విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి, ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
NTODAY NEWS: భువనగిరి
పాఠశాలలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యను బోధించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులని అడిగి తెలుసుకొని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. నాణ్యమైన భోజనం అందిస్తేనే జ్ఞాపకశక్తి పెరిగి విద్యార్థులు మంచిగా చదువుతారని అన్నారు. అనంతరం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి విద్యార్థులతో మాట్లాడుతూ ఇప్పటినుండే పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలనే ఒక ప్రణాళిక వేసుకొని చదివినవి మర్చిపోకుండా రివిజన్ చేసుకుంటూ మంచిగా చదవాలని విద్యార్థులకు హిత బోధ చేశారు.పదవ తరగతి అనేది జీవితంలో ముందుకు పోవడానికి తొలి మెట్టు కాబట్టి మంచిగా చదవుకోని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఇష్టంతో కష్టపడి చదివితే తప్పనిసరిగా మంచి మార్కులతో ఉతీర్ణులవుతారని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆండాలు, సిబ్బంది ఉన్నారు.

