మదనపల్లెలో ఆసక్తికర దృశ్యం.. నవ్వుతూ పలకరించుకున్న టీడీపీ, వైసీపీ అభ్యర్థులు
పక్కపక్కనే కూర్చొని నామినేషన్లు దాఖలు.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండగా, మదనపల్లెలో మాత్రం ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. రాజకీయంగా వేర్వేరు పార్టీలకు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థులు నామినేషన్ కేంద్రంలో ఆత్మీయంగా పలకరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మదనపల్లెలో టీడీపీ, వైసీపీకి చెందిన చైర్పర్సన్ అభ్యర్థులు శ్రీరామ్, చినబాబు, జింక వెంకట చలపతి నామినేషన్ కేంద్రంలో నవ్వుతూ ఒకరినొకరు పలకరించుకున్నారు. పక్కపక్కనే కూర్చొని నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య సాధారణంగా కనిపించే వాదోపవాదాలకు భిన్నంగా, అభ్యర్థులు స్నేహపూర్వకంగా వ్యవహరించడం అక్కడి వారిని ఆకట్టుకుంది. రాజకీయ పోటీ ఎన్నికల వరకే పరిమితమై, వ్యక్తిగత సంబంధాలు, పరస్పర గౌరవం కొనసాగాలనే సందేశాన్ని ఈ దృశ్యం ఇచ్చింది.
ఎన్నికల వేళ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి ప్రశాంతమైన, స్నేహపూర్వక వాతావరణం నెలకొంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.