నీటి ఎద్దడి నివారణకు గ్రామసభల్లో అవగాహన
ప్రతి పొలంలో పంట కుంట, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలి
భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణపై అధికారుల సూచనలు
రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా | అక్టోబర్ 22 | ఎన్ టుడే న్యూస్: ఎల్‌నినో ప్రభావంతో కరువు తీవ్రత పెరిగి భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశాల నేపథ్యంలో నీటి సంరక్షణ చర్యలపై రామన్నపేట మండలంలోని జనంపల్లి, ఇస్కిళ్ల, ఉత్తటూరు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం, భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వనరులను సంరక్షించడంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.
నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం
ప్రతి రైతు పొలంలో పంట కుంట, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి గ్రామంలో ఊట కుంట ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వర్షపు నీరు వృథాగా వెళ్లకుండా నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చని వివరించారు.
భూమి కోతకు గురికాకుండా వర్షపు నీటిని ఒడిసిపట్టే పనులను గుర్తించాలని, వి.బి.-జి. రామ్ పథకం కింద చేపట్టేందుకు అనువైన పనులపై గ్రామస్థులు దృష్టి సారించాలని సూచించారు. భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తగ్గించేందుకు ఇప్పటి నుంచే నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
గ్రామసభల్లో పాల్గొన్న అధికారులు
ఈ గ్రామసభల్లో మండల ప్రత్యేక అధికారి రాఘవరెడ్డి, తహసీల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి, ఎంపీడీవో రాములు, వ్యవసాయ అధికారి ఏజాజ్ అహ్మద్, ఆశీష్ రాఘవ, ఎంపీవో రఫీ, ఏపీవో వెంకన్న, ఏపీఎం జానీ, గోపాల్, సర్పంచ్ సరోజ, వార్డు సభ్యులు, వివిధ శాఖల సిబ్బంది, మండల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.