కూటమి ప్రభుత్వ హయాంలో వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు సంక్షేమం అందిస్తూ, నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పటిష్ట ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలను చూసి వాటి పరిష్కారాన్ని అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏలూరు 49వ డివిజన్ లక్ష్మీ నగర్ లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి ఆయన పర్యటించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలతో పాటు ఎమ్మెల్యే అయిన తర్వాత వినతుల ద్వారా తెలుసుకుంటున్న సమస్యల పరిష్కారానికి కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పెద్దపీట వేస్తున్నామన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజావసరాలకు ప్రాధాన్యత ఇస్తూ, యుద్ధ ప్రాతిపదికన పలు సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైన్ల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకుంటున్న అన్నారు. దీనిలో భాగంగానే శనివారం ఆయన ఏలూరు 49వ డివిజన్ లక్ష్మీనగర్ లో స్వయంగా పర్యటించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులను చూడడంతో పాటు స్థానికులతో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. వాటిలో తక్షణం చేపట్టాల్సిన పనులకు సంబందించి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టీడీపీ సానుభూతిపరులు నివసించే ప్రాంతాలలో అసలు అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజకీయాలను పక్కన పెట్టి, ప్రజలకు మౌళిక వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. లక్ష్మీనగర్ లో రెండు రోడ్లకు 40 లక్షల రూపాయల గ్రాంట్ కేటాయించామని, కొత్తగా మరో రోడ్డు నిర్మాణానికి 9 లక్షల 80 వేల రూపాయలు మంజూరు చేశామని, మొత్తంగా 50 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే లక్ష్మీనగర్ లో డ్రైన్ల పూడిక తీయకపోవడం వల్ల నీరు నిలిచిపోతోందని స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని డీఈ తాతబ్బాయిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే ఏలూరు నగరంలో పలుచోట్ల ఖాళీస్థలాలు వర్షపు నీరు, వ్యర్థాలతో ఉండడం వల్ల చుట్టుపక్కల నివసించేవారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రానున్న 15 రోజుల్లో ఖాళీ స్థలాలను శుభ్రం చేయడంతో పాటు ఎత్తు పెంచుకోవాలని సూచిస్తూ, స్థల యజమానులకు కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేస్తారని చెప్పారు. అప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేకపోతే ఆ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కార్పొరేషన్ కోఆఫ్షన్ పభ్యులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
