హన్మకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఆటపాటలతో సందడిగా సాగిన సంబరాలు
ఉత్తమ బతుకమ్మకు భరోసా సెంటర్ సిబ్బందికి ప్రథమ బహుమతి
మహిళా పోలీసులతో కలిసి బతుకమ్మ పాటలు పాడి నృత్యాలు చేసిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
హన్మకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు సిబ్బంది కోసం గురువారం సాయంత్రం హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవితతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
మహిళా సిబ్బందితో కలిసి ఆటపాటలు
పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, డీసీపీ దార కవిత సంప్రదాయ బతుకమ్మ పాటలు ఆలపిస్తూ మహిళా సిబ్బందితో కలిసి నృత్యాలు చేశారు. విధి నిర్వహణలో నిరంతరం బాధ్యతలు నిర్వర్తించే పోలీసు సిబ్బందికి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తాయని కమిషనర్ పేర్కొన్నారు.
ఎంత ఆధునిక జీవనశైలికి అలవాటు పడినా మన మూలాలను, సంస్కృతి సంప్రదాయాలను మరచిపోకూడదని ఆమె అన్నారు. హైదరాబాద్ వంటి మహానగరాలతో పోలిస్తే వరంగల్‌లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు.
ఉత్తమ బతుకమ్మకు బహుమతులు
వివిధ రకాల సహజసిద్ధమైన పూలతో ఆకర్షణీయంగా బతుకమ్మను రూపొందించిన భరోసా సెంటర్ సిబ్బందికి ప్రథమ బహుమతిని అందజేశారు. బతుకమ్మ పాటలు ఆలపించిన సుబేదారి పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ స్వప్నను పోలీస్ కమిషనర్ అభినందించి ప్రత్యేక బహుమతిని అందించారు.
ప్రత్యేక కొలనులో బతుకమ్మల నిమజ్జనం
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కొలనులో మహిళా సిబ్బంది తమ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. సంప్రదాయ పద్ధతిలో గంగాప్రవేశం నిర్వహించి గౌరమ్మకు భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు.
ఈ వేడుకల నిర్వహణకు సహకరించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, డీసీపీ దార కవిత, అడిషనల్ డీసీపీలు రాయల ప్రభాకర్ రావు, సురేష్, వేముల శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ స్పర్జన్ రాజ్, వెల్ఫేర్ ఆర్ఐ సతీష్, ఎం.టి. ఆర్ఐ శ్రీధర్, ఆర్ఎస్ఐ శ్రావణ్‌తో పాటు ఇతర సిబ్బందికి మహిళా పోలీసు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.