చిట్యాలలో ఈ నెల 22 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు
* రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి
భారత పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో 2026–27 సీజన్‌కు సంబంధించి ఈ నెల 22 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయని చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నర్ర వినోద మోహన్ రెడ్డి తెలిపారు. చిట్యాల మండలంలోని కావేరి జిన్నింగ్ మిల్, నార్కట్‌పల్లి మండలంలోని వరలక్ష్మి కాటన్ మిల్స్‌లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పత్తి రకాన్ని బట్టి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.8,667, రూ.8,617, రూ.8,567గా నిర్ణయించినట్లు వెల్లడించారు. పత్తిలో తేమ శాతం, నాణ్యతా ప్రమాణాలను బట్టి ధరలో మార్పులు ఉంటాయని తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా ముందుగా స్లాట్ బుక్ చేసుకొని, కేటాయించిన తేదీన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. పత్తిని ఆరబెట్టి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలని కోరారు.
కొనుగోళ్లకు సంబంధించిన వివరాల కోసం సీసీఐ టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 5779, వాట్సాప్ నంబర్ 88972 81111ను సంప్రదించాలని మార్కెట్ కమిటీ చైర్పర్సన్, సభ్యులు రైతులకు సూచించారు.