14 ఏళ్ల ప్రేమాప్రయణం.. విదేశీయుడితో అర్జున్ సర్జా చిన్న కుమార్తె వివాహం
అమెరికాలో హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు
సినీ నటుడు అర్జున్ సర్జా చిన్న కుమార్తె అంజన వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు ఇసాయ్ నట్టర్‌తో 14 ఏళ్ల పాటు సాగిన ప్రేమ ప్రయాణానికి ముగింపు పలుకుతూ మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అమెరికాలో చదువుకునే సమయంలో అంజనకు ఇసాయ్‌తో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఏళ్ల తరబడి కొనసాగిన అనంతరం పెళ్లి వరకు చేరింది. అక్టోబర్ 19న అమెరికాలో హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహ వేడుక జరిగినట్లు సమాచారం. తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి. 14 ఏళ్ల ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్న ఈ జంటకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా, అర్జున్ సర్జా పెద్ద కుమార్తె ఐశ్వర్య ఇప్పటికే తమిళ నటుడు ఉమాపతి రామయ్యను వివాహం చేసుకుంది. దీంతో అర్జున్ సర్జా కుటుంబంలో మరో వివాహ వేడుక జరగడం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.