కనిగిరి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా అచ్చాల తిరుపతమ్మ
టీడీపీ అధిష్టానం నిర్ణయంతో తెరపైకి కొత్త పేరు.. ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చిన ఆశావహుల్లో ఉత్కంఠ
కనిగిరి: కనిగిరి మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థిగా కొత్తూరుకు చెందిన అచ్చాల తిరుపతమ్మ పేరును టీడీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ఆశించిన నాయకుల్లో రాజకీయ చర్చ మొదలైంది.
చైర్పర్సన్ అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో ఊహ శ్రీ (ఎమ్మెల్యే కుమార్తె), నాగ దుర్గ, సుబ్బలక్ష్మి, నాగ మల్లీశ్వరి, జహీరా బేగం పేర్లతో స్థానికంగా ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి. దీంతో ఈ పేర్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని ఆశావహులు భావించినట్లు తెలుస్తోంది.
అయితే, అనూహ్యంగా అచ్చాల తిరుపతమ్మ పేరును టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చిన ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం కనిగిరి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.