సిపిఎం పార్టీ ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో పాషా నరహరి 37వ వర్ధంతి.
- భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు
- కామ్రేడ్ల సేవలు చిరస్మరణీయం: సీపీఎం నాయకులు
ఎల్బీనగర్ (ఎన్ టుడే న్యూస్): సీపీఎం ఎల్బీనగర్ సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పాషా నరహరి 37వ వర్ధంతి కార్యక్రమం సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. చంద్రమోహన్, ఆలేటి ఎల్లయ్య, ఎం. యాదయ్య తదితరులు పాల్గొని పాషా నరహరి సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో ఎర్రజెండా నాయకత్వంలో భూమిలేని పేదలకు వేలాది ఎకరాల భూములు పంపిణీ చేయడం, వ్యవసాయ కూలీలకు న్యాయమైన కూలి రేట్లు కల్పించడం, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించడం వంటి ఉద్యమాల్లో పాషా నరహరి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులను చైతన్యపరుస్తూ ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.
1989 అక్టోబర్ 26న పాషా నరహరిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారని సీపీఎం నాయకులు ఆరోపించారు. భూమిలేని పేదలు, కూలీలు, కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న నాయకత్వాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈ హత్య జరిగిందని వారు పేర్కొన్నారు. పాషా నరహరి వంటి ప్రజా ఉద్యమ నాయకుల త్యాగాలు ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
జాపాల గ్రామంలో 45 అడుగుల స్తూపం
కామ్రేడ్ పాషా నరహరి స్మారకార్థం జాపాల గ్రామంలో 45 అడుగుల స్తూపాన్ని నిర్మించి, నవంబర్ మొదటి వారంలో సీపీఎం జాతీయ, రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
స్మారక స్తూప ఆవిష్కరణ, బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్కిల్ కమిటీ సభ్యులు మంతాని యాదయ్య, భూషరాజు కాశయ్య, హయత్‌నగర్ సర్కిల్ కమిటీ సభ్యులు, చింతపల్లి కృష్ణయ్య, తడబోయిన కృష్ణమూర్తి, మన్యం రాధమ్మ, గ్యార కలమ్మ, సీహెచ్ జంగయ్య, అభిమల్ల గంగమ్మ, దుర్గయ్య, లక్ష్మి, రెడ్డమ్మ, శోభ, మున్ని, యాదమ్మ, కలమ్మ, సఫియా బేగం, సుగుణమ్మ, శ్రీను, మహేష్ తదితరులు పాల్గొన్నారు.