ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వ్యక్తిగత కక్షలకు వాడుకోనివ్వద్దు
NTODAY NEWS: ఆంధ్రప్రదేశ్ జులై 26 (ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)
ఫిర్యాదుదారులు ఎస్సీ, ఎస్టీలు కావడం ఒక్కటే ఎట్రాసిటీ కేసుల్లో ప్రాసిక్యూషన్ కు ప్రాతిపదిక కాకూడదు. నేరారోపణలు పూర్తిగా బాధితుడి కులం గురించే జరిగినట్లు ఉండాలి. వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం, వ్యక్తులను వేధించడం కోసం చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం కల్పించకూడదు. అభియోగాల్లో చట్టపరమైన లోపం ఉందని భావించినప్పుడు వ్యక్తులపై అనవసరమైన వేధింపులను నిరోధించడానికి ప్రాథమిక దశలోనే ప్రాసిక్యూషన్ ను కొట్టేయాలి. లేదంటే నిందితులు అనవసర వేధింపులకు గురవుతారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద తప్పుడు కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నట్లు సుప్రీంకోర్టు ఇదివరకే అభిప్రాయపడింది. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులు, న్యాయాధికారులపై వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి, వేధించడానికి ఇలాంటి కేసులు ఎక్కువగా పెడుతున్నారు. ఇలాంటి వాటిని ప్రారంభ దశలోనే అడ్డుకోవాలి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.ఏలూరు 2వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ముందున్న కేసును కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు 2014 అక్టోబర్ 10న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా దువ్వ గ్రామంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థలాలను అక్కడి తహసీల్దార్ కుట్రపూరితంగా అగ్రవర్ణాలకు కేటాయించారని కొండే నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆరోపించారు. తర్వాత ఆయనపై ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఆ నేరం జరిగినప్పుడు నాగేశ్వరరావు అక్కడ లేరని నిరూపితమవడంతో ఆయనపై అభియోగాలను ఉపసంహరించారు. ప్లాట్ల కేటాయింపుల్లో అవకతవకల గురించి తాను అధికారులపై ఆరోపణలు చేసినందుకు ప్రతీకారంగానే తనను కేసులో ఇరికించారని, తాను ఎస్సీ కావడం వల్లే తప్పుడు కేసు నమోదు చేశారంటూ నాగేశ్వరరావు తహసీల్దార్, పోలీసు అధికారి సహా పలువురు ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు పెట్టారు.పోలీసులు దర్యాప్తు చేసి, సదరు అధికారులపై ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారించి, వారిపై నమోదు చేసిన ప్రొసీడింగ్స్ మొత్తాన్ని 2014 అక్టోబర్లో కొట్టేసింది. దాన్ని సవాల్ చేస్తూ నాగేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అన్ని కోణాల్లో పరిశీలించిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. ఫిర్యాదుదారు కులం ఆధారంగా ప్రభుత్వ అధికారులు దురుద్దేశంతో వ్యవహరించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని పేర్కొంది. ప్లాట్ల కేటాయింపులో జరిగిన తప్పులను అప్పటికే సరిదిద్దినట్లు తెలిపింది.

