ఆరుగొలనుపేట దుర్గమ్మ నగదు దండ రూ.60 వేలకు కైవసం
అమ్మవారిపై భక్తితోనే వేలం పాటలో పాల్గొన్నా.. ఇజ్జిగాని తులసీరామ్
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో విజయదశమి సందర్భంగా నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తుల సందడితో కొనసాగాయి. ఈ సందర్భంగా దుర్గామాత విగ్రహానికి భక్తులు ఏర్పాటు చేసిన రూ.15 వేల నగదు దండను దక్కించుకునేందుకు నిర్వహించిన వేలం పాటలో సాయి, ఇజ్జిగాని తులసీరామ్ పోటీపడ్డారు. ఇద్దరూ ఉత్సాహంగా పాట పాడటంతో ధర క్రమంగా పెరిగింది. చివరకు ఇజ్జిగాని తులసీరామ్ రూ.60 వేలతో నగదు దండను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా ఇజ్జిగాని తులసీరామ్ మాట్లాడుతూ, “దుర్గామాతపై ఉన్న భక్తి, విశ్వాసంతోనే వేలం పాటలో పాల్గొన్నాను. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మన గ్రామంలో ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామ ప్రజల మధ్య ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయి. అమ్మవారి సేవలో భాగస్వామ్యం కావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది” అని తెలిపారు.
దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేలం పాట గ్రామస్థులు, భక్తుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించింది. ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.