22న మంచిర్యాలలో బీసీ అలై బలై.. విజయవంతం చేయాలి: నరెడ్ల శ్రీనివాస్
బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధనే లక్ష్యం
మంచిర్యాల: బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఈ నెల 22వ తేదీ గురువారం ఉదయం 11:30 గంటలకు మంచిర్యాల పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో ‘బీసీ అలై బలై’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
బీసీలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నరెడ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల నేపథ్యంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడంతో పాటు కులగణన, రాజకీయ ప్రాతినిధ్యం, విద్య, ఉద్యోగాలు, ఆర్థిక రంగాల్లో న్యాయమైన వాటా వంటి అంశాలపై బీసీల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
బీసీల హక్కుల సాధనతో పాటు రాజ్యాధికార లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సింగరేణి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, మేధావులు, మహిళలు, విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘బీసీ అలై బలై’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో బీసీ సమాజ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ణకంటి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు బొలిశెట్టి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి బియ్యాల సత్తయ్య, మంచిర్యాల సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ షఫీ, సిటీ ఉపాధ్యక్షుడు ఎండీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.