తిరువూరు లైబ్రరీకి రూ.10 వేల విలువైన పుస్తకాల వితరణ
తిరువూరు: వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో పాటు పాఠకులకు ఉపయోగపడేలా జన విజ్ఞాన వేదిక (జెవివి) రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం. రాం ప్రదీప్ పుస్తకాల వితరణ చేపట్టారు. సుమారు రూ.10 వేల విలువైన వివిధ రకాల పుస్తకాలను ఆదివారం స్థానిక గ్రంథాలయానికి జెవివి జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. హరికృష్ణ చేతుల మీదుగా అందజేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండటం ఎంతో ప్రయోజనకరమని, ఈ పుస్తకాలు విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు పరీక్షల సన్నద్ధతకు తోడ్పడతాయని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. పుస్తకాలను అందించిన రాం ప్రదీప్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వాహకులు ఎస్. నాగేశ్వరరావు, జె. శ్రీలత, జన విజ్ఞాన వేదిక నాయకులు పి. శీనయ్య, ఎస్.డి. సుభానీ, జి. సురేంద్రనాథ్‌తో పాటు పలువురు పాఠకులు పాల్గొన్నారు.