11 ఏళ్లుగా వెంట్రుకలు తింటున్న యువతి.. పొట్టలో కిలోకు పైగా వెంట్రుకల ముద్ద!
తీవ్ర కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రికి.. శస్త్రచికిత్స చేసి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఢిల్లీలో వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగుచూసింది. తొమ్మిదేళ్ల వయసు నుంచే సొంత వెంట్రుకలను తింటున్న 20 ఏళ్ల యువతి పొట్టలో భారీగా వెంట్రుకలు పేరుకుపోయాయి. చివరకు తీవ్ర కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రికి వెళ్లగా.. పరీక్షల్లో పొట్టలో భారీ వెంట్రుకల ముద్ద ఉన్నట్లు గుర్తించారు.
వైద్యుల వివరాల ప్రకారం.. యువతి సుమారు 11 ఏళ్లుగా వెంట్రుకలు తినే అలవాటుతో బాధపడుతోంది. ఈ ప్రవర్తనను వైద్య పరిభాషలో ట్రైకోఫేజియా అంటారు. ఇటీవల వరుసగా మూడు రోజులపాటు తీవ్రమైన కడుపునొప్పి, వికారం, వాంతులు రావడంతో ఆమెను ద్వారకలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, నీరసం వంటి సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
పరీక్షల్లో పొట్ట పైభాగంలో గట్టిగా ఉన్న ముద్దను గుర్తించిన వైద్యులు మరిన్ని పరీక్షలు నిర్వహించారు. జీర్ణాశయ అంతర్భాగాన్ని పరిశీలించే పరీక్షలో భారీ వెంట్రుకల ముద్ద ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ముద్ద ‘జే’ ఆకారంలో ఉండి.. ఆహారనాళం, పొట్ట కలిసే ప్రాంతం నుంచి చిన్నపేగు ప్రారంభ భాగం వరకు విస్తరించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పొట్ట పూర్తిగా ఉబ్బిపోయి, లోపల ఆహారం కోసం కూడా తక్కువ స్థలం మాత్రమే మిగిలింది.
మొదట అంతర్గత పరికరంతో ఆ ముద్దను చిన్నచిన్న ముక్కలుగా చేసి బయటకు తీసేందుకు ప్రయత్నించినా.. దాని పరిమాణం, గట్టితనం కారణంగా పూర్తిగా తొలగించడం సాధ్యం కాలేదు. దీంతో వైద్యులు చిన్న కోత ద్వారా శస్త్రచికిత్స నిర్వహించి మొత్తం వెంట్రుకల ముద్దను బయటకు తీశారు.
శస్త్రచికిత్స అనంతరం బయటకు తీసిన వెంట్రుకల ముద్ద 1.16 కిలోల బరువు ఉన్నట్లు తేలింది. భారీ ముద్ద కారణంగా పొట్ట గోడకు గాయం అయ్యే ప్రమాదం కూడా ఉందని వైద్యులు తెలిపారు.
శస్త్రచికిత్స తర్వాత యువతి ఆరోగ్యం మెరుగుపడింది. ఆకలి తిరిగి పెరగడంతోపాటు ఆహారం తీసుకునే సామర్థ్యం మెరుగుపడింది. అనంతరం బరువు కూడా పెరిగి, తిరిగి చదువులకు హాజరవుతున్నట్లు వైద్యులు తెలిపారు.
వెంట్రుకలు జీర్ణం కావు. వాటిని పదేపదే మింగితే క్రమంగా పొట్టలో పేరుకుపోయి గట్టిపడతాయి. దీనినే ట్రైకోబీజోర్ అంటారు. ఇటువంటి సమస్యలు చాలాకాలం గుర్తించకుండా ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కడుపునొప్పి, ఆకలి తగ్గడం, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలతో పాటు వెంట్రుకలు తినే అలవాటు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
వెంట్రుకల ముద్దను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం వల్ల శారీరక సమస్య పరిష్కారమైనప్పటికీ.. వెంట్రుకలు తినే అలవాటుకు కారణమైన ప్రవర్తనా సమస్యను కూడా గుర్తించి తగిన మానసిక సహాయం అందించడం అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.