జగ్గయ్యపేటలో జిల్లా పరిషత్ భూమిపై ఆక్రమణల ఆరోపణలు
జగ్గయ్యపేటలో జిల్లా పరిషత్ భూమిపై ఆక్రమణల ఆరోపణలు ఉన్నతాధికారులకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసిన AIYF జిల్లా అధ్యక్షుడు కరిసే మధు
జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని కోదాడ రోడ్డు, పుట్టబజార్ పక్కన సర్వే నంబర్ 164/2లో ఉన్న జిల్లా పరిషత్ భూమిపై ఆక్రమణలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (AIYF) ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కరిసే మధు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, జగ్గయ్యపేట ఎంపీడీవో, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు పంపినట్లు ఆయన తెలిపారు. సదరు భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. జిల్లా పరిషత్కు చెందిన ప్రభుత్వ భూమిపై అక్రమ ఆక్రమణలు లేదా లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కరిసే మధు డిమాండ్ చేశారు. ప్రజా ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి పారదర్శకంగా విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరారు.