రవీంద్రనాథ్ టాగూర్. ఇది కేవలం నినాదం కాదు, మారిన మెరుగైన జీవన విధానం. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ఆంక్షలు, అసమానమైన ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని, నిలదొక్కుకొని కొత్త శకంలోకి అడుగులు వేస్తోంది కేరళ. ‘పేదరికాన్ని అంతం చేయడం కేవలం దాతృత్వం కాదు-అది న్యాయాన్ని సాధించడం’ అంటారు నెల్సన్ మండేలా. అలాంటి కృషిలో భాగమే నవ కేరళ ఆవిష్కరణ. భారతదేశ వృద్ధి గాథకు మార్గదర్శిగా నిలిచింది కేరళ. ‘ప్రజల శక్తి ముందు ఎలాంటి శక్తీ నిలవదు’-అన్న నమ్మకంతో ముందుకు సాగుతోంది. ఇదొక రాష్ట్ర ప్రయాణం కాదు, దేశం మొత్తం పాఠం నేర్చుకోవాల్సిన మార్గం. ఈ నవోదయం మన దేశానికి ఒక కొత్త ఉదయం. ప్రజల చేతుల్లోనే పాలన వున్న రోజున… ప్రజాస్వామ్యం నిజంగా వికసిస్తుంది. పరిమళిస్తుంది. పరిఢవిల్లుతుంది.

