కొవ్వొత్తుల ర్యాలీతో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి
- వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఆధ్వర్యంలో ర్యాలీ
- అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న పోలీస్ అధికారులు, సిబ్బంది
- అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ..
- పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు
హనుమకొండ | ఎన్ టుడే న్యూస్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
హనుమకొండలోని అశోక జంక్షన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుంది. అక్కడ అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి, కొవ్వొత్తులు వెలిగించి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
దేశ భద్రత, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేయడం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే సవాళ్లను గుర్తుచేస్తూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సాహసం, అంకితభావాన్ని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అడిషనల్ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్) రాయల ప్రభాకర్ రావు, అడిషనల్ డీసీపీలు బాలస్వామి, సురేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
వీరితో పాటు ఏసీపీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు ర్యాలీలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.