క్యాన్సర్ మందుల ధరలకు కళ్లెం.. 70 శాతం వరకు తగ్గే అవకాశం
క్యాన్సర్తో బాధపడుతున్న రోగులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందుల ధరలను నియంత్రించేందుకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) చర్యలు చేపట్టింది. గుర్తించిన 137 నాన్-షెడ్యూల్డ్ మందులపై ట్రేడ్ మార్జిన్ను గరిష్ఠంగా 30 శాతానికి పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సంబంధిత మందుల ధరలు గరిష్ఠంగా 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని సమాచారం. సవరించిన ధరలు నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ జాబితాలో రొమ్ము, ప్రోస్టేట్, పెద్దపేగు, గర్భాశయ క్యాన్సర్ల చికిత్సకు ఉపయోగించే మందులు కూడా ఉన్నాయి. క్యాన్సర్ చికిత్స కోసం అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్న రోగులు, వారి కుటుంబాలకు ఈ నిర్ణయం ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. అయితే, అన్ని క్యాన్సర్ మందుల ధరలు 70 శాతం తగ్గుతాయని భావించకూడదు. ఆయా మందుల ధరల్లో వాస్తవ తగ్గింపు సవరించిన ధరల ఆధారంగా మారుతుంది.