ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు లైన్‌క్లియర్‌

Spread the love

ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు లైన్‌క్లియర్‌.!!

ఏపీలో శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు పెంపునకు మార్గం సుగమం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది.

దేశంలో జనగణన చేపట్టడానికి అనుమతిస్తూ సోమవారం కేంద్రం గెజిట్‌ నోటీఫికేషన్‌ జారీ చేసింది. జన గణన వచ్చే ఏడాది పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు.. శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది.

రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల శాసన సభల్లో స్థానాల పెంపునకు లైన్‌ క్లియర్‌ కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజిస్తూ 2014, మార్చి 1న ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014ను కేంద్రం జారీ చేసింది. దీంతో 2014, జూన్‌ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాజ్యాంగం లోని 170వ అధికరణలోని సెక్షన్‌-15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 134కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం-2014లో సెక్షన్‌-26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం 2019 నాటికే రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం, కేంద్రం పూర్తి చేస్తాయని రాజకీయపార్టీలు ఆశిస్తూ వచ్చాయి. కానీ.. ఆ ఆశలు అడియాసలయ్యాయి.

జన గణనతో ముడిపెట్టిన కేంద్రం జమ్మూ కశ్మిర్‌లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2022, మే 5న కమిషన్‌ను ఏర్పాటుచేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ శాసనసభ స్థానాలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో కె.పురుషోత్తం రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ కోటీశ్వర్‌ సింగ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు కోరింది. దేశంలో జన గణన ప్రక్రియ 2026లో పూర్తవుతుందని.. ఆ తర్వాతే విభజన చట్టంలో సెక్షన్‌-26(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పెంపునకు నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేస్తూ అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌పై తీర్పును ఏప్రిల్‌ 30న సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం రిజర్వు చేసింది.

ప్రజల సౌకర్యం.. పాలన సౌలభ్యమే ప్రాతిపదికగా:
జన గణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న అంశం ఏపీ విభజన చట్టంలో ఎక్కడా లేదు. ప్రజల సౌకర్యం, పాలన సౌలభ్యం, భౌగోళికంగా సమస్యలు తలెత్తకుండా శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని మాత్రమే ఎన్నికల సంఘానికి విభజన చట్టం నిర్దేశించింది. కానీ.. కేంద్రం జన గణనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పునర్విభజనను ముడిపెట్టడం గమనార్హం.

వాస్తవానికి జన గణన 2020లో ప్రారంభమై 2021 నాటికి పూర్తి కావాలి. కానీ.. 2020 ఫిబ్రవరి నుంచి 2022 వరకూ కరోనా మహమ్మారి మూడు విడతలుగా దేశ వ్యాప్తంగా ప్రబలింది. దీంతో జన గణనను అప్పట్లో కేంద్రం వాయిదా వేసింది. అంతలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో ఆ అంశం మరుగున పడింది.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »