కులం పునాదులు కూలాల్సిందే
NTODAY NEWS:- ప్రత్యేక కథనం
-మల్లేపల్లి లక్ష్మయ్య
‘భారత దేశంలో కులం సామాజిక సామరస్యతను పరిరక్షించడానికి ఉపయోగపడింది. అంతేకాని కులం ప్రగతి నిరోధకమైంది కాదు’ అంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత నెల సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంకోర్టు ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ సమస్యకు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇందుకు గాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం మౌలోని డా॥ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఎందిన సోషల్ సైన్సెస్ విభాగం నిర్వహించిన ఒక సామాజిక సర్వేను తన అఫిడవిట్‌లో ప్రస్తావించింది.
వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థిక, విద్య, రాజకీయ స్థితిగతులపై ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలో మిగతా విషయాలు ఎట్లా ఉన్నప్పటికీ, కులంపై చేసిన వ్యాఖ్యానం కేవలం సైద్ధాంతిక సమస్య మాత్రమే కాదు. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. ఇటువంటి వాదనలు రెండు విషయాలను మరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా కులం అనే సమస్యపైన ఆర్‌ఎస్‌ఎస్‌లోని కొన్ని శక్తులు భారతదేశ వాస్తవిక స్థితిని మరుగు పరిచి, క్రమంగా రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను పట్టించుకోకపోవడం గాని, క్రమంగా వాటిని రాజ్యాంగం నుంచి తొలగించడానికి ప్రయత్నం జరుగుతున్నది.
భారతదేశంలో కులం ఎన్నో అనర్థాలకు దారి తీసిందని, మరెన్నో ఘాతుకాలు జరిగాయని, ముఖ్యంగా మనుషుల్లో ఉండాల్సిన మానవ సంబంధాలను కేవలం హెచ్చుతగ్గుల సాంప్రదాయంగా మార్చి, ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చెలాయించడానికి వాడుకున్నారని చరిత్ర పొడవునా ఎన్నో రుజువులున్నాయి. భారతదేశంలో కులం అనేది లేదని, పాశ్చాత్య ఆక్రమణదారులు దీనిని సృష్టించారని మరొక ప్రచారం. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్లు కళ్లు ఉన్న అంధులు తప్ప ఎక్కువ చెప్పిన ప్రయోజనం లేదు. కులం ఉనికిలో ఉన్నదని వీళ్లు అంగీకరిస్తున్నారు. అయితే ఈ కులం సామాజిక ప్రగతికి మాత్రమే ఉపయోగపడిందని వారి భావన. ఒకవేళ అదే నిజమైతే చరిత్ర పొడవునా జరిగిన ఘర్షణలు, యుద్ధాలు వీళ్లకు కనిపించలేదు.
వీళ్లు నమ్ముతున్న పురాణాలు కూడా అదే విషయాన్ని రుజువు చేయడం లేదా! భారతదేశ సాంప్రదాయానికి ప్రధాన గురువులైన వశిష్టుడు, విశ్వామిత్రుడు జరిపిన సంఘర్షణ బ్రాహ్మణ క్షత్రియ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కాదా! అదే విధంగా బ్రాహ్మణ వర్గమంఆ యాగాల పేరుతో జాతి సంపదను అగ్గిపాలు చేస్తుంటే, మిగతా కులాలు, వర్గాలు తిరగబడితే, తమ మనస్సు నచ్చు గోమాంసం తినడం మానేసి మళ్లీ తమ ఆధిపత్యం కోసం ఆర్థిక దోపిడీ కోసం సాంప్రదాయాలను సృష్టించడం లేదా! భారతంలోని కథలన్నీ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదుర్కొన్న క్షత్రియుల హత్యల ఉదంతాలు కావా!
అంతేకాకుండా గౌతమ బుద్ధుని మొదలుకొని బాబా సాహెబ్ అంబేద్కర్ దాకా సాగించిన సామాజిక ఉద్యమం ఎందుకు? గురునానక్, కబీర్, జ్ఞానేశ్వర్ తుకారాం, చొక్కామేళా, గాడ్గేబాబా, జ్యోతిబా ఫూలే, సావిత్రి భాయి ఫూలేలు ఎందుకు తమ కులాధిపత్య పోరాటాలకు అంకితం చేశారు? ఇది చరిత్ర. వర్తమానంలోకి వస్తే ఇప్పటికీ దళితుల మీద ఎందుకు హత్యలు, అత్యాచారాలు, దాడులు, అవమానాలు జరుగుతున్నాయి. ఇవి సామరస్య హత్యలా, విద్వేష హత్యలా!
ఒక చిన్న పిల్లవాడు పాఠశాలలో నీటి కుండను ముట్టుకున్నాడని కర్రతో కొట్టి చంపింది కూడా కుల సామాజిక సామరస్యమేనా? కీలవేణిమని, బెల్చి, కారంచేడు, చుండూరు, ఖైర్లాంజి లాంటి అతి ఘోరమైన దళితుల ఊచకోత సామాజిక సామరస్యతకు నిదర్శనమా? అయితే ఇవన్నీ తెలియక కాదు. కావాలని ఒక కుట్రపూరితమైన చర్చను లేవనెత్తుతున్నాయి. అది కూడా ప్రజాస్వామ్య విధానంలో, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అటువంటి అభిప్రాయాన్ని అది కూడా సుప్రీంకోర్టు ముందు పెట్టడం యాదృచ్ఛికం కాదు.
భారతదేశ సుప్రీం కోర్టుకు ఒక ప్రధానమైన బాధ్యత ఉంది. అది రాజ్యాంగ విలువలను కాపాడడం, హక్కులను రక్షించడం. అయితే ఇటువంటి వాదనలు సుప్రీం కోర్టు ముందు పెట్టడమంటే, ఎంతో మంది దార్శనికులు, రాజ్యాంగ నిపుణులు, ప్రత్యేకించి బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని నిరాకరించడమే. నిజానికి ఈ ఒక్క విషయం చాలు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడానికి. ఎందుకంటే పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తాము రాజ్యాంగ విలువలను కాపాడుతామని ప్రమాణం చేస్తారు. ఈ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనది.
భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పూర్తిగా భారత దేశంలో ఉన్న సామాజిక వ్యత్యాసాలు, ప్రత్యేకించి కులవ్యవస్థ, అంటరానితనం నిర్మూలన జరగాలని ఉద్దేశించినవి. ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14 నుంచి 21 వరకు సంపూర్ణంగా కుల అసమానతలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. అదే విధంగా ఆదేశిక సూత్రాలలోని చాలా అంశాలు కుల అసమానతలను రూపుమాపడానికి ఉపయోగపడతాయని భావించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు కూడా మౌనం వహిస్తే దాని అర్థం ఏమిటో తెలియదు. ఇటు ప్రజా ఓట్లతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఇటువంటి వ్యాఖ్యలు భవిష్యత్‌లో రాజ్యాంగ విలువలను సంపూర్ణంగా మార్చి సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను పెంచి పోషించే కుల వ్యవస్థను మళ్లీ మనం తిరిగి మరింత బలం చేకూర్చినట్టవుతుంది.
అదే విధంగా కుల వ్యవస్థ వలన సామాజిక రంగంలోనే కాదు, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అది మరింత పటిష్టంగా కనపడుతున్నది. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు కేవలం ఉపాధి, వ్యాపారం, వాణిజ్యం మాత్రమే కాదు కులం కూడా ఈ అసమానతలను పెంచి పోషిస్తున్నది. ఈ రోజు దేశంలో వ్యాపారాలు, పరిశ్రమలు, కార్పొరేట్లు కొన్ని కులాలకే పరిమితమవుతున్నాయి. ఆయా రంగాల్లో ఆ కులాలు ఆధిపత్యం నిరంతరం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఇందులో ఎటువంటి మార్పులు లేవు.
ఈ విషయాలపైన ఎన్నో పరిశోధనలు జగిగాయి. జరుగుతున్నాయి. వ్యాపారాలు, పరిశ్రమలు కొన్ని కులాలకు డబ్బులు ఆర్జించి పెట్టి లక్షల కోట్ల అధిపతులను చేసే అదే వ్యాపార, పారిశ్రామిక వర్గాలు కంపెనీల్లో పని చేసి ప్రాణాలు కోల్పోవడం నిమ్న కులాల వంతుగా మారింది. దానికి ఎన్నైన ఉదాహరణలు ఇవ్వవచ్చు. ఆధిపత్య కులాలు అన్ని రంగాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటే, మిగతా కులాలు పేదరికంలో మగ్గుతున్నాయి.
విద్య, వైద్య సౌకర్యాలు కూడా ఎవరికి అందుబాటులో ఉన్నాయి? వరదల్లో కరువులో ఎవరు ఆకలి చావుల్లో బతుకుతున్నారు? రైతుల ఆత్మహత్యల్లో ఏ కులాలు ఉన్నాయి? ఇవన్నీ తెలియని విషయాలు కాదు. ఈ విషయాలు మాట్లాడుతున్న వాళ్లు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. అయితే ఈ కుల వ్యవస్థ వల్ల అనేక సమస్యలకు, అసమానతలకు, అవమానాలకు, హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్న నూటికి ఎనభై శాతం మంది వివక్షకు గురవుతున్న కులాలు ఇప్పటికైనా మేల్కోవాలి. ఈ దేశంలో కులం ఉన్నంత వరకు ఈ అవమానాలు, వివక్ష సమసిపోదని గుర్తించాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కుల వ్యవస్థ ఈ దేశ విచ్ఛిన్నానికి కారణం కాగలదని, కులం పునాదుల మీద జాతిని, నీతిని నిర్మించలేమని అర్థం చేసుకోవాలి.

