కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు.. తొలివిడతగా రూ.2.50 లక్షలు తీసుకుంటుండగా ముగ్గురు పట్టుబడినట్లు సమాచారం
కీసర, మేడ్చల్–మల్కాజిగిరి (ఎన్ టుడే న్యూస్): భూమి వారసత్వ హక్కుల మార్పిడి (సక్సెషన్) ప్రక్రియకు సంబంధించి లంచం తీసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ విజయ్కుమార్రెడ్డి, రికార్డు అసిస్టెంట్ బాలకృష్ణ పట్టుబడినట్లు తెలిసింది.
వివరాల ప్రకారం.. సర్వే నంబర్లు 183, 184 పరిధిలోని మూడు ఎకరాల భూమికి సంబంధించిన సక్సెషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు బాధితుల నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తంలో తొలివిడతగా రూ.2.50 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసినట్లు సమాచారం.
రసాయనాలు పూసిన నోట్లను స్వీకరిస్తున్న సమయంలో అధికారులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం నగదును స్వాధీనం చేసుకుని కార్యాలయంలో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారులపై తీసుకున్న చర్యలు ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన ద్వారా నిర్ధారించాల్సి ఉంది.