బూరుగుగూడెం రాజకీయాల్లో గడ్డం లోకేశ్వర్ రెడ్డి భవిష్యత్తుపై ఉత్కంఠ
సర్పంచ్ రిజర్వేషన్‌తో మారిన సమీకరణాలు.. ఎంపీటీసీ బరిలోకి గడ్డం లోకేశ్వర రెడ్డి దిగుతారా?
లేక ఏదో కారణంతో మొండి చేయి చూపిస్తారా?
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామ రాజకీయాల్లో గడ్డం లోకేశ్వర్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వెలమ దొరల పాలన కాలం నుంచి రాజకీయ నేతృత్వంతో గుర్తింపు పొందిన గడ్డం సత్యనారాయణ రెడ్డి కుటుంబానికి చెందిన మనుమడైన లోకేశ్వర్ రెడ్డి, ప్రస్తుత వైసీపీ నాయకుడు గడ్డం సత్యనారాయణ రెడ్డి అనుంగు శిష్యుడును ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన దేశిరెడ్డి రాఘవరెడ్డికి సన్నిహిత అనుచరుడిగా పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఆయన, గ్రామ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో స్థానికంగా రాజకీయ చర్చకు తెరలేచింది. బూరుగుగూడెం సర్పంచ్ స్థానం ఓసీ జనరల్‌కు కేటాయిస్తే వైసీపీ అభ్యర్థిగా లోకేశ్వర్ రెడ్డి బరిలోకి దిగుతారని ఆశించిన వర్గాలకు రిజర్వేషన్ ప్రక్రియ నిరాశ కలిగించినట్లు తెలుస్తోంది. సర్పంచ్ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో ఆయన పోటీకి సంబంధించి సమీకరణాలు మారాయి. దీంతో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఉంటుందన్న ఆశలు తాత్కాలికంగా సన్నగిల్లాయి. అయితే చాట్రాయి మండల పరిధిలోని పోతనపల్లి, చాట్రాయి, చనుబండ, మర్లపాలెం గ్రామాలకు సంబంధించిన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల రిజర్వేషన్లలో ఓసీ జనరల్‌కు అవకాశం రావడంతో బూరుగుగూడెం ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. సర్పంచ్ స్థానంలో అవకాశం దక్కకపోయినా, ఎంపీటీసీ ఎన్నికల్లో అనుకూలమైన స్థానం నుంచి లోకేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారా అన్న చర్చ స్థానికంగా మొదలైంది. చాట్రాయి మండల వైసీపీ రాజకీయాల్లో దేశిరెడ్డి రాఘవరెడ్డి మాటకు ప్రాధాన్యం ఉంటుందనే అభిప్రాయం ఆయన ఎవరి పేరు ఖరారు చేస్తే వారే అని పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నేపథ్యంలో లోకేశ్వర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఆయన తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. రాఘవరెడ్డి అనుంగ శిష్యుడిగా వైసీపీలో చురుకుగా వ్యవహరిస్తున్న లోకేశ్వర్ రెడ్డికి పోటీ చేసే అవకాశం కల్పిస్తారా, లేక మరో రాజకీయ బాధ్యత అప్పగిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో లోకేశ్వర్ రెడ్డి తదుపరి అడుగుపై బూరుగుగూడెం గ్రామంతో పాటు చాట్రాయి మండల రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఆయన రాజకీయ భవిష్యత్తును దేశిరెడ్డి రాఘవరెడ్డి ఏ విధంగా నిర్దేశిస్తారన్నది ఇప్పుడు స్థానికంగా చర్చకు దారితీస్తోంది. పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది, రాఘవరెడ్డి రాజకీయ గురువు అయిన గడ్డం సత్యనారాయణ రెడ్డి మనుమడు లోకేశ్వర్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగుతారా లేక మొండి చేయి చూపిస్తారా అన్నది అధికారిక స్పష్టత వచ్చే వరకు వేచి చూడాల్సిందే.