భక్తులకు అసౌకర్యం కలగకుండా పైడితల్లి అమ్మవారి దర్శన ఏర్పాట్లు
- ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఆర్. దామోదర్
- భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
విజయనగరం | ఎన్ టుడే న్యూస్: శ్రీ పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవం ఈ నెల 26న, సిరిమానోత్సవం 27న జరగనున్న నేపథ్యంలో భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం జిల్లా ఎస్పీ ఆర్. దామోదర్‌తో కలిసి ఉత్సవాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉత్సవాల నిర్వహణలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి, ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఆర్డీవో సుధాసాగర్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావుతో పాటు పోలీసు, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.