ఆపదలో రైతు కుటుంబాలకు సహకార సంఘం అండ మరణించిన సభ్యుల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం
రైతుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పనిచేస్తున్నాయని చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఇటీవల మరణించిన సహకార సంఘ సభ్యులు కటకం సత్యనారాయణ, బన్నే మహేశ్వరరావు కుటుంబాలకు సంఘం తరఫున ఆర్థిక సాయం అందించారు. సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో మట్టి ఖర్చుల నిమిత్తం ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.20 వేల ఆర్థిక సాయాన్ని మోరంపూడి శ్రీనివాసరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు, వారి కుటుంబాలకు కష్టసమయాల్లో అండగా నిలవడమే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు, సంఘ సభ్యుల కుటుంబాలకు అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు భరోసా కల్పిస్తూ సహకార సంఘాలు సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సీఈవో వెంకటేశ్వరరావు, షేక్ రియాజ్, గజవెల్లి శ్రీనివాసరావు, ధర్మరాజుల దుర్గారావు, పలువురు రైతులు పాల్గొన్నారు.