ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి సంఘీభావం
ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి: రఘునాథ్ వెరబెల్లి
మంచిర్యాల: తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టిన నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి సంఘీభావం తెలిపారు. కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించి, వారి ఆందోళనకు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారిని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయకూడదన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎం నిధులను సకాలంలో విడుదల చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను చెల్లించడంలో జాప్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది చేపట్టిన దీక్షకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బేర సత్యనారాయణ, కుర్రె చక్రి, అమిరిశెట్టి రాజ్ కుమార్, పల్లి రాకేష్, ఈర్ల సదానందం తదితరులు పాల్గొన్నారు.