నీరు అందక ఎండిన 20 ఎకరాల వరి పంట.. ఆవేదనతో నిప్పు పెట్టిన రైతు
తుంగభద్ర నది పక్కనే ఉన్నా అందని సాగునీరు
జోగులాంబ గద్వాల జిల్లా | ఎన్ టుడే న్యూస్:
సాగునీరు అందక వరి పంట ఎండిపోవడంతో ఓ రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పెట్టుబడి మొత్తం వృథా కావడంతో మనస్తాపానికి గురైన రైతు తన పంటకు నిప్పు పెట్టాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం మాన్‌దొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ఉప్పరి వెంకటేష్ 20 ఎకరాల్లో వరి సాగు చేశాడు. తన పొలం పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తున్నప్పటికీ, మరోవైపు 18, 19 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నప్పటికీ సాగునీరు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
అధికారులు కాలువలకు నీటిని విడుదల చేయకపోవడంతో పంట ఎండిపోయిందని వెంకటేష్ వాపోయాడు. పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఎండిపోయిన పంటకు నిప్పు పెట్టాడు.
సాగునీటి వనరులు సమీపంలో ఉన్నప్పటికీ పంటకు నీరు అందకపోవడంపై రైతు ఆవేదన వ్యక్తం చేసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.