శోభాయమానంగా శ్రీవారి వసంతోత్సవం,అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం.
NTODAY NEWS: భువనగిరి పట్టణం, జూన్ 07(శ్రీ స్వర్ణ గిరి దేవాలయం)
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠము శుక్ల పక్షములు గ్రీష్మ ఋతువు ద్వాదశి శనివారం జూన్ 7వ తేదీవ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతః కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది.
సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 నిమిషాలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 6 గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధ భరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు.స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం లో శ్రీ అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పంచామృతములు,పసుపు, సుగంధ ద్రవ్యాలతో వేదమంత్రోచ్ఛారణలతో వసంతోత్సవ సేవను శోభాయ మానంగా నిర్వహించడం జరిగింది. అనంతరం అర్చక స్వాములు కర్పూర మంగళహారతులు సమర్పించారు. ఉదయం 10:30 లకు విశ్వేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి మరియు సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు.భక్తులు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు.ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా సుమారు 4000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.సాయంత్రం 6:30 కు ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో శనివారం సందర్భంగా జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు సమర్పించారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారని తెలిపారు.