రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది
రామన్నపేట, అక్టోబర్ 17: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో కోర్టు ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా సమితి చైర్పర్సన్ జి. సబిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ వేడుకలు సమాజంలో ఐక్యతను, సంతోషాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ వేడుకల్లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి. రత్నకుమారి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి. సత్తయ్య, రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఏ. మజీద్, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయస్థాన సిబ్బంది, పోలీసు అధికారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అందరూ కలిసి బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.