అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపులో పాల్గొన్న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పటిష్ట బందోబస్తుతో ప్రశాంతంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు
విజయవాడ: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పటిష్ట పోలీసు భద్రత, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రశాంతంగా ముగిశాయి. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ అమ్మవారి దర్శనాలు సులభతరం చేయడమే లక్ష్యంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ముఖ్యంగా రద్దీ అధికంగా ఉండే మూలా నక్షత్రం రోజుతో పాటు ఉత్సవాల చివరి రోజైన విజయదశమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టారు. మోడల్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారు.
రద్దీ అధికంగా ఉన్న సీతమ్మవారి పాదాల ఘాట్, వినాయకుడి గుడి పరిసర ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ స్వయంగా పర్యటించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
విజయదశమి సందర్భంగా సాయంత్రం కృష్ణానది తీరంలోని దుర్గాఘాట్ వద్ద శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించిన అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపులో నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఇతర పోలీసు అధికారులతో కలిసి పాల్గొన్నారు.
మహోత్సవాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు, విధుల్లో అహోరాత్రులు శ్రమించిన పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పోలీసు సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తూ పోలీస్ కమిషనర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.